30.7 C
Hyderabad
April 29, 2024 04: 30 AM
Slider నిజామాబాద్

కామారెడ్డి మునిసిపల్ చైర్మన్ పీఠం ఎవరిదో

kareddy mch

మున్సిపాలిటీ ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీ చైర్మన్లకు ప్రభుత్వం రిజర్వేషన్ ఖరారు చేయడంతో ఆయా పార్టీల్లో అభ్యర్థుల ఎన్నిక ప్రారంభమైంది. కొత్త జిల్లాగా ఏర్పడిన మొదటిసారి జరుగుతున్న కామారెడ్డి మున్సిపాలిటీ ఎన్నిక ప్రతిష్టాత్మకం కానుంది.

మూడు ప్రధాన పార్టీలు పోటీలో బలంగా మారనుండటంతో గెలుపేవరిదంటూ చర్చ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా కామారెడ్డి మున్సిపాలిటీ పేరు ప్రత్యేకమని చెప్పవచ్చు. ఇక్కడ రాజకీయంలో తలపండిన నేతలు పోటీలో ఉండటమే ప్రధాన కారణం. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా ప్రస్తుత ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, మాజీ మంత్రి షబ్బీర్ అలీల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది.

నాలుగు పర్యాయాలు షబ్బీర్ ఆలీపై అలవోకగా గెలిచిన గంప గోవర్ధన్ రికార్డ్ సృష్టించారు. ప్రస్తుతం ఆయన అధికార టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వ విప్ గా కొనసాగుతున్నారు. ఆయన సారథ్యంలో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా జరగబోయే ఈ మున్సిపాలిటీ ఎన్నికల బాధ్యతల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ స్థానిక ఎమ్మెల్యేలపై బాధ్యత పెట్టారు.

గత స్థానిక సంస్థల ఎన్నికల మాదిరిగానే మున్సిపాలిటీ ఎన్నికలు కూడా టిఆర్ఎస్ ఖాతాలో పడేలా, మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగిరేలా నాయకులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక కామారెడ్డి మున్సిపాలిటీ విషయానికి వస్తే అప్పటివరకు పంచాయతిగా ఉన్న కామారెడ్డి పట్టణం 1987 లో మున్సిపాలిటీగా  ఏర్పడిన తర్వాత మొట్ట మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ నుంచి 1988 లో మున్సిపల్ చైర్మన్ గా పార్శీ గంగయ్య ఎన్నికయ్యారు.

తర్వాత 1993 నుంచి 1995 వరకు ఆర్డీఓ ప్రత్యేక పాలన కొనసాగింది. 1995 లో టీడీపీ నుంచి చీల ప్రభాకర్ మున్సిపల్ పీఠాన్ని అధిరోహించారు. 2000 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మామిండ్ల లక్ష్మీ, అంజయ్య చైర్మన్ గా గెలవగా 2005 లో తిరిగి కాంగ్రెస్ పార్టీ నుంచి కైలాస్ శ్రీనివాస్ రావు గెలుపొందారు. 2010 నుంచి 2014 వరకు ఆర్డీఓ ప్రత్యేక పాలన కొనసాగింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 లో పిప్పిరి సుష్మ వెంకటి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి చైర్మన్ గా గెలిచారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండటంతో కొద్దీ రోజులకు ఆమె అధికార పార్టీలో చేరి 2019 వరకు పాలన కొనసాగించారు. ప్రస్తుతం మున్సిపాలిటీలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. ప్రస్తుతం కామారెడ్డి రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది.

రాష్ట్రంలో రెండవసారి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అన్ని ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలుస్తూ వచ్చింది. నాలుగు పర్యాయాలు కామారెడ్డి మున్సిపాలిటీపై ఎగిరిన కాంగ్రెస్ జెండాను తొలగించి ఈ సారి ఎలాగైనా గులాబీ జెండా ఎగురవేస్తామని టిఆర్ఎస్ నేతలు బల్లగుద్ది చెప్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కోట్లాది రూపాయలతో కామారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధి కొనసాగుతుందని వారు చెప్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్ కార్పొరేషన్ మినహాయించి కేవలం కామారెడ్డి మున్సిపాలిటీకి 63 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించిందని, వాటితో అభివృద్ధి శరవేగంగా కొనసాగుతుందని జరుగుతున్న పనులను పట్టణ ప్రజలకు చూపిస్తున్నారు.

ఈసారి టిఆర్ఎస్ పార్టీ గెలిస్తే మరిన్ని నిధులతో కామారెడ్డి రూపురేఖలు మారుతాయని స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను సైతం బరిలోకి దింపుతోంది ఆ ఆర్టీ. మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేసి కామారెడ్డి మున్సిపాలిటీ చరిత్రను తిరగరాయడానికి సిద్ధం అవుతోంది.

ఇక కాంగ్రెస్ పార్టీ గురించి చూస్తే 1988 నుంచి ఒక్క పర్యాయం తప్ప నాలుగు పర్యాయాలు మున్సిపాలిటీలో తిరుగులేని పార్టీగా గెలుపొందిన పారీ కాంగ్రెస్. అప్పటినుంచి క్యాడర్ ను కాపాడుకుంటూ వస్తున్నారు. అధికార పార్టీకి దీటుగా అభ్యర్థులను బరిలో నిలపడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఎలాగైనా ఈసారి కూడా మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి కామారెడ్డి చరిత్ర పుటల్లో కాంగ్రెస్ పార్టీని నిలుపుతామని స్పష్టం చేస్తున్నారు. గడిచిన అసెంబ్లీ, పార్లమెంట్, సాధారణ ఎన్నికల్లో తమ ఓటు బ్యాంకు ఎటు పోలేదని చెప్తున్నారు. గతంలో షబ్బీర్ అలీ చేసిన అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయని విశ్వసిస్తున్నారు.

