ఈ నెల 5 వ తేది లోపు ఆర్టీసీ ఉద్యోగులు విధులలో చేరడానికి రాష్ట్రప్రభుత్వం అవకాశం కల్పించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో నాగర్ కర్నూల్ జిల్లా లోని అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి, నాగర్ కర్నూల్ డిపోల పరిధిలో పనిచేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉన్న వారికి పోలీస్ శాఖ నుండి పూర్తి రక్షణ, భద్రత కలిపిస్తామని నాగర్ కర్నూలు జిల్లా ఇంచార్జ్ ఎస్పీ అపూర్వ రావు అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు ఎవరైనా విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉంటే నిర్భయంగా చేరవచ్చునని, ప్రభుత్వం పిలుపు మేరకు విధుల్లో చేరుతున్న ఆర్టీసీ ఉద్యోగులను ఎవరైనా బెదిరించినా భౌతిక దాడులకు పాల్పడినా, వారికి ఏ విధమైన నష్టం కలుగజేసినా వారిపై చట్టప్రకారం పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. ఉద్యోగంలో తిరిగి చేరాలనుకునే ఆర్టీసీ ఉద్యోగులను ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా అడ్డగించినా, ఘెరావ్ చేసినా, బెదిరింపులకు పాల్పడినా వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో నేరుగా ఫిర్యాదు చేయవచ్చని స్పష్టతనిచ్చారు. ఆయా పోలీస్టేషన్ పరిధిలోని సంబంధిత పోలీస్ అధికారులకు నేరుగా ఫోన్ చేయవచ్చన్నారు. డయల్ 100 లేదా నాగర్ కర్నూల్ పోలీసు కంట్రోల్ రూమ్ 08540-230330, పోలీసు వాట్సప్ 7901099 466 నెంబర్ లకు ఫోన్ చేయవచ్చునని తెలిపారు. నాగర్ కర్నూల్ డీఎస్పీ మోహన్ రెడ్డి: 9440795732, అచ్చంపేట డి.ఎస్.పి: 79010 99452 , సీఐ కొల్లాపూర్: 9440795725, నంబర్లలో సంప్రదించినచో వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని లేదా సంబంధిత పోలీస్ స్టేషన్లలో నేరుగా పిర్యాదు చేయవచ్చని ఎస్పీ ప్రకటనలో తెలిపారు.
previous post