33.7 C
Hyderabad
April 29, 2024 23: 28 PM
Slider గుంటూరు

జై కొడితేనే బతకాలి, కొట్టకపోతే చావాలా?

#Potula Balakotayya

సీఎం జగన్ కు అమరావతి బహుజన ఐకాస ప్రశ్న

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జై కొడితే బతకాలి. జై కొట్టకపోతే చావాలి అన్న రీతిలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మద్యం ధరలపై తన ఆవేశాన్ని వ్యక్తం చేసినందుకు ఓం ప్రకాష్ మృతి చెందారని, మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్, మాస్కు పెట్టుకోనందుకు  చీరాల కిరణ్ బాబు  మృతి చెందినట్లు చెప్పారు. ప్రభుత్వ విధానాలను  ప్రశ్నించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు  70 ఏళ్ళ రంగనాయకమ్మను, 72 ఏళ్ళ జర్నలిస్టు అంకబాబును అరెస్ట్ చేశారన్నారు. పలు చానళ్ళకు చెందిన మీడియా సంస్థల ప్రతినిధులకు 41 ఏ నోటీసులు ఇచ్చి రోజుల తరబడి విచారణ పేరిట వేధించారన్నారు.

వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి తనకు ప్రాణహాని ఉందన్నా,వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి పలుమార్లు తన ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పినా ప్రభుత్వం వినిపించుకోలేదన్నారు.  ప్రతిపక్ష పార్టీ నాయకులు కొమ్మా రెడ్డి పట్టాభి వంటి వారి ఇళ్ళపై దాడులు చేశారని,  పార్లమెంటు సభ్యులు రఘురామకృష్ణంరాజును అరెస్టు చేసి, అరికాళ్ళపై థర్డ్ డిగ్రీ ఉపయోగించారన్నారు. తెలుగుదేశం, జనసేన, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ వంటి ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నాయకుల పై 307  కేసులు పెట్టి అరెస్టులు చేశారని, కొందరిని జైళ్ళకు పంపారని తెలిపారు. తాజాగా స్వ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి,  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు  ప్రభుత్వ విధానాలపై, ముఖ్యమంత్రి తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తే, వారి సెక్యూరిటీని తగ్గించినట్లు తెలిపారు. తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ప్రాణాలకు  హాని ఉందని వాపోతున్నా పట్టించుకోక పోగా వేధింపులకు పాల్పడుతున్నారు అన్నారు.

అంటే ముఖ్యమంత్రికి జై కొడితే బతకాలి, లేకుంటే చావాలి అన్న తీరులో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని దుయ్యబట్టారు.  స్వ పార్టీ ఎమ్మెల్యేలైనా ఎదురు తిరిగి మాట్లాడటం వారి ప్రజాస్వామిక హక్కుఅని, ఎన్టీఆర్ ప్రభుత్వం లోనూ ఎమ్మెల్యే లు నిరసన గళం వినిపించి బయటకు వచ్చారని గుర్తు చేశారు. సాక్షాత్తు వైయస్ రాజశేఖరరెడ్డి తన పార్టీ ముఖ్యమంత్రులను నిద్ర కూడా పోనివ్వ లేదని, అప్పటి ముఖ్యమంత్రులు ఎవ్వరూ వైయస్ సెక్యూరిటీని తగ్గించ లేదన్నారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా సోనియాగాంధీని ఎదిరించి రాజకీయ పార్టీ పెట్టారని గుర్తు చేశారు. నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు ఆనం  రామ నారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిలకు భవిష్యత్తులో ఏది జరిగినా, అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రల పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని, పోలీసుల వ్యవహార శైలిపై దృష్టి పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని బాలకోటయ్య డిమాండ్ చేశారు.

Related posts

పెద్ద పాడు గ్రామం లోనే నూతన ప్రాథమిక పాఠశాలను నిర్మించాలి

Satyam NEWS

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం

Satyam NEWS

కోర్టు ప్రొసీడింగ్స్ ప్రత్యక్ష ప్రసారానికి చర్యలు తీసుకోవాలని పిల్

Satyam NEWS

Leave a Comment