ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఉన్నట్లు అంగీకరించి తగిన చర్యలు చేపడుతున్నందుకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు కూడా కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తగిన చర్యలు తీసుకుంటున్నందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ఇదే విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పినప్పుడు ఆయన ను తీవ్రంగా విమర్శించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తక్షణ చర్యలు తీసుకోవడం అభినందనీయమని ఆమె అన్నారు. రాష్ట్రాన్ని లాక్ డౌన్ చేసేంత తీవ్రంగా కరోనా వైరస్ వ్యాప్తి ఉందని కాట్రగడ్డ ప్రసూన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం మూడు జిల్లాలను పూర్తిగా లాక్ డౌన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నదని ఆమె అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ సమయంలో పేదవారికి, రోజువారీ కూలీ పై ఆధారపడిన వారికి తగిన సహాయం అందచేయాలని ఆమె కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో లాగా కాకుండా అధికారులు నిష్పక్షపాతంగా పేదలకు నిత్యావసర వస్తువులు అందచేయాలని, పేదలను ఆదుకోవాలని కాట్రగడ్డ ప్రసూన కోరారు.