27.7 C
Hyderabad
April 30, 2024 09: 07 AM
Slider సంపాదకీయం

కేసీఆర్ కు పాలాభిషేకం ఇక చాపచుట్టిన ప్రతిపక్షం

kcr rtc

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కాదని ఎవరూ ఏం చేయలేరని ఆర్టీసీ సమ్మె ద్వారా మరొక్కమారు రుజువు అయింది. రాజకీయ వ్యూహాలలో ఆరితేరిన కేసీఆర్ రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థలో తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. పరిపాలనలో కూడా తన పట్టు బిగించి కూర్చున్నారు. ప్రజా క్షేత్రంలో అయితే ఆయనకు బ్రహ్మరథం పట్టే ప్రజలు ఉన్నారు.

ఇన్ని జరుగుతున్నా అంతో ఇంతో ఆశతో బతుకుతున్న ప్రతిపక్షాలకు ఆర్టీసీ సమ్మెను కేసీఆర్ పరిష్కరించిన తీరు మరణశాసనం లాంటిది. ఒక్క ప్రతిపక్షాలే కాదు, రాష్ట్రంలో కేసీఆర్ ను ధిక్కరిద్దామని చూసిన ప్రతి ఒక్కరికి ఇది గుణపాఠం. రాష్ట్రంలో కొత్త గవర్నర్ వచ్చిన తర్వాత బిజెపి ఒక్క సారిగా తమ ఆశలు తీరే మార్గం దొరికిందని సంతోషపడింది. హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఘోర పరాజయం పాలైన తర్వాత కూడా బిజెపి మాటలు తగ్గలేదు.

గవర్నర్ ను ఆలంబన చేసుకుని రాజకీయం నెరపుదామని బిజెపి ఆశపడ్డది. అంతలో వచ్చిన ఆర్టీసీ సమ్మెతో రాజకీయంగా లాభపడాలని బిజెపి ఎంతో ప్రయత్నం చేసింది. గవర్నర్ వద్దకు పదే పదే వెళ్లడం, వినతి పత్రాలు ఇవ్వడంతో సరిపోయింది కానీ వారు ఆశించిన విధంగా ఏం జరగలేదు. గవర్నర్ కూడా తన పరిధిని దాటి రవాణా శాఖ మంత్రిని పిలిపించుకోవడానికి శతవిధాలా ప్రయత్నం చేశారు కానీ కనీసం మంత్రి కూడా గవర్నర్ వద్దకు వెళ్లలేదు. రవాణా శాఖ కార్యదర్శిని పంపి మమ అని పించారు.

న్యాయ స్థానాల విషయంపై వ్యాఖ్యలు చేయకూడదు కానీ అక్కడ కూడా ఆర్టీసీ సమ్మె పరిష్కారం కాలేదు. ఎప్పపుడైతే బిజెపి రంగంలోకి వచ్చిందో అప్పటి నుంచి  కేసీఆర్ కేంద్రం తీసుకువచ్చిన తాజా చట్టం గురించి ప్రస్తావించి, బిజెపి ఎంపిలను చొక్కా పట్టుకుని నిలదీయాలని పిలుపునిచ్చారు. దాంతో బిజెపికి ఆర్టీసీ సమ్మెలో పాలుపంచుకోవడం వల్ల లాభం కన్నా నష్టం ఎక్కువ అయింది.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఆర్టీసీ సమ్మెలో తొలి దశలో ఎంతో చురుకుగా పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి లీడ్ తీసుకుంటున్నట్లు అర్ధమైందో అప్పటి నుంచి వెనక్కి వెనక్కి పోయింది. దాంతో ఆ పార్టీ ఉన్నది కూడా పోగొట్టుకున్నది. కమ్యూనిస్టు పార్టీలు ఆర్టీసీ సమ్మెను ముందుకు తీసుకువెళ్లే శక్తిని ఆదిలోనే కొల్పోయాయి.

ఇక మిగిలింది టిజెఎస్. ఈ పార్టీకి ఎక్కడా యంత్రాంగం లేదనే విషయం మరో సారి రుజువైంది. ఇక మిగిలిన పార్టీలు టెంటు కనిపిస్తే మట్లాడే పార్టీలు తప్ప వ్యవహారం నడిపే పార్టీలు కాదు. ఈ దెబ్బతో ఆర్టీసీ లో ఇక యూనియన్లు ఉండకపోవచ్చు. ఉన్నా కేసీఆర్ సూచించిన వాళ్లే క్రియాశీలకంగా ఉండవచ్చు. కేసీఆర్ ను కాదని ఆర్టీసీలో ఇక ఏమీ జరిగే అవకాశం లేదు.

డిమాండ్లు తీర్చ కుండా సమ్మెను శాశ్వతంగా పరిష్కరించిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ మిగిలిపోతారు. ఇప్పుడు చాలా సంఘాలకు,  చాలా మంది రాజకీయ నాయకులకు మాదిరిగానే ఆర్టీసీ కార్మికులకు కూడా కేసీఆర్ దేవుడు. ఇక ప్రతినిత్యం కేసీఆర్ కు ప్రతి డిపో దగ్గరా పాలభిషేకాలు జరుగుతూనే ఉంటాయి.

Related posts

రోటరీ క్లబ్ 3160 డిస్ట్రిక్ట్ గవర్నర్ చే మహిళలకు కుట్టు మిషన్ల పంపిణి

Satyam NEWS

మోక్షజ్ఞ ఎంట్రీ దసరా నుంచేనా ??

Bhavani

తెలంగాణలో వ్యాపారాల కోసం ఏపి ప్రయోజనాల తాకట్టు

Satyam NEWS

Leave a Comment