30.3 C
Hyderabad
March 15, 2025 09: 30 AM
Slider ముఖ్యంశాలు

క్షణ క్షణం ఉత్కంఠ భరితం ‘‘ఆపరేషన్ ఎలక్షన్ కమిషన్’’

#Nimmagadda

(సత్యం న్యూస్ ప్రత్యేకం)

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా తనను నియమించబోతున్నారని రిటైర్డ్ జస్టిస్ కనగరాజ్ కు ఎప్పుడు సమాచారం వెళ్లింది? ఆయన దానికి అంగీకారం ఎప్పుడు తెలిపారు? ఆయన విజయవాడ ఎప్పుడు చేరుకున్నారు? అనే అంశాలు ఇప్పుడు చాలా కీలకంగా మారాయి.

ఈ నెల 9వ తేదీ ఆర్డినెన్సు రూపొందించడం మొదలు పెట్టినప్పటి నుంచి 11వ తేదీ ఉదయం 11.30కి జస్టిస్ కనగరాజ్ ప్రమాణ స్వీకారం చేసే వరకూ క్షణ క్షణం అత్యంత ఉత్కంఠభరితంగా కథ నడిచింది. ఎక్కడా ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ఆగమేఘాలపై ఫైళ్లు నడిచాయి.

అత్యంత గోప్యంగా అత్యంత వేగంగా క్షణాల్లో ఫైలు కదలడం చూస్తే రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ ను వదిలించుకోవడానికి జస్టిస్ కనగరాజ్ ను తెచ్చుకోవడానికి ఎంత ప్లాన్ చేసుకున్నదో అర్ధం అవుతుంది. ముందుగా ఆర్డినెన్సు విషయానికి వస్తే ఈ నెల 9న మధ్యాహ్నం 12.23 కు ఎలక్షన్ సెక్షన్ లో మొదలైన ఫైలు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ నుంచి చీఫ్ సెక్రటరీ ఆ తర్వాత మంత్రి, ముఖ్యమంత్రి వద్దకు తిరిగి పంచాయితీరాజ్ సెక్రటరీకి చేరడానికి కేవలం ఏడు గంటలు పట్టింది.

అక్కడ నుంచి మరో రెండు గంటల్లో ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేసుకుని గవర్నర్ వద్దకు చేరింది. రాత్రి 10 గంటలకు గవర్నర్ వద్దకు చేరగా దాన్ని ఆయన మధ్యాహ్నం రెండు గంటలకల్లా క్లియర్ చేశారు. రెండున్నర కల్లా ఆర్డినెన్సు వచ్చేసింది.

ఇదే విచిత్రం అనుకుంటే కొత్త ఎన్నికల కమిషనర్ ను నియమించడం కూడా ఇంత కన్నా వేగంగా జరిగిపోయింది. 10వ తేదీ మధ్యాహ్నం 3.29కి ఫైలు రడీ చేయడం మొదలుపెడితే సాయంత్రం 4 గంటల కల్లా గవర్నర్ కు చేరింది. 11వ తేదీ 8.54కు ఫైలు ముఖ్యమంత్రికి చేరగా 9.01 కల్లా మూడు నాలుగు అంచెలు దాటి పంచాయితీరాజ్  కార్యరద్శికి 9.01కి చేరింది.

తక్షణమే ఆర్డినెన్సు విడుదల కాగా 11.30 కల్లా జస్టిస్ కనగరాజ్ ప్రమాణ స్వీకారం చేసేశారు. జస్టిస్ కనగరాజ్ చెన్సైలో ఉంటారు. ఆయన అక్కడ నుంచి విజయవాడ వరకూ ఎప్పుడు వచ్చారు? ఎలా వచ్చారు? లాక్ డౌన్ నిబంధనలు లేకపోతే వేరే విషయం కానీ లాక్ డౌన్ నిబంధనలు ఉండగా ఆయన ఎలా వచ్చారు?

ఆయనను తిరుమల తిరుపతి దేవస్థానం అంబులెన్సులో తీసుకువచ్చినట్లు తెలుగుదేశం పార్టీ ఆరోపించింది కానీ ఎవరూ ధృవీకరించలేదు, ఖండించలేదు. గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కొత్త ఎన్నికల కమిషనర్ గా నియమించినట్లు ఆదేశాలు ఇవ్వకముందే ఆయన విజయవాడ చేరుకున్నట్లు మాత్రం విశ్వసనీయంగా తెలిసింది.

 ప్రభుత్వమే ఇవన్నీ చేసినందు వల్ల విచారణ జరిపేందుకు అవకాశం లేదు కానీ మామూలుగా అయితే జరిగిన ఈ ఆపరేషన్ మొత్తం ఒక సినిమాగా తీస్తే సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ అవుతుందనడంలో సందేహం లేదు. ఈ ప్రశ్నలు వేసినందుకు, ఈ వివరాలు రాసినందుకు సత్యం న్యూస్ ను ఏదో ఒక పార్టీకి అంటగట్టే సాహసం చేయవచ్చు.

కానీ ఆసక్తి కలిగించే ఈ వివరాలు నేడు కాకపోతే రేపు వెలుగులోకి రావాల్సిందే. ప్రభుత్వం అత్యంత రహస్యంగా, అత్యంత వేగంగా జరిపిన ఈ ‘‘ఆపరేషన్ ఎలక్షన్ కమిషన్’’ లాగా ప్రజలకు ఉపయోగపడే పనులు కూడా చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు రావచ్చు.

Related posts

షేమ్: పసుపు చుట్టూ అరాచక రాజకీయం

Satyam NEWS

రాత్రి వేళల్లో శ్రీశైలానికి వాహనాలు నిషేధం

Murali Krishna

మజీద్ నిర్మాణానికి టెంకాయ కొట్టిన మంత్రి నిరంజన్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment