కరీంనగర్ నిరుద్యోగులకు ప్రాధాన్యమిస్తూ ఏర్పాటు చేస్తున్నఐటీ టవర్‌ను ఈ నెల 18న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని ,ఉద్యోగావకాశాలు పెంచుతారనే నమ్మకం ఉన్న కంపెనీలకే ఈ ఐటీ టవర్‌లో అవకాశం కల్పిస్తున్నామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్,మంత్రి గంగుల కమలాకర్ లు పేర్కొన్నారు.
సోమవారం వారు మాట్లాడుతూ అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగానే జిల్లాలో ఐటీ టవర్‌ను నిర్మించామన్నారు. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగితో పోలిస్తే కరీంనగర్ ఐటీ ఉద్యోగికి రూ.30 వేలు జీవన వ్యయం ఆదా అవుతుందన్నారు. కరీంనగర్ వాళ్లకే 80 శాతం ఉద్యోగాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. మొత్తం 3000 నుంచి 3600 మందికి ఇక్కడ ఉపాధి లభిస్తుందని తెలిపారు. తొలి రోజునే దాదాపు 400 మంది ఉద్యోగులు కరీంనగర్ ఐటీ టవర్‌లో పని ప్రారంభిస్తారని పేర్కొన్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత తాము కరీంనగర్‌లో ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆలోచించామన్నారు. ఆ రోజు తమ ఆలోచనే నేడు ఐటీ టవర్‌గా మార్పు చెంది అనేక కంపెనీలు వచ్చేందుకు దోహదం చేసిందని చెప్పడానికి గర్వపడుతున్నామన్నారు. ఐటీ టవర్‌తో కరీంనగర్‌తో పాటు ఉత్తర తెలంగాణలోని విద్యార్థులకు మంచి ఉద్యోగాలు వస్తాయన్నారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు రసమయి, రవిశంకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు