33.7 C
Hyderabad
April 27, 2024 23: 02 PM
Slider ముఖ్యంశాలు

నేడు చదువుల తల్లి సావిత్రి బాయి ఫూలే జయంతి

#SavitribaiPhule

ఇప్పుడు నడుస్తున్న చరిత్ర రాజ్యపాలకుల కనుసన్నల్లో వక్రీకరించబడిన చరిత్ర. అవాస్తవాలని వాస్తావలుగా, వాస్తవాలను అసలే లేనివాటిగా మార్చి రాయబడిన చరిత్ర. పిడుతుల పక్షాన పోరాడిన ఎందరో మహాపురుషుల త్యాగాలను కాలగర్భంలో పాతరేసిన బూటకపు చరిత్ర. పూడ్చబడిన చరిత్రను తవ్వితీయ పలకా, బలపాలనే ఆయుధాలుగా మార్చి అక్షరానికి వారి ఆయుస్సు పోసి లక్షల అక్షరాలను మనకు అందించిన మహాత్మ సావిత్రి బాయి ఫూలే నిజమైన  ఉపాధ్యాయురాలు.

ఎక్కడ వచ్చింది మాత సావిత్రి పూలే కోరుకున్న ఆత్మగౌరవం?

పురుష అహంకారం, ఆధిపత్య పోకడ మహిళలకు ఆత్మగౌరవాన్ని అడ్డుకుంది అని మేము మాట్లాడితే…ఆత్మగౌరవం ఒక్కరు ఇస్తే వస్తదా ?  కొట్లాడి గుంజు కోవాలి గాని అంటూ పురుషాధిక్య వాదులు పుంఖాను పుంఖాల లెక్చర్లు ఇస్తారు. కానీ పొరపాటున కూడా అభ్యుదయ సంఘాలకు నాయకత్వాన్ని ఒక్క మహిళ కు కూడా ఇవ్వరు.

స్త్రీ పై మీరు రాసే కవిత్వాలు, పాటలు పొరపాటున కూడా వారిని చైతన్యం వైపు, అభివృద్ధి వైపు నడపవు. సొగసరివి, నీ కురులు జలపాతాలు అంటూ అత్యుత్సాహపు పొగడ్తలు వల్లించి మెల్లి మెల్లిగా వంటయింటికి మాత్రమే మహిళలను పరిమితం చేస్తారు. పిల్లలు కనే యంత్రం లాగా, ఒక వస్తువు లాగా ఈ సమాజం తయారు చేసింది. ఇక సనాతన సాంస్కృతిక ముచ్చట్లు వింటే అది మరో కథ. అసలు స్త్రీ కి అక్షరం, ఆయుధం, ఆస్తి ని నిరాకరించడంతోనే కదా అవి మొదలైంది. అభివృద్ధి కి ఆత్మగౌరవానికి స్వేచ్ఛ, స్వాతంత్ర్యానికి భారత మాత అని పేరు మాత్రమే పెట్టుకొని పంద్రాగస్టుకు, ఇరువైఆరు జనవరి కి దండేసి దండం మాత్రమే పెడుతున్నాం.

వెలివాడల తొలి పొద్దు

ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి అంధ సాంస్కృతిని  చూడం. ఇది భారత దేశం ప్రత్యేకత అనుకోవాలా? మహాస్వాధ్వి మాత సావిత్రి బాయి పూలే 1831 జనవరి 3 న మహారాష్ట్రలోని సతారా జిల్లా, నాయిగాం గ్రామంలో మలి కుటుంబంలో జన్మించారు. మనువాద ముఢాచారం ముక్కు పచ్చలారని వయసులోనే అంటే 9 ఏళ్ల బాల్యంలోనే 12 ఏళ్ల జ్యోతిరావు పూలే తో వివాహం జరిగింది.

సనాతన ధర్మ శాస్త్రం మొత్తం దేశంలోని స్త్రీ జాతిని వంటింటికి పరిమితం చేసి భర్తలకు బానిసలుగా మార్చి ఉన్న రోజులు అవి. ఆ రోజుల్లో స్వేచ్ఛ సమానత్వం, స్త్రీ జాతి విముక్తికి మహాత్మపూలే నే సావిత్రిబాయి కి గురువు అయ్యాడు. పూలే అడుగుజాడల్లో అక్షరాలు నేర్చి, శూద్ర, అతిశూద్ర, మహిళ అక్షరాస్యతకై సావిత్రి బాయి పని చేశారు.

