31.7 C
Hyderabad
May 2, 2024 07: 10 AM
Slider ఆధ్యాత్మికం

పరమ భాగవతోత్తముడు నారాయణతీర్థుడు

#narayanatrredha

ఎందరో మహానుభావులు వాగ్గేయకారులుగా భక్తిసాగరంలో పుడమిని పులకింపజేశారు. వారిలో శ్రీ నారాయణతీర్థుడి స్థానం విశేషమైంది. యక్షగాన సంప్రదాయానికి, భజన సంప్రదాయానికి మనదైన కూచిపూడి నృత్యానికి పూనికగా,భూమికగా నిలిచినవాడు నారాయణతీర్థుడు.

సిద్ధేంద్రయోగి వంటివారికి పథనిర్దేశం చేసిన గురువర్యుడు. త్యాగయ్య గురువు శొంఠి వెంకటరమణయ్య తండ్రి వెంకటసుబ్బయ్య కూడా నారాయణతీర్థుడిని గురువుగా తన గుండెలో నిలుపుకున్నారు. ‘శ్రీకృష్ణతత్త్వం’ తెలియాలంటే లీలాశుకుని,జయదేవుని, నారాయణతీర్ధుని కృతులను ఆలకిస్తే,సర్వం బోధపడుతుందని మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య వంటివారు పలుమార్లు చెప్పారు.

ఈ ముగ్గురు మహనీయులలో నారాయణతీర్థుడు మన తెలుగువాడు. ఎందరో వాగ్గేయకారులకు, నాట్యాచారులకు పరమగురువుగా ప్రబోధం చేసినవాడు. నారాయణతీర్థుడు అనగానే గుర్తుకు వచ్చేది ‘తరంగాలు’. కృష్ణం కలయ సఖి సుందరం, బాల గోపాలకృష్ణ పాహి పాహి.. వంటివి నృత్య ప్రదర్శనలలో తరచూ మనకు వినిపించే గీతాలు.

శరణం భవ కరుణాం మయి,

ఆలోకయే శ్రీ బాలకృష్ణం,

గోవర్ధన గిరిధర…

మొదలైన కీర్తనలు యావత్తు దక్షిణభారతంలోనే బహుళ ప్రచారంలో ఉన్నాయి. తరంగాలలో ఉండే రుచే వేరు, ఆ మత్తు,గమ్మత్తు వేరు. అనుభవించినవారికి అర్ధమవుతుంది. ఆ దివ్య గానామృతంలో మునిగితే బయటకు రావడం అసాధ్యం. దరువులు, జతులతో సాగే ఈ గాన సంప్రదాయం పరమ విలక్షణమైంది. ఇది పూర్తిగా మనదైన విద్య, మనదైన కళ, మనదైన సంప్రదాయం.

బాలగోపాల మా ముద్ధర…. తరంగాన్ని  రాత్రంతా పాడుతూ,ఆడుతూ తాదాత్మ్యం చెందుతూ వేడుక చేసుకొనే సంప్రదాయం నిన్నమొన్నటి వరకూ ప్రకాశం జిల్లా అద్దంకి సీమలో ఉండేది. రామాయణం వారు, బొమ్మరాజువారు, ఘోరకవివారు తరంగగానంలో ప్రసిద్ధులు. ఘంటసాల వెంకటేశ్వరరావు మొట్టమొదటగా విన్నది, నేర్చుకున్నది తరంగాలనే.

మేనమామ ర్యాలి పిచ్చయ్య తరంగగానంలో ప్రముఖులు. ఘంటసాల తండ్రి కూడా తరంగాలు అద్భుతంగా పాడేవారు. సుప్రసిధ్ధ నాటి భానుమతి కుటుంబానిది కూడా అదే సంప్రదాయం. శరణం భవ కరుణాం మయి వంటి తరంగాలను ఆమె సినిమాల్లో స్వయంగా పాడారు కూడా. ఇప్పటికీ అద్దంకి,ఒంగోలు ప్రాంతంలో తరంగగానం చేసేవారు ఎందరో ఉన్నారు.

నారాయణతీర్థుడు సింగరకొండ నృసింహస్వామి సన్నిధిలో గడిపినప్పుడు ఆ ప్రాంతానికి చెందిన అరవై గ్రామాలవారు స్వయంగా ఆయన నుంచే తరంగాలు నేర్చుకున్నారు. అట్లే,కృష్ణా జిల్లా దివిసీమలోని శ్రీకాకుళం,కూచిపూడి ప్రాంతాలలోనూ తరంగగాయకులు ఉన్నారు.

అక్షరాస్యులు,నిరక్షరాస్యులు సైతం వడలు మరచి నృత్యం చేస్తూ, భక్త్యావేశంతో పాడే ఈ సంప్రదాయం తమిళ, కన్నడిగులను కూడా విశేషంగా ఆకర్షించింది.ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం,గుంటూరు,కృష్ణాతీరంలో తరంగసంప్రదాయం వందల ఏళ్ళు విలసిల్లింది. ఇప్పటికీ,ఒంగోలుకు చెందిన ఘోరకవి సంపత్ కుమార్ వంటివారు ఈ సంప్రదాయానికి దివిటీ పడుతూ మన మధ్యనే ఉన్నారు. తరంగాలను  ‘శ్రీకృష్ణ లీలా తరంగిణి’ పేరుతో నారాయణతీర్థుడు రచించారు.

భాగవతంలోని దశమ స్కంధం నుంచి కథలను,విశేషాలను తీసుకొని కీర్తనలుగా మలచారు. రుక్మిణీ కల్యాణంతో ఈ మహారచన సంపూర్ణమవుతుంది. ఈ కృతులలో శ్రీకృష్ణుడి లీలలు పరమ సమ్మోహనంగా ఆకృతిదాల్చాయి. మొత్తం 12 భాగాల్లో 152 కీర్తనలు ఉంటాయి.

కొన్ని ప్రక్షిప్తాలను కూడా కలుపుకుంటే ఈ సంఖ్య పెరుగుతుంది.ప్రతి కీర్తనకు ముందు శ్లోకం ఉండడం ఇందులో ప్రత్యేకత. మధ్య మధ్యలో గద్యాలు,దరువులు,జతులు ఉంటాయి.ఇంతటి విశేష రచన దేశంలో ఎక్కడా కనిపించదు. కీర్తనలన్నీ సంస్కృతంలో రాసినా,తెలుగు వింటున్నంత తేటగా ఉంటాయి.

సంగీతం,సాహిత్యం,నృత్యాత్మకం ముప్పేటలుగా ముడివేసుకొని సాగే ఈ కీర్తనలు రస,భావ,భక్తిబంధురాలు. ఇటువంటి మహాసృష్టి చేసిన  నారాయణతీర్థుడి స్వగ్రామం గుంటూరు జిల్లా మంగళగిరి దగ్గర కాజా.వీరి పూర్వనామం తల్లావజ్జల గోవిందశాస్త్రి. ఒక సందర్భంలో, వేదాద్రిలోని కృష్ణానదిలో మనఃసన్యాసం తీసుకొన్నారు. ఆ తర్వాత వారణాసికి పయనమయ్యారు.

అక్కడ యతీంద్రుడిగా దీక్ష ధరించారు. ఒరిస్సా మొదలు దక్షిణాది రాష్ట్రాలన్నీ సంచరించారు. ఎక్కడెక్కడో తపస్సు చేశారు. నిత్యం గానం,ధ్యానంలో తరించారు. సద్గురు శివనారాయణతీర్థుడుగా ప్రసిద్ధికెక్కారు. ఆంధ్రదేశంలోని కృష్ణాతీరంలో పుట్టి, తమిళనాడులోని కావేరీ నదీ పరీవాహక ప్రాంతంలోని తిరుపుందుర్తిలో యోగ మార్గంలో  సజీవ సమాధి అయ్యారు.

తెలుగు తిథుల ప్రకారం ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి వీరి జననం. మాఘ శుద్ధ అష్టమి వీరు జీవసమాధియైన రోజు వీరు క్రీ.శ 1600-1700 సంవత్సరాల మధ్య జీవించినట్లుగా తెలుస్తోంది.పుణ్య దినాల్లో జన్మస్థలమైన కాజా లోనూ, తుది పయనం చేసిన తిరుపుందుర్తిలోనూ ప్రతిఏటా పెద్దఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. ఈ రెండు ప్రదేశాలలోనే కాక,యావత్తు దక్షిణాదిలో సంగీత ప్రియులు, భక్తులు శ్రీనారాయణతీర్ధుడిని స్మరిస్తూ తరంగ గానం చేస్తూ  నీరాజనాలు పలుకుతారు. ‘తరంగ కాలక్షేపం’ గొప్ప ఆచారంగా తెలుగునాట ప్రసిద్ధి.

