39.2 C
Hyderabad
April 28, 2024 13: 56 PM
Slider మహబూబ్ నగర్

వైద్య పరీక్షల కోసం గిరిజన ప్రాంతానికి మొబైల్ వ్యాన్

Etela Rajendar

గిరిజనులకు వైద్య సేవలు అందించేందుకు అచ్చంపేట ప్రాంతంలో సంచార పాథాలజీ లేబరేటరీ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. ఆదివారం మంత్రి నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పరిధిలోని ఉప్పునుంతల మండల కేంద్రంలో ఉన్న పది పడకల ఆస్పత్రిని 30 పడకల ఆసుపత్రిగా స్థాయి పెంచేందుకు ఉద్దేశించి నాలుగు కోట్ల 75 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆసుపత్రి ఆప్ గ్రేడ్ పనులకు భూమి పూజ చేశారు.

 ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడుతూ ఉప్పునుంతల ఆస్పత్రికి పూర్వం నుండి ప్రజల ఆదరణ పొందిన ఆసుపత్రిగా గుర్తింపు ఉందని అన్నారు. అచ్చంపేట మారుమూల నల్లమల  ప్రాంత ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఉప్పునుంతల ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా స్థాయి పెంచేందుకు చేపట్టిన పనులను 6 నుండి 8 మాసాలలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.

అంతేకాక త్వరలోనే అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలో వంద పడకల ఆసుపత్రిని ప్రారంభం చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. దోమలపెంట లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు కోరుతున్నారని, అయితే పి హెచ్ సి నెలకొల్ప కపోయినప్పటికీ ఆ స్థాయిలో వెసులుబాటు కల్పిస్తామని చెప్పారు. రఘుపతిపేట  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయి పెంపు విషయం అవకాశాన్ని బట్టి చేపడతామని అన్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఆసుపత్రులను పటిష్ట పరచడం, ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేయటం మొదటి ప్రాధాన్యతగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొందని, గతంతో పోలిస్తే రాష్ట్రంలో వైద్య ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, పేదలకు ఏమైనా జబ్బులు వస్తే వైద్య ఖర్చు అనుకోకుండా వచ్చిపడే పిడుగు లాంటిదని, డబ్బులు ఖర్చు పెట్టిన నయం కానీ జబ్బులు పేదలు తట్టుకోలేరని, వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఉస్మానియా, గాంధీ వంటి ఆసుపత్రులను పూర్తిస్థాయిలో పటిష్ట పరిచామని మంత్రి వెల్లడించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రుల లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తామని, అలాగే అవసరమైన సామాగ్రిని కల్పిస్తామని మంత్రి తెలిపారు. టి ఎస్ ఎం ఐ ఎస్ డి సి చైర్మన్ మర్యాద కృష్ణమూర్తి మాట్లాడుతూ నల్లమల అటవీ ప్రాంతంలో ఉండే ప్రజలకు మంచి సేవలు అందించే అవకాశం స్థాయి పెంచిన ఉప్పునుంతల ఆసుపత్రి వల్ల కలుగుతుందని అన్నారు.

నాగర్ కర్నూల్  పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు మాట్లాడుతూ కల్వకుర్తి- శ్రీశైలం రహదారిపై ఎక్కువగా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్నందున అచ్చంపేట ప్రాంతంలో ఒక ట్రామా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రితో విజ్ఞప్తి చేశారు.

అంతేకాక ఈ ప్రాంతంలో ఉన్న ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులు భర్తీ చేయాలని కోరారు. ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది బాగా పనిచేసి మంచి పేరు సంపాదించాలని అన్నారు. శాసన మండలి సభ్యుడు రెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో ఉన్న ఇదివరకే సూచించిన ఆసుపత్రుల స్థాయి పెంచాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన స్థానిక శాసనసభ్యులు గువ్వల బాలరాజు మాట్లాడుతూ దోమలపెంట లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, గతంలో కోరినట్లుగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయి పెంచాలని, వైద్యం విషయంలో అచ్చంపేట నియోజకవర్గానికి పూర్తి సహకారం అందించాలని కోరారు. జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి, అదనపు కలెక్టర్ హనుమంత్ రెడ్డి, సి ఈ లక్ష్మారెడ్డి, జెడ్పిటిసి ప్రతాపరెడ్డి, సర్పంచ్ సరిత, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధాకర్ లాల్, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Related posts

పౌర విమానయానంలో నైపుణ్యాభివృద్ధికి తీసుకున్న చర్యలు ఏమిటి?

Satyam NEWS

జన్మభూమి కాలనీలో స్థానిక సమస్యలపై బస్తీ బాట

Satyam NEWS

బుద్దదేవ్ ఆరోగ్యం విషమం

Bhavani

Leave a Comment