రాబోయే మునిసిపల్ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీకి ఎవరితో పోటీ లేదని 120 మున్సిపాలిటీ లు, 10 కార్పొరేషన్ లు తామే గెలుస్తున్నామని టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో శనివారం జరిగిన టీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు.
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు క్యాడర్ తో ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని ఆయన కోరారు. సర్వేలు అన్ని మనకే అనుకూలంగా ఉన్నాయి… బీజేపీ మనకు పోటీ అనే అపోహలు వద్దు..మనకు ఎవరితో పోటీ లేదు.. అని కేసీఆర్ అన్నారు.
పాత కొత్త నాయకులు సమన్వయంతో ఉండాలని ఆయన దిశానిర్దేశం చేశారు. పార్టీ ఒకసారి అభ్యర్థి ని ఫైనల్ చేసిన తర్వాత ఆ అభ్యర్థి గెలుపు కోసమే అందరూ పని చెయ్యాలని కేసీఆర్ అన్నారు. అవసరం ఉన్న చోట మంత్రులు ప్రచారం చేస్తారని ఆయన అన్నారు.