ఇన్ని సంవత్సరాల కామారెడ్డి మున్సిపాలిటీ చరిత్రలో క్యాడర్ లేని పార్టీగా మిగిలిన ఏకైక పార్టీ బీజేపీ. కానీ గత కొద్ది కాలంగా అనూహ్య రీతిలో కామారెడ్డి పట్టణంలో బీజేపీ పుంజుకుంది. గత మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ నుంచి 8 మంది కౌన్సిలర్లు గెలిచి పట్టణంలో బీజేపీ హవా ఉందని రుజువు చేశారు.

కొన్ని కారణాల వల్ల అందులోంచి ఏడుగురు కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ లో చేరగా బీజేపీ నుంచి ఒకే ఒక కౌన్సిలర్ గా పుల్లూరు జ్యోతి ఉన్నారు. ప్రస్తుతం బీజేపీకి గ్రామ, మండల స్థాయిలో క్యాడర్ ఉందని, వారు చెప్తున్నారు. గత స్థానిక ఎన్నికల్లో అక్కడక్కడా బీజేపీ నుంచి వార్డు మెంబర్లు గెలిచారు.

పట్టణంలో తమ పార్టీ బలంగా ఉందని 49 వార్డుల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేసి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుని అవినీతి రహిత పాలన అందిస్తామని చెప్తున్నారు. దానికోసం ఇప్పటికే ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇటీవల అన్ని వార్డుల్లో పాదయాత్రలు సైతం నిర్వహించారు.

ఈసారి ఎలాగైనా మెజారిటీ స్థానాలు గెలిచి మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో కంటే ప్రస్తుతం కామారెడ్డి మున్సిపాలిటీ పరిధి పెరిగింది. గతంలో ఒక్క కామారెడ్డి పట్టణం మాత్రమే మున్సిపాలిటీగా ఉండేది. మున్సిపాలిటీ పక్కన ఉన్న గ్రామాలను మున్సిపాలిటీలో ప్రభుత్వం విలీనం చేసింది.

అడ్లూర్, టెక్రియల్, లింగపూర్, దేవునిపల్లి, రామేశ్వర్ పల్లి, పాత రాజంపేట, సరంపల్లి గ్రామాలు ప్రస్తుతం మున్సిపాలిటీలో విలీనం అయ్యాయి. గతంలో మున్సిపాలిటీలో 33 వార్డులు ఉండగా ప్రస్తుతం అది 49 కి చేరింది. మున్సిపాలిటీ ఓటర్లు 85 వేల 168 మంది ఉండగా ఇందులో 41817 మంది పురుషులు, 43326 మంది స్త్రీలు, 25 మంది ఇతరులు ఉన్నారు. మొత్తం 116 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.

కొత్తగా 16 వార్డులు కావడంతో ఈసారి పోటీ అధికంగా ఉండనుంది. ప్రధాన పార్టీల నుంచి ఒక్కొక్క వార్డు నుంచి నలుగురు లేదా ఐదుగురు పోటీకి సిద్ధంగా ఉన్నారు. మొత్తం మీద కామారెడ్డి మున్సిపాలిటీలో త్రిముఖ పోరు నెలకొననుంది.

మరోవైపు ప్రభుత్వం రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేసింది. కామారెడ్డి పట్టణంలో 49 వార్డులలో 12 వార్డులకు జనరల్, 13 వార్డులకు జనరల్ మహిళ, 10 వార్డులకు బీసీ జనరల్, 09 వార్డులకు బీసీ మహిళ, ఒక వార్డుకు ఎస్టీ, 02 వార్డులకు ఎస్సి జనరల్, 02 వార్డులకు ఎస్సి మహిళ గా రిజర్వేషన్ ఖరారు చేసింది.

మున్సిపల్ చైర్మన్ గా మాత్రం జనరల్ మహిళ గా పేర్కొంది. గతంలో రెండు పర్యాయాలు మహిళలే చైర్మన్లుగా కొనసాగారు. ముచ్చటగా మూడోసారి మహిళకు రిజర్వేషన్ రావడంతో ఆయా పార్టీలతో పాటు ప్రజల్లో సైతం తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఈ ఎన్నికల్లో గెలవడానికి అధికార పార్టీ సహా అన్ని పార్టీలు తమ అస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. 22 న జరగబోయే ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవడానికి సన్నద్ధం అవుతున్నారు. మరి మున్సిపాలిటీపై ఎవరి జెండా ఎగురుతుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

Related posts

షర్మిల ఖమ్మం జిల్లా ప్రజా ప్రస్థానం అబ్జర్వర్ గా ఆదెర్ల శ్రీనివాసరెడ్డి

Satyam NEWS

విజయనగరం ఎమ్మెల్యే ను కలిసిన కొత్త మున్సిపల్ కమిషనర్

Satyam NEWS

ఆంధ్రాలో బీజేపీ నాయకులలో మార్పు రాదా?

Satyam NEWS

Leave a Comment