అమరావతి వద్దు మూడు రాజధానులు ముద్దు అనే నినాదంతో నరసరావుపేటలో బహిరంగ సభ జరపటం చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోతుందని నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు. బాధ్యత గల ఎమ్మెల్యే ఉండి శ్రీనివాసరెడ్డి రైతులకు న్యాయం చేయకుండా ప్రతిపక్ష నాయకులు చేస్తున్న పోరాటాలను నీరుగార్చే విధంగా ప్రవర్తించడం సిగ్గుచేటని అన్నారు.
జేఏసీ నాయకులకు పోటీగా మూడు రాజధానులు ముద్దు పేరుతో పోలీసుల సహకారంతో ర్యాలీలు బహిరంగ సభలు పెడుతున్న వైసిపి ఎమ్మెల్యేను, వైసిపి ప్రభుత్వాన్ని ప్రజలు బంగాళాఖాతంలో కలపడం తధ్యమని డాక్టర్ అరవింద్ బాబు విమర్శించారు. గత 31 రోజులుగా తినీ తినక అనేక అక్రమ కేసులుకు భయపడకుండా త్యాగం చేసిన రాజధాని రైతుల కించపరిచే విధంగా ఈ రోజు నరసరావుపేటలో ఎమ్మెల్యే ర్యాలీ నిర్వహించారని ఆయన అన్నారు.
అమరావతిలో నే రాజధాని కొనసాగించే విధంగా సీఎంని ఒప్పిస్తామని, రాజధానికి అనుకూలంగా ప్రకటించిన మీరు వెంటనే యు టర్న్ తీసుకొని సీఎం ఒత్తిడి మేరకు విజయవాడ వేదికగా మాట తప్పడం నిజం కదా అని అరవింద బాబు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్న వైసిపిని ప్రజలు బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు.