మిషన్ భగీరథ ద్వారా గ్రామ గ్రామాన గంగమ్మ తల్లిని ప్రసాదించినట్లు నిరక్షరాస్యతను పారదోలేందుకు గ్రామ గ్రామాల్లో విద్యా జ్యోతిని వెలిగించాల్సిన అవసరం ఉందని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కు సూచించారు.
సోమవారం రవీంద్రభారతిలో విశ్వనాథ సాహితీ పీఠం ఆధ్వర్యంలో వెలువరించిన మూడు పుస్తకాలను మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, శాంత బయోటిక్ చైర్మన్ వర ప్రసాద్ రెడ్డి, విద్వనాథ సాహితీ పీఠం అధ్యక్షులు ప్రొఫెసర్ వెల్చాల కొండల్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉండటం బాధాకరమని అన్నారు.
పదవ తరగతి విద్యార్థికి రెండో తరగతి ప్రమాణాలు కూడా ఉండటం లేదని ఆయన తెలిపారు. విద్యా వ్యవస్థ లో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రతి విద్యార్థికి 1-6 తరగతి వరకు మాతృ భాషలోనే విద్యాబోధన జరగాలని, అప్పుడే ఆ విద్యార్థుల పునాదులు పటిష్టంగా ఉంటాయని విద్యాసాగర్ రావు పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో అక్షరాస్యతను పెంచేందుకు సీఎం కేసీఆర్ కార్యోన్ముఖులయ్యారని తెలిపారు. చదువుల తల్లి సరస్వతీ దేవి ఆశీర్వాదాలతో ప్రతి పల్లెలో విద్యా కుసుమాలు పరిమలించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వినోద్ కుమార్ తెలిపారు.