భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో జనవరి 6వ తేదీన నిర్వహించనున్న ముక్కోటి ఏకాదశి ఉత్సవ ఏర్పాట్లపై భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ రజత్ కుమార్ షైనీ, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
స్వామి వారిని దర్శించుకునేందుకు ఈ సారి భక్తులు అధిక సంఖ్యలో హాజరుకానున్నారని అందుకు తగ్గ ఏర్పాటు చేయాలని మంత్రి అన్నారు. ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనం కల్పించే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
భక్తులకు రద్దీ లేకుండా ట్రాఫిక్ నియంత్రణ, రోడ్లు, వసతి సౌకర్యాలు, అలంకరణ, విద్యుత్, శానిటేషన్, భక్తులకు త్రాగునీటి వసతులు తదితర ఏర్పాట్ల పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జడ్పీ చైర్మపర్సన్ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సబ్ కలెక్టర్ భవేశ్ మిశ్రా, అదనపు ఎస్పీ రాజేష్ చంద్ర , ఆలయ అధికారులు పాల్గొన్నారు.