33.7 C
Hyderabad
April 30, 2024 01: 58 AM
Slider ప్రత్యేకం

జగన్ ముందు మంత్రులు… పదును లేని కోరలు…

#CM Jagan

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రస్తుత చర్చనీయాంశం. రాష్ట్ర మంత్రివర్గంలో సామాజిక సమీకరణలకు అనుగుణంగా పదవులు దక్కడం సర్వ సాధారణం.

అయితే..తాజాగా రాజీనామా సమర్పించిన మంత్రివర్గంలో ఏకంగా ఒక ఎస్ సీ మహిళా ఎమ్ ఎల్ ఏ మేకతోటి సుచరితకు అత్యంత కీలకమైన హోమ్ శాఖ ఇవ్వడం, అలాగే …రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా అయిదుగురు ఉప ముఖ్య మంత్రుల్ని నియమించడం ఒక సంచలనాత్మక నిర్ణయం.

అప్పట్లోనే ఈ మత్రివర్గం రెండున్నర సంవత్సరాలు మాత్రమే ఉంటుందని, ఆపై రానున్న రెండున్నర సంవత్సరాలలో వీరి స్థానంలో కొత్తవారు మంత్రులుగా ఉంటారని వై ఎస్ జగన్ ప్రకటించారు.

ఇదేమీ అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదు కనుక ఎవరికీ ఈ విషయంలో అసంతృప్తి లేదని తాజా మాజీ మంత్రులు అంటున్నారు. అయితే…వచ్చే రెండు సంవత్సరాలు అధికార వై ఎస్ ఆర్ సీపీ కి అత్యంత కీలకమైన సమయం.

పార్టీని తిరిగి అధికారంలోకి తేవడానికి ప్రతి అంశం తోడ్పడాలి. చివరి పాలనా సంవత్సరంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై ఆ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలా వద్దా అనేది ఓటర్ నిర్ణయించుకోవడం జరుగుతుంది. ఇది దృష్టిలో ఉంచుకొని సమర్ధవతంగా పనిచేయగల మంత్రివర్గం నియమించే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు తెలుస్తోంది.

జిల్లాలు, కులాలు, మతాలు వారీగా మంత్రి వర్గ కూర్పు ఉండడం సహజం. అయితే ఈ సారి ఉప ముఖ్యమంత్రుల నియామకం ఉండేదీ లేనిదీ ఇంకా స్పష్టత లేదు. తాజా మాజీలలో కనీసం 5 నుంచి 8 మందికి కొత్త మంత్రివర్గంలో స్థానం ఉండగలదని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ప్రభుత్వంపై ప్రజలలో నమ్మకం క్రమంగా తగ్గుతోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో మాజీ మంత్రుల సేవలను పార్టీని బలోపేతం చేయడానికి వినియోగించే అవకాశం ఉంది.

ఇప్పటివరకు అన్నీ తానై ప్రభుత్వాన్ని నడిపించిన, నడిపిస్తున్న వై ఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో మంత్రుల పాత్ర నామ మాత్రం అనే విమర్శలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చెప్పిందే వేదంగా మంత్రులు పనిచేయాలి తప్ప సొంత నిర్ణయాధికారం ఎవరికీ లేదని పార్టీ వర్గాలలో వినిపిస్తుంది.

సీనియర్ మంత్రి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి ఒకరిద్దరు మినహాయిస్తే మిగతా మంత్రులకు ఆ స్వేఛ్చ లేదని పరిశీలకుల అభిప్రాయం. మంత్రిత్వ శాఖకు చెందిన ప్రభుత్వ అధికారులు సైతం నేరుగా ముఖ్యమంత్రికి జవాబుదారీగా ఉండడం జగన్ ప్రభుత్వం ప్రత్యేకత అంటారు.

అటువంటి అధికారం లేని మంత్రిగా ఉండే కంటే సాధారణ ఎమ్ ఎల్ ఏ గా ఉండడమే మేలని కొందరు నేతలు వారి అనుయాయుల దగ్గర అసంతృప్తి ప్రకటించడం విశేషం. తాజా మాజీలు రాబోయే రెండు సంవత్సరాలకాలంలో పార్టీ శ్రేయస్సు కోసం ఎలా పనిచేస్తారు అనే దానిపై పార్టీ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయని విశ్లేషకుల భావన.

తీసేసిన వారిలో అసమ్మతి పెరిగితే…..

మాజీ మంత్రులు, కొత్త మంత్రుల మధ్య పరస్పర సహకారం ఏ మేరకు ఉండగలదు అనే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజా మాజీ మంత్రులలో అసంతృప్తి పెరిగితే ప్రతిపక్షాలు వారికి గేలం వేయడం ఖాయమని తెలుస్తోంది.

ఇప్పటికే భాజపా, తెదేపాల నుంచి ఆకర్ష్ ప్రయత్నాలు మొదలైనట్లు సమాచారం. దీనికి విరుగుడుగా వై ఎస్ జగన్ ప్రతి వ్యూహం ఏమిటనేది తెలియాల్సి ఉంది. గత ఎన్నికలలో 151 సీట్లు కట్టబెట్టిన ప్రజలు వచ్చే ఎన్నికలలో ఎలా స్పందిస్తారు అనేది ఇప్పుడే ఊహించడం సహేతుకం కాదు.

ఎన్నికల నాటికి ఉత్పన్నంకాగల రాజకీయ పార్టీల వ్యూహ ప్రతి వ్యూహాలకు అనుగుణంగా ఓటర్ నిర్ణయం ఉంటుందని చెప్పవచ్చు.
ఒక సారి రాష్ట్ర ఆర్థిక స్థితి గమనిస్తే… ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అప్పులతో ప్రారంభమై ఇప్పుడు అంతకు ఎన్నో రెట్లు అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.

దీనికి తోడు ప్రజాకర్షక పథకాల పేరుతో ప్రజలకు కోట్లాది ప్రజాధనం పంచిపెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక దుస్థితి మరింత దిగజారుతోందని వారు గణాంకాలతో సహా వివరిస్తున్నారు. రాబోవు ఎన్నికలలో ఎవరు అధికారంలోకి వచ్చినా ఈ అప్పులభారం మోయక తప్పదని హెచ్చరిస్తున్నారు.

అత్యంత కీలకమైన విద్య, వైద్య రంగాలను పటిష్ఠ పరచ కుండా, మౌలిక సదుపాయాలు కల్పించకుండా, ఇలా కోట్లాది రూపాయలు ప్రజలకు పప్పూ బెల్లాల్లా పంచుతుంటే … మొత్తం సమాజంలో నిస్తేజం ఏర్పడి, ప్రజలలో సోమరితనం పెరిగే ప్రమాదం ఉందని సామాజిక శాస్త్ర నిపుణులు అంటున్నారు.

వాస్తవంగా అవసరం ఉన్నవారికి ఆర్థిక తోడ్పాటు అందించడం తప్పు కాదు. కానీ అపాత్ర దానం వల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందని ప్రజాస్వామిక వాదులు అంటున్నారు.

ఇటువంటి తిరోగమన దిశలో సాగుతున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ అంశంపై ఎవరు, ఎలా విమర్శించినా దాని వల్ల ప్రభుత్వానికి కొత్తగా వచ్చే నష్టం ఏమీ లేదు.

మాజీ లైన మంత్రులు ఊపిరి పీల్చుకుంటారు. కొత్తగా పదవులు స్వీకరించే మంత్రులు కొద్ది రోజులలో దానికి అలవాటు పడతారు.
” పదును లేని కోరలు కేవలం అలంకార ప్రాయమే కదా! “

పొలమరశెట్టి కృష్ణారావు

Related posts

మతి తప్పి మాట్లాడుతున్న ఎమ్మెల్యే సైదిరెడ్డి

Satyam NEWS

అమ్మాయిలూ ఆపదలో ఉంటే వందకు ఫోన్ చేయండి

Satyam NEWS

హుజూర్ నగర్ డంపింగ్ యార్డును పరిశీలించిన బిఎస్పీ టి ఎస్ చీఫ్ కో-ఆర్డినేటర్

Satyam NEWS

Leave a Comment