32.2 C
Hyderabad
May 8, 2024 12: 11 PM
Slider ప్రత్యేకం

పోడు భూముల సమస్య పరిష్కారానికి సకల చర్యలు

#niranjanreddy

తరతరాల నుండి పోడు భూములను సాగు చేస్తూ వస్తున్న గిరిజనులు, గిరిజనేతరులకు న్యాయబద్ధంగా దక్కాల్సిన భూమి హక్కులను కల్పించేందుకు ప్రభుత్వం జిల్లా స్థాయిలో అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి  సలహాలు సూచనలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం నాగర్ కర్నూలు జిల్లాలోని తిరుమల గార్డెన్ ఫంక్షన్ హాల్ లో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ భూములే ఉపాధిగా జీవిస్తున్న ఆదివాసులు, గిరిజనులకు చట్టబద్దమైన హక్కులు కల్పించి , పట్టాలు ఇవ్వాలన్నది తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశమని దీనిని సజావుగా అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తూ భవిషత్తులో ఒక్క ఇంచు కూడా అటవి భూమి ఆక్రమణకు గురి కాకుండా చేసేందుకు ప్రభుత్వం గ్రామస్థాయి, డివిజినల్ స్థాయి, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి విధివిధానాలను ఖరారు చేస్తుందని తెలిపారు. నల్లమల అటవీ  తెలంగాణకు తలమానికమని, మనం భావితరాలకు అందించే గొప్ప సంపద ఇదేనని దానిని కాపాడు కోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని గుర్తు చేసారు.

పెరుగుతున్న అటవీ విస్తీర్ణం

గత ఏడేళ్లలో 20 శాతం ఉన్న అటవీ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ముందుచూపుతో హరితహారం పథకం ద్వారా 24 శాతానికి పెంచుకున్నామని 4 శాతం అటవీప్రాంతం పెంచుకోవడం గొప్ప విషయంగా తెలియజేసారు. మానవ నిర్మిత అటవీ ప్రాంతాన్ని పెంచుతున్న రాష్ట్రంగా తెలంగాణకు జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కాయన్నారు. పోడు సమస్యకు పరిష్కారం చూపాలి  అదే సమయంలో  భవిష్యత్ లో అటవీ భూముల అక్రమణను అడ్డుకుని, అడవులను సంరక్షించుకోవాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. గిరిజనులైతే  2005 వరకు అటవీ భూములు సాగు చేస్తున్న వారికి హక్కులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని అదే గిరిజనేతరులు అయితే  75 ఏళ్లుగా అటవీభూమిని అనుభవిస్తున్న వారికి  హక్కులు కల్పించాలని ప్రభుత్వ నిర్ణయించిందన్నారు.

హక్కులు కల్పించే విషయంలో వంద శాతం ప్రామాణికత పాటించాలని అటవీ సంరక్షణ, అటవీ భూములపై డివిజన్, సబ్ డివిజన్, గ్రామస్థాయిలో మూడంచెల వ్యవస్థ ఏర్పాటు చేసి అర్హులకు భూముల పట్టాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.  ఈ కమిటిల ద్వారా సిఫారసు చేసిన అంశాలను, శాసన సభలో బిల్లు పెట్టి ఆమోదించుకొని కేంద్రానికి పంపించడం జరుగుతుందని తెలిపారు. 

ప్రస్తుతం ఎవరు ? ఎంత మేర ఆక్రమణలో ఉన్నారన్నది రికార్డ్ చేయడం జరుగుతుందని నాగర్ కర్నూలు జిల్లా భూ విస్తీర్ణం 16 లక్షల 17 వేల 305 ఎకరాలు జిల్లాలో అటవీ విస్తీర్ణం 5 లక్షల 96 వేల 898 ఎకరాలు (36.90%) జిల్లాలోని 12 మండలాలలోని 36 రెవెన్యూ గ్రామాల పరిధిలో 7449.68 ఎకరాల అటవీ భూమి (1.25%) 2302 మంది ఆక్రమణలో ఉన్నట్లు ఆటవీ శాఖా అధికారులు గుర్తించడం జరిగిందన్నారు.

పోడు భూముల సమస్యకు అందరూ సహకరించాలి

అయితే ఇదే తుది జాబితా కాదని, కమిటిల ద్వారా సిఫారసు చేసి మరికొన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. 2005 ముందు వరకు 1018 మంది చేతులలో 3374 ఎకరాలు, 2005 తర్వాత 1284 మంది చేతులలో 4075.68 ఎకరాలు వెరసి 7449 ఎకరాలు  ఆక్రమణలో ఉందని,  అర్హులైన అందరికీ పోడు భూముల క్రమబద్దీకరణ చేయడం జరుగుతుందన్నారు. సమస్యలు పరిష్కరించి, పోడు భూముల క్రమబద్దీకరణకు అందరూ సహకరించాలని కోరారు.

సమావేశంలో పాల్గొన్న నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు పీ రాములు మాట్లాడుతూ  రాష్ట్ర ముఖ్యమంత్రి శాసన సభలో ప్రకటించిన విధంగానే పోదు భూములకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా అఖిల పక్ష సమావేశాలు నిర్వహించి సూచనలు తీసుకొని విధి విధానాలు తయారు చేసేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు.  అటవీ శాఖ అధికారులు చెంచుల పట్ల మానవీయ కోణం తో ప్రవర్తించాలని వారికి ఇబ్బందులు కల్పించకుండా చూడాలని కోరారు. 

జిల్లా కలెక్టర్ పి. ఉదయ కుమార్ మాట్లాడుతూ పోడుభుముల సమస్యలను పరిష్కరించడంతో పాటు అటవీ ప్రాంతాన్ని పరిరక్షించే విధంగా తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాలను ఏర్పాటు చేసి తగు సూచనలు తీసుకునేందుకు ఆదేశించినందున నేడు అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  ఇక్కడ ఇచ్చిన సలహాలు సూచనలు మినిట్ ద్వారా సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేయడం జరుగుతుందని తెలిపారు.

అడవులు ఆక్రమణ జరగకుండా చూడాలి

శాసన మండలి సభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి పోడు భూమి రైతుకు న్యాయం చేస్తూనే ఇకముందు ఎ మాత్రం అటవీ ఆక్రమణ జరుగ కుండ చూడాలని కోరారు.  ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసించారు.

అచ్చంపేట శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ గువ్వల బాల్రాజ్ మాట్లాడుతూ పోడు భూముల సమస్యను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయడం ఒక మరుపురాని ఘట్టంగా అభివర్ణించారు.  మరో అయిదు ఆరు దశాబ్దాల వరకు పోదు భూముల సమస్య ఉత్పన్నం కాకుండా శాశ్వత పరిష్కారం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.  ఆర్ ఓ ఎఫ్ ఆర్ యాక్టు ప్రకారం పోడు భూములకు సంబంధించిన సమస్యలు పరిష్కరించేందుకు సూచనలు, సలహాలు అన్ని పార్టీల ప్రతినిధుల నుండి స్వీకరించడం జరుగుతుందన్నారు.  చట్ట నిబంధనల ప్రకారం అర్హత కలిగిన ప్రతి పోడు భూమి రైతుకు న్యాయం చేసేందుకు కృషి చేస్తామన్నారు.

కొల్లాపూర్ శాసన సభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పోడు భూముల సమస్య చాల దీర్ఘ కాలమైన సమస్య అని ఈ సమస్యను పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం హర్షించదగ్గ విషయమన్నారు.  అయితే చాల చోట్ల రెవిన్యూ, అటవీ శాఖల మధ్య వివాద భుసమస్యలు ఉన్నాయని, ఇరు శాఖల తరపున సంయుక్త సర్వే నిర్వహించి లబ్దిదారులకు న్యాయం చేకూర్చాలని కోరారు.  పేదలు  ఒకచోట సాగు చేస్తున్న  భూమిని మరోచోట సాగు చేసుకోమని చెప్పి ఇప్పుడు ఇక్కడ లేదు అని వేల్లగోడుతున్నారని ఇది అన్యాయమని అన్నారు.  ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేవిధంగా చూడాలని మంత్రిని కోరారు.

ఈ సమావేశంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు సి.పి ఐ నుండి జిల్లా ఇంచర్గే బాలనరసింహ, సి.పి ఐ. యం , తే.రా.స., కాంగ్రెస్ నుండి శ్రీనివాసులు తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షించారు.  అయితే ఇప్పుడు అటవీ శాఖ ద్వారా చూపిస్తున్న పోడు భూమి చాల తక్కువ ఉందని, ఇంకా చాల మండలాలు, గ్రామాలు జాబితాలో చూపించలేదని   సమావేశం దృష్టికి తెచ్చారు. అర్హత కలిగిన వారందరికీ న్యాయం చేకూర్చే విధంగా అన్ని గ్రామాలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు.

ఈ అఖిలపక్ష సమావేశంలో జడ్పీ చైర్మన్ పద్మావతి, అదనపు కలెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, మను చౌదరి, జిల్లా అటవీ శాఖ అధికారి కిస్టా గౌడ్,  ఫారెస్ట్ డివిజినల్ అధికారులు, జిల్లా అధికారులు, జడ్పిటిసిలు, ఎం,పిపి లు పార్టీల ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అవుట రాజశేఖర్, కొల్లాపూర్, సత్యంన్యూస్

Related posts

పనులు చేయకుండానే.. రూ.100 కోట్ల బిల్లులు డ్రా చేశారు.

Satyam NEWS

“Master” Problem: రేవంత్ రెడ్డి పర్యటనపై ఉత్కంఠ

Satyam NEWS

హైదరాబాద్ నడిబొడ్డున తాగునీటి సమస్య తీవ్రం

Satyam NEWS

Leave a Comment