పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి ఇస్లామిక్ దేశాలు అక్కడి మైనారిటీలుగా ఉన్న హిందువులను, సిక్కులను, పార్సీలను, జైన్ మతస్థులను మతపరమైన హింసకు గురి చేస్తున్నాయని, అందువల్ల వారికి రక్షణ కల్పించడానికే పౌరసత్వ సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని మేడ్చల్ జిల్లా బిజెపి అధ్యక్షుడు మాధవరం కాంతారావు అన్నారు. పౌరసత్వ చట్టానికి మన దేశంలో ఉన్న పౌరులకు ఎలాంటి నష్టం వాటిల్లదని ఆయన అన్నారు.
దేశాన్ని కాపాడుకోవడానికి కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం చేస్తున్న చర్యలను కాంగ్రెస్, మజ్లీస్ పార్టీలు అడ్డుకుంటున్నాయని ఆయన అన్నారు. దేశ పౌరులుగా ఉన్నవారికి ఎలాంటి నష్టం లేకపోయినా రాజకీయ కారణాలతో వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్న అల్లర్లను దేశ ప్రజలు ఇప్పటికే గుర్తించారని కాంతారావు అన్నారు.
ఈ విషయాలన్నీ బిజెపి కార్యకర్తలు ప్రజలకు వివరించి చెప్పాలని ఆయన కోరారు. నేడు కూకట్ పల్లి బిజెపి కార్యాలయం లో అసెంబ్లీ కన్వీనర్ రవి కుమార్ గౌడ్ అధ్యక్షతన కూకట్ పల్లి అసెంబ్లీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా మాధవరం కాంతారావు హాజరు అయ్యారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ CAA , NRC , NPR లపై త్వరలో మేధావుల సదస్సు జరుపుతామని చెప్పారు. అదే విధంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో, డివిజన్ లో మేధావుల సదస్సులు నిర్వహించాలని ఆయన కోరారు. ప్రతి నాయకుడూ, కార్యకర్త ఫోన్ ద్వారా 25 మందికి పౌరసత్వ చట్టం పై అవగాహన కల్పించాలని కాంతారావు కోరారు.
ఇది దేశాన్ని కాపాడుకోవాల్సిన సమయమని ఆయన అన్నారు. భారత్, పాకిస్తాన్ దేశాల ప్రధానుల మధ్య చాలా సందర్భాలలో జరిగిన ఒప్పందాలను పాకిస్తాన్ తుంగలో తొక్కి ఆయా దేశాల్లో ఉన్న మైనార్టీలపై మతదాడులు చేస్తున్నా మాట్లాడని కాంగ్రెస్, మజ్లీస్ పార్టీలు ఇప్పుడు గొడవ చేస్తున్నాయని ఆయన అన్నారు.
పాకిస్తాన్ నుంచి వచ్చే ముస్లింలను మన దేశంలోకి రానివ్వాలా ని కాంతారావు ప్రశ్నించారు. ఆ దేశాలలో హిందువులను చంపేస్తుంటే ఆ దేశం ముస్లింలను మనదేశంలోకి రానివ్వాలని అడగడం దేశ ద్రోహం కిందికి వస్తుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో నాయీనేని సూర్య ప్రకాష్ రావు , శ్రీకర్ రావు , శివాత్రి దామోదర్, సురేందర్ రెడ్డి, కంచి మహేందర్, కావ్య రెడ్డి, డివిజన్ అధ్యక్షులు నాగరాజు, మనోహర్, వినోద్ గౌడ్, గోపాల్ చౌదరి, నాగేందర్, సద్గుణ తదితరులు పాల్గొన్నారు.