38.2 C
Hyderabad
April 29, 2024 11: 38 AM
Slider

మళ్లీ విజృంభిస్తున్న కాల్ మనీ రాకెట్

call money

చట్టబద్ధమైన సమాజంలో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరగడం దురదృష్టకరం. అదేమంటే తమకు పోలీసుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని చెప్పుకుంటున్నారు. ఇదంతా సాధారణ జనాన్ని పీడిస్తున్న కాల్ మనీ రాకెట్ కథ. అప్పు తీసుకున్న వారిని బెదిరింపులు, వేధింపులతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

రోజువారీ, వంద రోజులు, మీటరు వడ్డీలు వసూలు చేస్తూ బుసలు కొడుతున్న కాల్‌ మనీ రాకెట్ ను పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు లాలాపేట పోలీస్ సస్టేషన్‌ పరిధిలోని హజారు వారి వీధిలో అధిక వడ్డీలు వసూలు చేస్తున్న విద్యానగర్‌ 1వ లైను ఎక్స్‌టెన్షన్‌కు చెందిన ఇమిడాబత్తుని కల్యాణ చక్రవర్తి అలియాస్‌ పప్పుల నాని, నెహ్రూనగర్‌ నాలుగో లైన్‌కు చెందిన మాజేటి శేఖర్‌లను పోలీసులు అరెస్టు చేశారు.

స్పందన కార్యక్రమంలో ఇటీవల నెహ్రూనగర్‌ 10వ లైన్‌కు చెందిన యేలే దుర్గాప్రసాద్‌ అనే కళ్లజోళ్ల వ్యాపారి అర్బన్‌ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అర్బన్‌ ఎస్పీ రామకృష్ణ చర్యలు తీసుకోవాలని ఈస్ట్‌ డీఎస్పీ కె.సుప్రజను ఆదేశించారు. దీంతో గత నెల 30న లాలాపేట పోలీ్‌సస్టేషన్‌లో వీరిపై పలు నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

పప్పుల నాని కార్యాలయంపై దాడి చేసి 30,32,900 నగదు, 9 ఖాళీ ప్రామిసరీ నోట్లు, 10 ఖాళీ బ్యాంకు చెక్కులు, రోజువారి మీటరు వడ్డీకి సంబంధించిన 25 పుస్తకాలు, ఓ ఏటీఎం కార్డును స్వాధీనం చేసుకున్నారు. వీరు మూడు రకాలుగా ప్రజల నుంచి వడ్డీలను వసూలు చేస్తున్నట్టు గుర్తించారు.

లక్ష రూపాయలు అప్పుగా తీసుకుంటే రోజుకు వెయ్యి చొప్పున చెల్లించాలి. ఎన్ని రోజుల పాటు చెల్లించినా దానిని వడ్డీగానే భావిస్తారు. చివరకు ఆ లక్ష ఒక్కసారిగా చెల్లిస్తేనే బాకీ మాఫీ అయినట్లు పరిగణిస్తారు. దీనినే మీటరు వడ్డీగా పేర్కొంటారు. లక్ష అవసరం అయిన వారికి ముందుగానే 22 వేలు మినహాయించుకుని 78 వేలు ఇస్తారు. రోజుకు వెయ్యి చొప్పున వంద రోజుల్లో లక్ష చెల్లించాలి. దీనిని వంద రోజుల వడ్డీగా పేర్కొంటారు.

రూ.పది వేలు అవసరం అయితే ఉదయం వెయ్యి మినహాయించుకుని 9 వేలు ఇస్తారు. సాయంత్రానికి వెయ్యి కలిపి పది వేలు ఇవ్వాలి. దీనిని రోజువారి వడ్డీగా పిలుస్తారు. ఈ విధంగా వీరు గడిచిన 20 ఏళ్లుగా నగరంలో వ్యాపారం చేస్తున్నట్లు ఈస్ట్‌ డీఎస్పీ తెలిపారు. చిన్నప్పటి నుంచి నానికి శేఖర్‌ స్నేహితుడిగా ఉంటున్నాడని, ఆయన చేసే వ్యాపారంలో శేఖర్‌ డబ్బు వసూలు చేస్తున్నాడని చెప్పారు.

ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న వారు, వడ్డీలు చెల్లించలేని మహిళలు ఎవరైనా ఉంటే వారిని లైంగికంగా కూడా వేధింపులకు గురి చేస్తారన్నారు. అంతేకాక వీరి వద్ద అప్పు తీసుకుని చెల్లించలేకుంటే వారిని కార్యాలయానికి తీసుకొచ్చి నిర్బంధించి వేధిస్తారని చెక్కులు, నోట్లు తీసుకుంటారని ఆమె తెలిపారు. వీరిలో నానిపై 2010 నుంచి ఇప్పటి వరకు ఆరు కేసులు నమోదు కాగా శేఖర్‌పై ఓ అత్యాచారం కేసుతో పాటు మరో రెండు కేసులు నమోదై ఉన్నాయన్నారు.

ఇరువురిపై రౌడీషీట్లు తెరుస్తున్నామని చెప్పారు. అయితే వీరు కొందరు పోలీసుల పేర్లు చెప్పి బాధితులను బెదిరించడం చేసేవారని పోలీసు అధికారులకు ఫిర్యాదులు అందాయి. వాటిపై కూడా విచారణ చేస్తున్నారు.

Related posts

భక్తుల తో కిటకిటలాడుతున్న పంచారామ క్షేత్రం

Bhavani

మార్కెటింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాం

Satyam NEWS

పంట నమోదు కార్యక్రమానికి రైతులకు ఆహ్వానం

Satyam NEWS

Leave a Comment