40.2 C
Hyderabad
May 2, 2024 15: 32 PM
Slider గుంటూరు

హత్యకేసు నిందితుడికి స్వాగత సత్కారాలా ?

#potulabalakotaiah

హత్య కేసులో నిందితుడైన అనంత బాబు స్వాగతానికి పోలీసులు అనుమతి ఎలా ఇచ్చారు? అమరావతి మహిళల పొంగళ్ళకు రాని పోలీస్ అనుమతి అనంతబాబు స్వాగతానికి ఎలా వచ్చింది? ఈ ప్రశ్నలతో ఆంధ్రప్రదేశ్ డిజిపి కసిరెడ్డి రాజేంద్రనాథరెడ్డికి,అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య బహిరంగ లేఖ రాశారు. లేఖ పూర్తి పాఠం ఇది.

అయ్యా! డిజిపి గారూ…!

చట్టం కొందరికి మాత్రమే చట్టమా? అందరికీ చుట్టమా? చట్టం పెద్దోళ్ళ ఇళ్ల దగ్గర కాపలా కుక్క అన్న మాట నిజమా? అబద్దమా? ప్రజలకు తెలియపర్చగలరు. ఎందుకంటే, డ్రైవర్ సుబ్రహ్మణ్యంను అత్యంత పాశవికంగా హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పై విడుదలైతే, భారీ స్వాగత, సత్కారాలకు మీరు అనుమతి ఎలా ఇచ్చారు?

గతంలో రాజధాని రైతు మహిళలు అమ్మవారికి పొంగళ్ళు సమర్పించేందుకు అనుమతి ఇవ్వని ఏపీ పోలీసు శాఖ, హత్య కేసు నిందితునికి గజమాల స్వాగత సంబరాలకు అనుమతి ఇవ్వటం ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అన్నట్లుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని వైకాపా మూడున్నరేళ్ళ పాలనలో దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు, శిరోముండనాలు లెక్కకు మించి జరుగుతున్నా, వాటికి న్యాయం చేసేందుకు, బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పేందుకు మనసు రాని మీకు, అనంతబాబుకు స్వాగత సత్కారాలకు మనసు ఎలా వచ్చింది ?

ఒకపక్క అనంతబాబు బెయిల్ పై విడుదలయితే, మాకు ప్రాణాపాయం ఉందని తల్లి, తండ్రి, భార్య మీడియా ముందుకు వచ్చి కన్నీళ్లు పెడుతున్నా, వారికి అభయం ఇవ్వటానికి రాని చేతులు ఊరేగింపు జరుపుకోమని ఇంచేందుకు ఎలా వచ్చాయో చెప్పాలి. కర్నూలులో అత్యాచారానికి గురైన వజీరాకు ఇప్పటికీ న్యాయం జరగ లేదు. శిరోమండలానికి గురైన సీతానగరం ఇంగిడిపల్లి వరప్రసాద్ కు న్యాయం జరగలేదు.

ప్రభుత్వ వైద్యురాలు అనితా రాణికి ఏం న్యాయం జరగలేదు.డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో మిగిలిన నిందితులను అరెస్ట్ చేయలేదు. డాక్టర్ సుధాకర్ సంఘటనపై సిబిఐ విచారణ ఏమైందో తెలీదు. రాష్ట్రంలో జరిగిన దళితుల హత్యలపై, అత్యాచారాలపై ఎలాంటి విచారణ కమిటీని వేయలేదు. కానీ అనంత బాబుకు జైల్లో రాచ మర్యాదలు కల్పించారు.

సెల్ ఫోన్ చేతికి ఇచ్చారు. 14 సార్లు చార్జిషీట్ తప్పుల తడిగా వేశారు. పోలీసుల ప్రోత్సాహంతో బెయిల్ వచ్చేలా చేశారు. కానీ, బాధిత కుటుంబాలకు అభయం ఇవ్వలేకపోయారు. అనంతబాబు స్వాగత సత్కారాలకు అనుమతి ఇచ్చిన ఎస్పీని, సంబందిత పోలీసులను సస్పెండ్ చేయండి. ఎమ్మెల్సీ అనంత బాబు కారణంగా సుబ్రహ్మణ్యం కుటుంబానికి ఎలాంటి ప్రాణహాని జరిగినా, అందుకు డీజీపీగా మీరే బాధ్యత వహించాలి.

ఇలాంటి సంఘటనలు పోలీసు శాఖకు, ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా మిగులుతాయి. రాజకీయ నాయకులకు అనుగుణంగా తలలు ఊపే ఈ సంస్కృతి సరైంది కాదని తెలియజేస్తున్నాను. 32 గాయాలున్న డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఉన్న మిగిలిన నిందితులను వెంటనే అరెస్టు చేయండి. సుబ్రహ్మణ్యం కుటుంబానికి భద్రత కల్పించండి.
ఇట్లు
పోతుల బాలకోటయ్య

Related posts

డబుల్ బెడ్ రూమ్ లకు కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హామీ

Satyam NEWS

న్యూ వైరస్ :మీడియాకు బ్రేకింగ్ న్యూస్ సిండ్రోమ్ వ్యాధి

Satyam NEWS

సీఎం కేసీఆర్ మనసు మార్చు తల్లీ

Satyam NEWS

Leave a Comment