39.2 C
Hyderabad
May 3, 2024 13: 58 PM
Slider నిజామాబాద్

కామారెడ్డి అర్ధరాత్రి వరకు కార్యదర్శుల ఆందోళన

#Kamareddy Panchayati

టార్గెట్ల భారం తట్టుకోలేక కామారెడ్డి జిల్లాకు చెందిన సుమారు 300 మంది పంచాయతీ కార్యదర్శులు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన బాట పట్టారు. తాము ఉద్యోగులుగా కాకుండా బానిసలుగా పని చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

పని ఒత్తిడి భరించలేకపోతున్నామని సుమారు 7 గంటల పాటు అర్ధరాత్రి వరకు ఆందోళన చేపట్టారు. కామారెడ్డి జిల్లాలో 20 శాతం కంటే కూలీలు ఉపాధి హామీ పనులకు వస్తున్న గ్రామాల పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ ఆదేశించారు.

దాంతో పంచాయతీ కార్యదర్శులు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. సాయంత్రం 5 గంటలకు మొదలైన ఆందోళన అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగింది. జిల్లా అధికారులు, పోలీసులు ఉద్యోగులకు నచ్చజెప్పినా వినిపించుకోలేదు.

జాయింట్ కలెక్టర్ స్వయంగా వచ్చి కలెక్టర్ తో మాట్లాడటానికి కొంత మంది రావాలని సూచించినా వినిపించుకోలేదు. కలెక్టర్ వచ్చి తమ సమస్యలు వినాల్సిందేనని పట్టుబట్టారు. జిల్లా మేజిస్ట్రేట్ హోదా ఉన్న కలెక్టర్ ఇక్కడికి రావడం కుదరదని జేసీ స్పష్టం చేశారు. ఎంత రాత్రి అయినా కలెక్టర్ వచ్చే వరకు ఇక్కడినుంచి వెళ్ళేది లేదని బిష్మించుకు కూర్చున్నారు.

ఉద్యోగులుగా గుర్తించడం లేదు

తమను కనీసం ఉద్యోగులుగా కూడా గుర్తించడం లేదని వాపోయారు. ఉపాధి హామీ పనులు మాకు సంబంధమే లేదని అయినా రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉండేలా పని చేశామని చెప్పారు. అయినా కూలీలను రప్పించడంలో టార్గెట్ రీచ్ కావడం లేదంటూ షోకాజ్ నోటీసులు జారీ చేయడం, మెమోలు ఇవ్వడం సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.

తాము పని చేయనిదే రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో ఎలా ఉందని ప్రశ్నించారు. హరితహారం, పల్లె ప్రగతి పది ప్రమాణాలు పనులు వేగవంతంగా పూర్తి చేస్తున్నామని చెప్పారు.

కావాలని టార్గెట్ చేస్తున్నారు

తాము ఇంత చేస్తున్నా తమను కావాలని టార్గెట్ చేస్తూ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూలీలు తక్కువగా ఉన్న గ్రామ పంచాయతీ కార్యదర్శులు జిల్లా కార్యాలయానికి వచ్చి సంజాయిషీ ఇవ్వాలనడం సరికాదన్నారు.

ఒక రోజు సెలవు కావాలంటే అడిషనల్ కలెక్టర్ అనుమతి తప్పనిసరి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కైజోల్లా యాప్ ద్వారా ఉదయం 8 గంటలకు తిరిగి సాయంత్రం 6 గంటలకు లొకేషన్ పెట్టాలన్న నిబంధనతో ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు.

వ్యవసాయ సీజన్ సమయంలో టార్గెట్ వేధింపులు మానుకోవాలని కోరారు. రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న ఆరోగ్యం బాగలేక పోయినా విధులకు హాజరు కావాల్సిందేనని వేధించడం సరికాదన్నారు. అర్ధరాత్రి వరకు ఆందోళన కొనసాగింది.

ఉన్నతాధికారుల బుజ్జగింపు

అర్ధరాత్రి 12 గంటలకు జేసీ యాదిరెడ్డి, డిఎస్పీ లక్ష్మీనారాయణ మరోసారి వచ్చి ఉద్యోగులకు నచ్చజెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ఇలా రోడ్డుపై బైటాయించడం సరికాదన్నారు. ఇలా కూర్చుంటే సమస్య పరిష్కారం కాదని, కలెక్టర్ వద్దకు వచ్చి సమస్యను చెప్పాలని సుమారు అరగంట పాటు సముదాయించారు.

దాంతో కార్యదర్శులు మెట్టు దిగి 40 మంది కలెక్టర్ ను కలిసి సమస్య వివరించడానికి వెళ్లారు. కైజోల్లా యాప్ తొలగించాలని, ఉపాధి హామీ పనులను మినహాయించాలని, సెలవు మంజూరు చేసే అధికారాన్ని ఎపిఓ లకు ఇవ్వాలని, ప్రతి నెల జీతాలు వచ్చేలా చూడాలని కలెక్టర్ ను కోరారు.

కార్యదర్శుల ఆందోళన పూర్తయ్యే వరకు పోలీసులు తల పట్టుకున్నారు. చివరికి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆందోళన ముగియడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Related posts

మెయిన్ రోడ్డు ఎలక్ట్రానిక్స్ షాపు లో అగ్నిప్రమాదం

Bhavani

కంట్రోల్ కరెన్సీ:చైనా సర్కారు కీలక నిర్ణయం

Satyam NEWS

రోడ్డు ప్రమాదంలో భార్య భర్తలు మృతి

Bhavani

Leave a Comment