ఇండోనేషియా నుంచి 13మంది కరీంనగర్ వచ్చారని, అందులో ఒకరికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని అందువల్ల ముందు జాగ్రత్త చర్యగా రేపటి నుంచి కరీంనగర్ నగరంలో ఎవరు ఇళ్ల నుంచి బయటికి రావద్దని మంత్రి గంగుల కమలాకర్ కోరారు.
నగరం లో కరోనా తీవ్రత ఉందని అందువల్ల ప్రార్ధనా మందిరాలకు కూడా ఎవరూ వెళ్లవద్దని మంత్రి సూచన చేశారు. ఇండోనేషియా నుంచి వచ్చిన 13 మంది కలెక్టరేట్ ప్రాంతాల్లో 48 గంటల పాటు పర్యటించారు కాబట్టి కలెక్టరేట్ నుంచి 3కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇంటింటా పరీక్షలు నిర్వహించేందుకు 100 బృందాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ శశాంక తెలిపారు.
ఇంటింటా పరీక్షలు నిర్వహించాలంటే అందరు ఇళ్లలోనే ఉండి సహకరించాలని ఆయన కోరారు. పెళ్లిళ్లు ,శుభకార్యాలు ఉంటే వాయిదా వేసుకోవడం ఉత్తమమని ఆయన అన్నారు. నగరం సురక్షితంగా ఉండాలంటే ప్రజలందరూ సహకరిస్తే సాధ్యమౌతుందని, నిత్యావసర వస్తువులు మినహా, అన్ని వ్యాపార సంస్థలు స్వచ్చందంగా మూసివేస్తేనే మంచిదని ఆయన అన్నారు.
ఇంటి వద్ద ఉండటం సామాజిక బాధ్యతగా గుర్తించాలని కలెక్టర్ అన్నారు. పోలీస్ కమీషనర్ కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ ఇదివరకు కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చే వారి వల్లనే వైరస్ వ్యాప్తి చెందేదని, ఇప్పుడు ఇతర దేశాలు, తెలంగాణేతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణీకుల వల్ల కూడా కరోనా వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు.
ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లలోని లాబొరేటరీలకు పరీక్షల నిమిత్తం వచ్చే వారి వివరాలు వైద్యాధికారులు అందించాలని, దీనివల్ల వారికి మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుందని అన్నారు. దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడేవారికి వైద్య పరీక్షలు చేయించాలని ఇటువంటి వారిని గుర్తించి ఇరుగు పొరుగు వారు అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో లిక్విడ్ సోప్స్, సానిటైజర్స్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు చేతులు శుభ్రపరుచుకోనేలా చూడాలని సూచించారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా అవగాహన కల్పించాలని అన్నారు. మందుల దుకాణాలలో ఎం.ఆర్.పి. కి మించి మాస్కులు, సానిటైజర్స్ అమ్మకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అధికారులు ఎవరు కరోనా పై మీడియా సమావేశాలు నిర్వహించవద్దని సూచించారు.