భూ సంరక్షణకు అందరం అంకితమై పనిచేద్దామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ నేలల దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డితో కలిసి విత్తనశుద్ధి కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, కలెక్టర్ అమయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. భూమి తప్ప మానవుడు నివసించ గలిగేందుకు ఏ గ్రహం అనుకూలంగా లేదని అందువల్ల భూమిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. విచ్చలవిడిగా ఎరువులు వాడకుండా రైతులు బాధ్యతతో వ్యవసాయం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
అందుకే వ్యవసాయం సుస్థిరంగా ఉంటే అందరూ బాగుంటారన్న దూరదృష్టితో, దార్శనికతతో ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యధిక శాతం బడ్జెట్ లో నిధులను వ్యవసాయ రంగానికి కేటాయించారని మంత్రి అన్నారు. దాదాపు రూ.72 వేల కోట్లు రైతు బంధు, రైతు భీమా, ప్రాజెక్టుల నిర్మాణం, ఉచిత కరంటు సరఫరా వంటి వాటికి కేటాయించారని ఆయన అన్నారు.
అమెరికా లో ఓ రైతు 80 వేల డాలర్లు కరంటు బిల్లు కడుతున్నాడని, మన వద్ద ఉచిత కరంటు ఇస్తున్నాం అంటే ఆశ్చర్యపోతున్నారని మంత్రి అన్నారు. రైతులు కేవలం వరి సాగు మీదనే దృష్టిపెట్టొద్దు ఇతర పంటల మీద దృష్టి సారించాలని కోరుతున్నానని మంత్రి అన్నారు.