38.2 C
Hyderabad
April 29, 2024 11: 31 AM
Slider ఆధ్యాత్మికం

మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచే

#mangalagiri

మంగళగిరి నగరంలో వేంచేసియున్న  శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి  ప్రారంభమై  మార్చి 7వ తేదీ వరకు జరుగనున్నాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రత్యేక పాల్గుణ శుద్ధ షష్టి నుంచి బహుళ విధియ వరకు 12 రోజుల పాటు వైభవంగా జరుగుతాయి. లోక కళ్యాణార్థం దిగువ సన్నిధిలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం గత కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. 

నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి,  ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు నేతృత్వంలో  దేవస్థాన కార్యనిర్వాహణాధికారి అన్నపురెడ్డి రామకోటిరెడ్డి పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం రాత్రి 7 గంటలకు పెండ్లి కుమారుని ఉత్సవంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

27వ తేదీన రాత్రి 8 గంటలకు బ్రహ్మోత్సవాల్లో అతి ప్రధాన ఘట్టమైన ధ్వజారోహణం, 28న హనుమంత వాహనం, మార్చి 1వ తేదీన  రాజాధిరాజ వాహనం, 2వ తేదీన రాలి వాహనం, 3వ తేదీన సింహ వాహనం, 4వ తేదీ ఉదయం 9 గంటలకు హంస వాహనం, అదే రోజు రాత్రి 7 గంటలకు గజవాహనం,  5వ తేదీ ఉదయం 9గంటలకు కల్పవృక్ష వాహనం, అదే రోజు రాత్రి 7 గంటలకు పొన్న వాహనం, 6వ తేదీ 9 గంటలకు ఆ శివ వాహనం అదే రోజు రాత్రి 12 గంటలకు శ్రీ స్వామివారి కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. 7వ తేదీ ఉదయం 6 గంటలకు బంగారుగరుడోత్సవం అదే రోజు మధ్యాహ్నం 3గంటలకు శ్రీవారి దివ్య రథోత్సవం అంగరంగ వైభవంగా  నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేయనున్న  ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకోనున్నాయి.

నృసింహుని బ్రహ్మోత్సవాలకు పటిష్ట బందోబస్తు

నగరంలో వేంచేసి ఉన్న శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పట్టణ సీఐ బి. అంకమ్మరావు తెలిపారు.  శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 26వ తేదీ ఆదివారం రాత్రి 7 గంటలకు స్వామి వారి పెండ్లి కుమారుని ఉత్సవంతో ప్రారంభం కానున్నాయని ,ఈ నేపథ్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్చి 6వ తేదీన   జరిగే స్వామివారి కల్యాణ మహోత్సవానికి  210 మంది పోలీస్ సిబ్బందితో  ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇద్దరు  సీఐలు, ఐదుగురు ఎస్సైలు,  హెచ్ సీలు -27,  పీసీలు -78,  మహిళా పోలీసులు -28, హోమ్ గార్డులు -36, ఎస్టీఎఫ్ -40 మందితో స్వామి వారి కళ్యాణానికి  బందోబస్తు నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే విధంగా  మార్చి 7వ తేదీ జరిగే స్వామి వారి దివ్య రథోత్సవానికి 250 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

నలుగురు సీఐలు,  12 మంది ఎస్సైలు, 20మంది హెడ్ కానిస్టేబుళ్లతో పాటు మరో 200మందికి పైగా పోలీస్ కానిస్టేబుల్స్ తో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.  దేవస్థానం ప్రాంగణంలో దాదాపూ 50కు పైగా సీసీ కెమెరాలను ఇప్పటికే దేవాదాయ శాఖ అధికారులు  ఏర్పాటు చేశారని, సీసీ కెమెరాల సహాయంతో బ్రహ్మోత్సవాలను ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తామని తెలిపారు. 

బ్రహ్మోత్సవాల సందర్భంగా నగరంలో  ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని, భక్తులకు ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.  ఇప్పటికే టూరిస్ట్ పోలీస్  కార్యక్రమంలో భాగంగా  నృసింస్వామి గాలిగోపురం ఎదుట ఔట్ పోస్టును ఏర్పాటు చేశామని, ఒన్ ప్లస్ ఒన్ సిబ్బందితో 24 గంటల ప్రత్యేక బందోబస్తు ప్రతిరోజూ కొనసాగించనున్నట్లు  పట్టణ సీఐ బి.అంకమ్మరావు తెలిపారు.

నాగరాజు నాయుడు, జర్నలిస్ట్

Related posts

పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ ప్రదీప్ ని అభినందించిన రాచకొండ సీపీ

Satyam NEWS

తలుచుకుంటేనే భయంగా ఉంది. రాయాలంటేనే భయంగా ఉంది.

Satyam NEWS

కరోనా నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

Leave a Comment