ఎందరినో తరింప జేసి, ఎందరో శిష్యప్రశిష్యులను సంపదగా పొందిన నారాయణతీర్థుడు పరమ పుణ్యుడు,ధన్యుడు. తరంగాలతో పాటు పారిజాతాపహరణం (తెలుగు యక్షగానం), శాండిల్య భక్తిసూత్ర వ్యాఖ్య, భాట్ట భాషాప్రకాశం వంటి ఎన్నో విశిష్ట రచనలు చేశారు. కొన్ని ముద్రితములుగా, కొన్ని అముద్రితములుగా కాశీ విశ్వవిద్యాలయంలో ఉన్నట్లు చెబుతారు. నారాయణతీర్థుడు తీర్చిదిద్దిన సంప్రదాయాన్ని నిలబెట్టడమే మనం ఆ మహావాగ్గేయకారునికి ఇచ్చే నిజమైన నివాళి.

ఈ సంప్రదాయాన్ని నిలబెట్టాలంటే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలి. తరంగాలు మిగిలిన వాగ్గేయకార కీర్తనల వంటివి కావు. తగుమాత్రం రాగంతో, భావానికి ప్రాధాన్యతనిస్తూ, పూర్తి భక్తిభావంతో, లయ ప్రధానంగా, భజన/యక్షగాన సంప్రదాయంలో సాధన చేయాలి.పాడుతూ నాట్యం చేస్తూ,నాట్యం చేస్తూ పాడే గొప్ప విన్యాసం ఈ సంప్రదాయంలో ఉంటుంది.

మంచి మృదంగ వాద్య సహకారం అవసరం. ఘోరకవి సంపత్ కుమార్ వంటివారితో తెలుగునేల నలుచెరుగులా ఔత్సాహికులకు శిక్షణ ఇప్పించడం ద్వారా ఈ సంప్రదాయాన్ని నిలుబెట్టుకోవచ్చు. శ్రీ నారాయణ తీర్ధునిపై జయదేవుని ప్రభావం ఉన్నదని పెద్దలు చెబుతారు. కీర్తనా రచనలో తాళ వైవిధ్యం ప్రత్యేక ఆకర్షణ. పల్లవి,చరణాలు వివిధ తాళాలలో పాడుతూ ఉంటే? పాడేవారే కాక, వినేవారు కూడా మైమరచి నాట్యం చేసేలా అంతటి ఆకర్షణ ఉంటుంది. దరువులు, జతులు సమ్మోహనం చేస్తాయి.

ప్రసిద్ధమైన రాగాలే కాక, కర్ణాటక సారంగ,మంగళకాపి వంటి ‘అపూర్వ’,అపురూప రాగాలను కూడా నారాయణతీర్థుడు లోకానికి పునఃపరిచయం చేశారని పండితులు చెబుతారు. హిందుస్థానీ రాగమైన ద్విజావంతి వంటి రాగాలను కర్ణాటక సంగీతంలోకి తెచ్చినవారిలో తీర్ధులవారిని మొదటివారుగానూ కొందరు చెప్పుకొస్తారు.

కర్ణాటక సంగీతానికి బహుళ ప్రాచుర్యం తెచ్చిన తొలితరం వాగ్గేయకారులలో నారాయణ తీర్ధుడి స్థానం విలక్షణమైంది. గీతం -వాద్యం- నృత్యం మూడింటిని సమప్రతిభతో వెలయించిన పరమోత్తమ వాగ్గేయకారుడు. ‘పరమ భాగవతోత్తముడు’ శ్రీ నారాయణతీర్థుడు పదహారణాల తెలుగువాడు.

మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

సుప్రీంకోర్టు తీర్పుపై మజ్లీస్ అధినేత అసంతృప్తి

Satyam NEWS

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా కిషన్ రెడ్డి

Satyam NEWS

విశాఖ ఉక్కు పరిశ్రమని అమ్మేసే హక్కు బీజేపీ ప్రభుత్వానికి లేదు

Satyam NEWS

Leave a Comment