కొచ్చిన్ వెళదామని 180 మంది అయ్యప్ప భక్తులు గో ఎయిర్ లో టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. ఇరుమడి సర్దుకుని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. కొద్ది సేపటిలో విమానం ఎక్కాలనే ఆదుర్దాలో వారు ఉన్నారు. ఎంత త్వరగా శబరిమల వెళ్దామా అనే తొందరలో వారు ఉండగానే చావు కబురు చల్లగా చెప్పినట్లు గో ఎయిర్ విమానయాన సంస్థ ఒక విషయం చెప్పింది.
అదేమిటంటే కొచ్చిన్ వెళ్లాల్సిన విమానం రద్దు చేశాము అని. అదేమని అడగడానికి అక్కడ ఎవరూ లేరు. మళ్లీ విమానం ఎప్పుడు ఉంటుందో చెప్పేవారు లేరు. దాంతో ఒక్క సారిగా అయ్యప్ప స్వాముల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఉదయం నుండి పచ్చి మంచినీరు లేకుండా ప్రాణాలు పోయే స్థితిలో ఉన్న తమను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమను మోసం చేసిన గో ఎయిర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. 180 మంది అయ్యప్ప భక్తులు ధర్నాకు దిగడంతో ఎయిర్ పోర్ట్ దద్దరిల్లింది. గో ఎయిర్ ఎయిర్ లైన్స్ తీరుపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా తమను పట్టించుకోలేదని ఎయిర్ లైన్స్ సంస్థకే అనుకూలంగా మాట్లాడుతున్నారని అయ్యప్ప స్వాములు ఆవేదన వ్యక్తం చేశారు.