డాక్టర్ల నిర్లక్ష్యమూ, పొరబాటున జరిగిందో తెలియదు కానీ ఒక గర్భవతికి ప్రసవ సమయంలో పసి బిడ్డ తలకు గాయం అయింది. సిజేరియన్ ఆపరేషన్ చేసే సమయంలో అప్పుడప్పుడు ఇలా జరిగే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతుండగా తమ బిడ్డకు ఏమైందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
సిరిసిల్ల జిల్లా ప్రధాన వైద్యశాలలో జరిగిన ఈ సంఘటన ఆలశ్యంగా వెలుగులోకి వచ్చింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం సిరిసిల్ల అర్బన్ ప్రాంతంలోని పెద్దూర్‌కు చెందిన ఓ మహిళను ప్రసవం కోసం జిల్లా ప్రధాన వైద్యశాలకు వచ్చింది. శుక్రవారం ఆసుపత్రిలో వైద్యులు పరీక్షలు చేశారు. డెలివరికి ఈ నెల 28 వరకు సమయం ఉంది. కానీ ఉమ్మనీరు తగ్గి పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో వైద్యులు సీజేరియన్ చేశారు.
పసికందును బతికించారు. ఆ పసికందును తల్లి పొట్టలో నుంచి బయటకు తీస్తుండగా తలకు చిన్న గాయమైంది. పిల్లల వైద్యుడు పసికందుకు వైద్య పరీక్షలు చేసి గాయమైన చోట కట్టుకట్టారు. దీంతో పసికందుకు ఏదో జరిగిందని తలకు మూడు కుట్లు వేశారని తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తలకు గాయమైందని ఆరోపించారు. జరిగిన సంఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళీధర్‌రావు వివరణ ఇచ్చారు. క్రిటికల్ సమయంలో ఆ మహిళను ఆసుపత్రికి తీసుకు వచ్చారని, అయినా రిస్క్ తీసుకొని ఆపరేషన్ చేశామని, పసికందు అడ్డంగా తిరిగి ఉండడంతో క్లిప్పర్స్‌తో బయటకు తీస్తుండగా తలకు కాస్త గీసుకుపోయిందని చెప్పారు. ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతాయని, ఈ గాయంతో పసికుందుకు ఎలాంటి ప్రమాదం లేదన్నారు. నెలలు నిండక ముందే జన్మించడంతో వ్యాధులు సోకకుండా వార్మర్లో ఉంచామని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఏదో జరిగిందని అసత్య ప్రచారాలు చేయవద్దని ప్రజలను భయబ్రాంతులకు గురిచేయవద్దని కోరారు.