38.2 C
Hyderabad
April 29, 2024 21: 36 PM
Slider కడప

‘బీరం’ రగడ మళ్లీ మొదలు.. డీఈఓ పై తీవ్ర ఆరోపణ..

#biram

బీరం విద్యాసంస్థలో ఆరో తరగతి విద్యార్థి సోహిత్ మృతి ఘటనకు సంబంధించి విద్యాసంస్థల అధినేత కడపజిల్లా డీఈఓ పై పెద్ద ఆరోపణే చేశారు. సంఘటన తరువాత పాఠశాల అనుమతి రద్దు విషయంలో తనను డీఈఓ డబ్బు డిమాండ్ చేశాడని చెప్పిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఆ ఆరోపణలపై స్పందించిన డీఈఓ, సదరు పాఠశాల యాజమాన్యం పై పరువునష్టం దావాకు సిద్దమైనట్లు తెలిపారు.

కడపజిల్లా ఖాజీపేట మండల పరిధిలోని బీరం విద్యా సంస్థలో జూలై 1న సోహిత్ అనే ఆరోతరగతి విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి అదే రోజు కడప డీఈఓ రాఘవరెడ్డి పాఠశాల అనుమతిని రద్దు చేస్తూ అప్పటికప్పుడు సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. డీఈవో చర్యలపై అప్పుడు సర్వత్ర హర్షం వ్యక్తం అయింది. ఆ తరువాత విద్యార్థి మృతి పై నిజనిర్థారణ కమిటీని వేయడం కూడా వెంటవెంటనే జరిగిపోయింది. ఈ కేసులో పోలీసులు కూడా విచారణ చేపట్టి.. పాఠశాల యాజమాన్యం అందించిన సీసీ ఫుటేజీ, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా విద్యార్థి మృతికి గల కారణాలను వివరించి దర్యాప్తు కొనసా..గుతూనే ఉందని చెప్పారంతే. ఓ వైపు నిజనిర్థారణ కమిటీ విచారణ కూడా ఇంకా కొనసా..గుతూనే ఉంది.

ఈ క్రమంలో పాఠశాల గుర్తింపు రద్దు ఆదేశాలను సవాల్ చేస్తూ పాఠశాల యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. ముందస్తు నోటీసు లేకుండా పాఠశాల గుర్తింపును ఎలా రద్దు చేస్తారంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. న్యాయస్థానం కూడా కడప డీఈఓ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. విద్యార్థి మృతి విషయంలో ఏం జరిగిందో ఏమో.. తొలుత తన కుమారుడి మృతికి పాఠశాల యాజమాన్యమే కారణమంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు తరువాత మిన్నకుండిపోయారు. మృతి చెందిన సోహిత్ తండ్రి ఏకంగా మీడియా ముందుకు వచ్చి మరీ.. తన కుమారుడి చావుకు బాధ్యత పాఠశాల యాజమాన్యంది కాదని, హోం సిక్ కారణంగానే హాస్టల్ భవనం పై నుంచి దూకాడని చావు కబురు చల్లగా చెప్పాడు. దీంతో సోహిత్ మృతి వెనుక ఏదో తెలియని నిఘూడ రహస్యం ఉందని అప్పటివరకూ అంతా భావిస్తున్న తరుణంలో.. విద్యార్థి తండ్రే ఏమీ లేదని మీడియా ముఖంగా చెప్పడంతో.. అప్పటివరకూ సాగిన ఉత్కంఠకు ఒక్కసారిగా తెరదించినట్లయ్యింది. అంతా మనకెందుకులే అని మిన్నకుండిపోయారు.

కానీ.. ఇప్పుడు ఇక్కడ తాజాగా మరో రచ్చ మొదలైంది. సోహిత్ మృతి చెందిన వెంటనే పాఠశాల అనుమతి రద్దు చేస్తూ డీఈఓ రాఘవరెడ్డి జారీ చేసిన ఉత్తర్వుల పై పాఠశాల యాజమాన్యం సంచనల ఆరోపణ చేసింది. పాఠశాల అనుమతి రద్దు విషయంలో డీఈఓ తనను డబ్బు డిమాండ్ చేశాడంటూ బీరం విద్యాసంస్థల అధినేత స్వయంగా చెప్పిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. డబ్బు ఇవ్వనందువల్లే పాఠశాల అనుమతి రద్దుకు ఉత్తర్వులు జారీ చేశాడంటూ వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో వైరల్ కావడంతో స్పందించిన డీఈఓ రాఘవరెడ్డి వాట్సాప్ వేదికగా వెంటనే ఓ ప్రకటన విడుదల చేశారు. తన పరువుకు భంగం కలిగేలా బీరం యాజమాన్యం వ్యాఖ్యలు ఉన్నాయని, సదరు వ్యాఖ్యలు చేసిన సదరు పాఠశాల యాజమాన్యం పై పరువు నష్టం దావా దాఖలు చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటానని తెలిపారు.

అయితే ఘటన సమసిపోయిందని అందరూ భావిస్తున్న క్రమంలో తిరిగి రచ్చ మొదలుకావడం వెనుక కొంతమంది మీడియా ప్రతినిధులు ఉన్నారన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆది నుంచి ఈ కేసులో మీడియా ప్రతినిధుల ప్రమేయం ఉందని, అందిన కాడికి యాజమాన్యం వద్ద డబ్బు గుంజి యాజమాన్యానికి వత్తాసుగా వ్యవహరించారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. డీఈఓ పై పాఠశాల అధినేత వ్యాఖ్యలు చేయడానికి, సోహిత్ తండ్రి తన కుమారుడి మృతి పై మాట మార్చడానికి వెనుక అసలు కారకులు  కొంతమంది మీడియా ప్రతినిధులే అన్నది జనాలెరిగిన నిజం. కాబట్టి అధికారులు సదరు కారకులపై కూడా విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Related posts

జగన్ ను మరో సారి గెలిపించడం అవసరం

Bhavani

ఆపరేటర్ సంజీవ్ మృతికి అధికారులే కారణం

Satyam NEWS

బీజేపీ కొత్త వ్యూహంతో బిగ్ డ్యామేజ్

Satyam NEWS

Leave a Comment