29.7 C
Hyderabad
May 2, 2024 03: 28 AM
Slider ప్రత్యేకం

Analysis: పల్లెకు పోదాం సాగును చేద్దాం ఛలో ఛలో

#Corona Effect

మనిషి జీవన చిత్రంలో పెనుమార్పులకు కరోనా కారణం కాబోతున్నది. విద్యా, ఉద్యోగం, ఉపాధి రంగాల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. స్వదేశీ ఉత్పత్తులేకాక, స్వదేశీ విద్య, నూతన ఉపాధి సౌకర్యాలపై దృష్టి సారించాల్సిన తరుణం వచ్చేసింది.

స్వక్షేత్రాలకు చేరుతున్న  కూలీల్లో ఎక్కువ మంది తిరిగి వలస వెళ్ళడానికి సుముఖంగా లేరు. స్థానికంగా ఉండే పనుల్లోనే ఉపాధి వెతుక్కుంటారు. పట్టణాల్లో, నగరాల్లో ఉండిపోయిన వారి ఉపాధి మార్గాలు కూడా మారిపోబోతున్నాయి.

విద్య, ఉద్యోగాల కోసం విదేశాలు వెళ్లే  సంస్కృతి కూడా తగ్గుముఖం పట్టే పరిణామాలు కన్పిస్తున్నాయి. పల్లె నుండి మహానగరాల వరకూ ఇప్పటివరకూ ఉన్నవాటికి భిన్నమైన  దృశ్యాలు భవిష్యత్తులో కనిపిస్తాయి. ముఖ్యంగా పల్లెలు కొత్త శోభను సంతరించుకుంటాయి. పల్లెలే పట్టణాలుగా మారుతాయి.

గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి

ఇది మంచి పరిణామంగానే భావిద్దాం. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆరోగ్యంతోపాటు సమగ్ర  గ్రామీణాభివృద్ధికి కూడా ఊతమిచ్చే దిశగా కేంద్రప్రభుత్వం వివిధ కొత్త పధకాలను రూప కల్పన చేసే అవసరం కూడా ఎంతో ఉంది.

ఇక నుండి వ్యవసాయ రంగం, గ్రామీణ వృత్తులు ప్రధాన ఆదాయ మార్గాలుగా మారే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీరు , సాగునీరు, రోడ్లు, ఆస్పత్రులు,శానిటేషన్,  విద్యాలయాలు మొదలైన వసతుల కల్పనకు పెద్ద పీట వెయ్యాలి.

విద్యాలయాలు గ్రామాలకు విస్తరించాలి

సరియైన రోడ్లు, విద్యుత్, రవాణా లేని గ్రామాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. చదువుకోవాలంటే మైళ్లకు మైళ్ళు నడవాల్సిన పరిస్థితి ఇంకా చాలా పల్లెల్లో నెలకొని ఉంది. కరెంట్ వెలుగులు లేని పల్లెలు కూడా ఇంకా ఉన్నాయి. ఒక ఊరి నుండి పక్క ఊరుకు వెళ్లాలంటే రాళ్లు, ముళ్ళు ఉన్న మార్గాల్లో, గతుకుల రోడ్లలో వెళ్లాల్సిన పరిస్థితులు ఇంకా చాలా పల్లెల్లో ఉన్నాయి.

అవిద్య, అనారోగ్యం, ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొనే పల్లెలు ఎన్నో ఉన్నాయి. కరోనా నేర్పిన పాఠాల్లో సొంత ఊరుపై మక్కువ పెరగడం మంచి పరిణామం. పల్లెలు,  చిన్న చిన్న పట్టణాల్లో నివాసాలు పెరిగే క్రమంలో, దానికి తగినట్లుగా వసతుల కల్పనలో ప్రభుత్వ చర్యలు వేగం పెంచుకోవాలి.

ఉపాధి హామీ పథకం రూపురేఖలు మారాలి. సరికొత్త అధ్యయనాలతో కొత్త పనులను ఇందులోకి  చేర్చాలి. పల్లెల్లో కూడా మద్యం వినియోగం పెరుగుతోంది. దీన్ని అరికట్టాలి. ఇంటర్నెట్ సదుపాయం ప్రతి పల్లెకు చేరాలి. వ్యవసాయాన్ని లాభసాటి రంగంగా తీర్చిదిద్దితే పల్లెలు కళకళలాడతాయి.

వ్యవసాయంతో పాటు పశువుల పెంపకం కూడా పెరిగేలా ప్రభుత్వాలు ప్రోత్సాహకరమైన వాతావరణం కల్పించాలి. అపరిశుభ్రత తాండవించే ప్రాంతాలను కాపాడడంలో ప్రభుత్వం ప్రధాన భూమిక పోషించాలి. కరోనా నివారణకు పరిశుభ్రతే మొదటి ఔషధం. పల్లెల్లో గృహనిర్మాణాలు ఊపందుకునేలా చెయ్యాలి.

పల్లెలో ఉంటే జీవితం ఎంతో బాగుంటుందనే భరోసాను ప్రభుత్వాలు కలుగజేస్తే, ఆవాసాలు పెరుగుతాయి. నిర్మాణం రంగం పల్లెల్లో కూడా ఊపందుకుంటుంది. సొంతభూమిపై నిలదొక్కోవాలనే ఆలోచనలు అవసరంగా మారిన ఈ సందర్భానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తోడునీడగా నిలవాలి.

ఉన్న ఊర్లో ఉపాధి ఉంటే, ఇంకొక ఊరుకు ఎందుకు వలస వెళ్తారు?  స్వదేశంలో మంచి విద్య, ఉద్యోగ అవకాశాలు ఉంటే?  వేరే దేశం కోసం ఎందుకు వెంపర్లాడుతారు. స్వక్షేత్రాన్ని స్వర్గసీమగా మార్చుకోవడమే కర్తవ్యంగా భావిద్దాం.

-మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

కేంద్ర ప్రభుత్వం తక్షణం నాలుగు లేబర్ కోడ్ లు ఉపసంహరించుకోవాలి

Satyam NEWS

చేత‌న్ చీను ‘విద్యార్థి’ షూటింగ్ పూర్తి

Sub Editor

భోగి వేడుకల్లో ప్రభుత్వ జీవో ప్రతుల దహనం

Satyam NEWS

Leave a Comment