ఈ కలికాలంలో మనిషి 80 ఏళ్లు బతికితే అబ్బో చాలా కాలం బతికాడే అంటారు. 80 దాటినప్పటి నుంచి అంతా బోనస్ అనుకుంటారు. నిండు నూరేళ్లూ జీవించమని పెద్దలు ఆశీర్వదిస్తారు కానీ సెంచరీ కొట్టేవారు బహు అరుదుగా ఉంటారు. అదే ఒక వ్యక్తి ఏకంగా 119 ఏళ్లు బతికేస్తే ఇంకా ఆరోగ్యంగా ఉంటూ మరో వందేళ్లు ఢోకా లేదని చెబితే…కచ్చితంగా అది వింతే. ఆ వింతే కేరళలో జరిగింది….జరుగుతూ ఉన్నది.
కేరళ లోని కొల్లం జిల్లా పట్టాజిలో కేశవన్ నాయర్ అనే వ్యక్తి 119 నాటౌట్ గా నిలిచాడు. రికార్డు సృష్టించాడు. బహుశ ప్రపంచంలోనే వృద్ధుడు అయి ఉంటాడు మన కేశవన్ నాయర్. స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న కేశవన్ నాయర్ గాంధీజీని చూసిన జ్ఞాపకాలను కూడా పంచుకుంటాడు. అతని భార్య పరుకుట్టియమ్మ, పెద్ద కుమారుడు వాసుదేవన్ నాయర్ మరణించారు.
కేశవన్ నాయర్ తన మూడవ కుమార్తె శాంతమ్మ వద్ద ఉంటున్నాడు. ఈ ప్రపంచ తాత సంస్కృత శ్లోకాల అర్ధాన్ని చక్కగా చెబుతాడు. ఇంత వయసులో కూడా సంస్కృత శ్లోకాలు మరచిపోలేదు. ఇప్పటికి రెండు వేల మంది పిల్లలకు సంస్కృతం శ్లోకాలను నేర్పించాడు ఈయన. హేట్సాఫ్ టు కేశవన్ నాయర్.