1840 సంవత్సరం లో ఆమె మొదటి పాఠశాల స్థాపించారు. ఆమె ప్రారంభించిన విద్యా ఉద్యమం 1852 సంవత్సరం నాటికి 18 పాఠశాలల స్థాపనకు విస్తరించింది. చరిత్రలో ఇది ఒక మహోన్నత విద్యా విప్లవం.

ఇది ఒక మహోన్నత విద్యా విప్లవం

అభ్యుదయ భావాలను ఏనాడు విశ్వసించని మూఢ విశ్వాసాల సమాజం మొత్తం ఈ పరిణామంపై తిరుగుబాటు చేసింది. స్త్రీ జాతికి అందులోనూ అణచివేయబడ్డ సమాజానికి విద్యనేర్పటం శాస్త్రం విరుద్ధం అంటూ పెత్తందార్లు తోటి

మహిళలు పేడనీళ్లు, బురదనీళ్లు బకెట్లతో ఆమెపై చల్లి అవమానించారు. అంతటితో ఆగలేదు. రాళ్లతో కొట్టి అవమానించినా జ్యోతిరావు పూలే ప్రేరణతో సావిత్రి బాయి విద్యా ఉద్యమంలో వెనుదిరిగి చూడకుండా నడిచింది. బాల్య వివాహాలను వ్యతిరేకిస్తూ, వితంతు వివాహాలను ప్రోత్సహిస్తూ బాలిక, శిశు, మహిళ అభ్యున్నతికై అనేక సేవా కార్యక్రమాలు సవిత్రిబాయి ఫూలే నిర్వహించారు.

1873వ సంవత్సరం లో సత్యశోధక్ సమాజ్ స్థాపించినప్పటి నుండి అనేక సంఘసేవ కార్యక్రమాలలో కూడా సవిత్రిబాయి ఫూలే పాలు పంచుకున్నారు. 1890 లో మహాత్మా జ్యోతిరావు ఫూలే మహపరినిర్వాణం తర్వాత కూడా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ 1897 సంవత్సరం లో పునాలో  ప్రబలిన ప్లేగు వ్యాధి నివారణ కార్యక్రమలలో పాల్గొంటూ తాను అదే వ్యాధికి గురై మరణించారు.

ఆ తల్లి పోరాట త్యాగ ఫలితమే నేటి మన యావత్తూ పీడిత సమాజానికి విద్య అనే “మహా ఖడ్గం” అందించబడింది. నిరంతరం బడుగు జీవుల అభ్యున్నతికి కృషి చేసిన మహా పురుషుల త్యాగలను కాలరాసిన కులతత్వము, మూఢ విశ్వాసాలను, రాజక్రీయ క్రీడలని తరిమికొట్టాలి.

సంఘాలకు అతీతంగా కుల,మత, భాష,లింగ,ప్రాంత భేదాభిప్రాయాలను వదిలి మూకుమ్మడిగా మాతా సవిత్రిబాయి ఫూలే జయంతిని వాడా వాడల జరుపుకోవాలి. ఫూలే దంపతుల జన్మదినాలను జాతీయ ఉపాధ్యాయ, మహిళ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించి ప్రభుత్వమే ప్రతియేటా అధికారికంగా ఉత్సవాలు జరపాలని కోరుతున్నాను. అదే విధంగా వారికి భారతరత్న ఇచ్చి వారు చేసిన త్యాగాలకు ప్రభుత్వం కొంత అయిన రుణం తీర్చుకోవాలి.

మన్నారం నాగరాజు, తెలంగాణ లోక్ సత్తా పార్టీ, రాష్ట్ర అధ్యక్షుడు

Related posts

నర్సింగాయపల్లి కసుమురు మస్తాన్ దర్గా నిషాన్ లో గంధం

Satyam NEWS

విద్వేషపూరిత ప్రసంగం కేసులో ఆజంఖాన్ కు శిక్ష

Bhavani

అరసవెల్లిలో వైభవంగా ఉత్తరద్వార దర్శనం

Satyam NEWS

Leave a Comment