రాజధాని గ్రామాలలో పోలీసుల అరాచకం పెరిగిపోయిందని బిజెపి ఎంపి సుజనా చౌదరి అన్నారు. రాజధాని మహిళల పై పోలీసులు దాడి చేసి, అరెస్టు చేయడం అన్యాయమని ఆయన అన్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమిస్తున్నారని వారికి తన మద్దతు ఉంటుందని సుజనా చౌదరి అన్నారు. ఒంగోలులో మహిళల పై మగ పోలీసులు దాడి చేయడం కలచి వేసిందని ఆయన అన్నారు.
ఇటువంటివి ఆపలేకపోతే మనం పదవుల్లో ఉండటం ఎందుకు? అని ఆయన ఆవేదనగా ప్రశ్నించారు. మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా? ఆఫ్ఘనిస్థాన్ లో ఉన్నామా? అని ఆయన ప్రశ్నించారు. కుల, మతాలకు అతీతంగా అందరూ ఉద్యమం చేసి ఈ దారుణాలు ఆపాలని ఆయన కోరారు. ఆరు నెలల్లో ఆడపడుచుల విశ్వాసం ఈ ప్రభుత్వం కోల్పోయిందని, ఇటువంటి ప్రభుత్వానికి భవిష్యత్తు లో మనుగడ లేదని సుజనా చౌదరి అన్నారు.
అవసరం లేకున్నా 144 సెక్షన్ పెడుతున్నారని, ఏ నిబంధనలు ప్రకారం అర్ధరాత్రి పోలీసులు ఇళ్లకు వెళుతున్నారని ఆయన ప్రశ్నించారు. పండుగ రోజుల్లో అమ్మవారికి మొక్కులు కూడా చెల్లించుకోకుండా పోలీసులు అడ్డుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అరెస్టు చేసిన వారిని కులం అడుగుతున్నారని, కులం వివరాల కోసం ప్రజలను ఇబ్బందులు పెడతారా అని ఆయన ప్రశ్నించారు. వైసిపి ర్యాలీలకు ఎలా అనుమతి ఇస్తున్నారు? రాష్ట్రం లో ఇంత జరుగుతుంటే డిజిపి ఏం చేస్తున్నారు? వైసిపి ఎంపి, ఎమ్మెల్యే లు కూడా మాట్లాడ లేక సిగ్గు తో తలదించు కుంటున్నారని ఆయన అన్నారు.