కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి సతీమణి కావ్య రాజకీయాలలోకి వస్తారా? ఆమె ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తారో రారో తెలియదు కానీ రాజకీయ కార్యక్రమంలో మాత్రం ఆమె నేడు పాల్గొన్నారు. రాష్ట్రంలో మద్య నిషేధం విధించాలని కోరుతూ హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద బిజెపి నాయకురాలు డి కె అరుణ నిరాహార దీక్ష చేస్తున్నారు.
ఈ దీక్ష రెండో రోజుకు చేరుకున్నది. డి కె అరుణకు సంఘీభావం వ్యక్తం చేస్తూ పలువురు నిరాహార దీక్ష శిబిరం వద్దకు వచ్చారు. వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య కూడా ఉన్నారు. ఇప్పటి వరకూ ఎలాంటి రాజకీయ కార్యక్రమాలలో పాల్గొనని కావ్య ఇప్పుడు నేరుగా రాజకీయ కార్యక్రమంలో పాల్గొనడం ఆసక్తి కలిగిస్తున్నది.
ఎన్నికల సమయంలో తన భర్త కోసం ప్రచారం చేయడం తప్ప రాజకీయ కార్యక్రమాలకు రాని కావ్య ఇప్పుడు అరుణ నిరాహార దీక్షలో ప్రత్యేక ఆకర్షణగా మారారు. కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్నందున వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కావ్య అంబర్ పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని అందుకే ఇక నుంచి రాజకీయాలలో చురుకుగా పాల్గొనబోతున్నారని అంటున్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాలి.