రాష్ట్రంలో అరాచకపాలనపై సమరభేరి మోగిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 226రోజులపాటు 3132 కి.మీ.ల మేర పాదయాత్ర పూర్తిచేసిన యువనేత నారా లోకేష్… 11నెలల తర్వాత తొలిసారి సొంతగడ్డపై పర్యటించారు. యువగళంతో అధికారపార్టీ అవినీతి, అక్రమాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టి అధికారపార్టీకి కంటిమీద కునుకులేకుండా చేసిన యువనేత సుదీర్ఘకాలం తర్వాత మంగళగిరిలో పర్యటించడంతో నియోజకవర్గ ప్రజలు ఆత్మీయస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు తటస్థ ప్రముఖులను కలిసి నియోజకవర్గంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన అభివృద్ధి ప్రణాళికలపై వారితో చర్చించారు.
తొలుత ఆత్మకూరులో మంగళగిరి మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, మంగళగిరి పట్టణంలో అతిపెద్ద మాస్టర్ వీవర్ అయిన జొన్నాదుల వరప్రసాద్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. మంగళగిరిలో చేనేతలు, నేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, రాబోయే రోజుల్లో వారి కోసం చేపట్టాల్సిన సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు.
కనకయ్య, అల్మాస్ లతో ఆత్మీయ సమావేశం
అనంతరం పద్మశాలి బహుత్తమ సేవా సంఘం అధ్యక్షుడు చింతకింది కనకయ్యను మర్యాదపూర్వకంగా కలుసుకొని వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. పద్మశాలీయుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారానికి దీర్ఘకాలంగా పోరాడుతున్న కనకయ్య పలు సమస్యలను ఈ సందర్భంగా యువనేత దృష్టికి తెచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్రలో ధర్మవరం, వెంకటగిరి వంటి ప్రాంతాల్లో పద్మశాలీయులు ఎదుర్కొంటున్న సమస్యలను కళ్లారా చూశానని, మరో 3నెలల్లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాబోయే ప్రజాప్రభుత్వం మీకు అండగా నిలుస్తుందని చెప్పారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైనా గత నాలుగున్నరేళ్లుగా మీలో ఒకడిగా ఉంటూ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నానని, నియోజకవర్గ ప్రజలకు మెరుగైన సేవలందించేలా తనను ఆశీర్వదించాలని కోరారు. తర్వాత ప్రముఖ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి షేక్ సాదియా అల్మాస్, వారి కుటుంబసభ్యులను మర్యాదపూర్వకంగా కలుసుకొన్నారు. అల్మాస్ 2021లో టర్కీలో జరిగిన ఆసియన్ అక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ అండ్ బెంచ్ ప్రెస్ చాంపియన్ షిప్ పోటీల్లో గోల్డ్ మెడల్, 2020లో గజియాబాద్ లో జరిగిన నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పతకం సాధించారు.
నేడు తాడేపల్లిలో విస్తృతస్థాయి సమావేశం
మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం బుధవారం (27-12-2023) సాయంత్రం 4గంటలకు తాడేపల్లిలో సిఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్యఅతిధిగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాజరుకానున్నారు. అతిధులుగా నియోజకవర్గ సమన్వయకర్త అబద్ధయ్య, సీనియర్ నాయకులు పోతినేని శ్రీనివాసరావు, తమ్మిశెట్టి జానకీదేవి, మండల పార్టీ అధ్యక్షులతో పాటు నియోజకవర్గంలోని అనుబంధ సంఘాల బాధ్యులు కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. ఇటీవల కాలంలో మంగళగిరి నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై ఈ సమావేశంలో పార్టీ కేడర్ తో యువనేత లోకేష్ సమీక్షిస్తారు.