నిర్భయ దోషులు దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేయడం తో వారి ఆశలు అడియాసలయ్యాయి.మరణశిక్ష అమలును సవాల్ చేస్తూ ఉరిశిక్షపై స్టే విధించాలంటూ దోషులు వినయ్, ముఖేశ్ దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలో ధర్మాసనం విచారణ చేపట్టి పిటిషన్లను తోసిపుచ్చింది. ముందుగా పేర్కొన్నట్లుగానే ఈనెల 22న ఉదయం 7 గంటలకు దోషులకు ఉరిశిక్ష అమలుచేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
ఏడేళ్ల క్రితం జరిగిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులుగా తేలిన వినయ్ శర్మ, ముఖేశ్ సింగ్, అక్షయ్ కుమార్ సింగ్, పవన్ గుప్తాలను ఈ నెల 22న ఉదయం 7 గంటలకు ఉరితీయాలని ఆదేశిస్తూ దిల్లీ కోర్టు తీర్పు చెప్పింది. ఆలోగా దోషులు తమ న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకోవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో దోషులు ఇద్దరు వినయ్ శర్మ, ముఖేశ్ సింగ్ గతవారం తమకున్న చిట్టచివరి న్యాయపరమైన అవకాశమైన క్యురేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు.
అంతకుముందు నిర్భయ తల్లి ఆశాదేవి మాట్లాడుతూ.. తన కుమార్తెను అతి దారుణంగా హింసించి హత్య చేసిన దుర్మార్గులకు ఉరి తప్పదన్నారు. నిర్భయకు న్యాయం జరుగుతుంది అని వ్యాఖ్యానించారు.