33.7 C
Hyderabad
April 29, 2024 23: 26 PM
Slider సంపాదకీయం

రాజుగారి దెబ్బకు రాజకీయ వ్యూహం మరిచిన పెద్దలు

#Raghuramakrishnamraju MP

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యుడు, సీనియర్ నాయకుడు కె.రఘురామకృష్ణంరాజు విషయంలో పార్టీ పెద్దలు తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయ అపరిపక్వతను సూచిస్తున్నాయి. రఘురామకృష్ణంరాజు ను పార్టీ నుంచి పార్లమెంటు సభ్యత్వం నుంచి తప్పిద్దామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులు తప్పుల దొంతరలా కనిపిస్తున్నాయి.

పార్టీ నుంచి ఒక అడుగు ముందుకు వేస్తుంటే రఘురామకృష్ణంరాజు నుంచి పది అడుగులు ముందుకు పడుతున్నాయి. చివరకు ఆయనపై ఏ చర్య తీసుకోలేని నిస్సహాయ స్థితికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరుకుంటున్నది. పార్టీలోని మిగిలిన ఎంపిలను పంపి లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేయాలనుకోవడం పార్టీ చేయబోతున్న అతిపెద్ద లోపభూయిష్టమైన చర్యగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

రఘురామకృష్ణంరాజుకు పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు ఏడు రోజులు సమయం ఇచ్చినా ఆయన ఒక్క రోజులోనే సమాధానం ఇవ్వడమే కాకుండా అందులో రాజ్యాంగపరమైన అంశాలను లేవనెత్తారు. కేవలం లేఖలో చెప్పడమే కాకుండా ఆయన లోక్ సభ స్పీకర్ కు, కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడనే ప్రశ్నించే స్థాయిలో ఆయన లేవనెత్తిన అంశాలు ఉండటంతో వాటిపై రాజ్యాంగ సంస్థలు స్పందించాయి కూడా. దీన్ని సరిదిద్దు కోవాల్సి ఉండగా ఆ పని చేయకుండా మరో రాజకీయ తప్పిదం చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతున్నది.

తాజాగా రఘురామ కృష్ణంరాజు హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేయడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితుల్లోకి వచ్చేస్తున్నది. తనపై అనర్హత, సస్పెన్షన్ చర్యలు అడ్డుకోవాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేశారు. తాను ఎటువంటి పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడలేదని అందులో స్పష్టం చేశారు. తనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్ పై షోకాజ్ నోటీసులు వచ్చాయని, యువజన రైతు శ్రామిక కాంగ్రెస్ పార్టీ తరపున తాను ఎన్నికైనందున ఆ పేరు మీద షోకాజ్ నోటీస్ ఇవ్వలేదన్నారు.

ఈ అంశంపై కోర్టు విచారణ చేపడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరిన్ని వివరణలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ లోపు రాజ్యాంగ వ్యవస్థ ఏదైనా తదుపరి చర్యలు చేపడితే పార్టీ మరిన్ని చిక్కులు ఎదుర్కొవాల్సి రావచ్చు. పార్టీ పరంగా చక్కదిద్దుకోవాల్సిన వ్యవహారం కోర్టులు, రాజ్యాంగ సంస్థల వరకూ తీసుకువెళ్లడంలో రఘురామకృష్ణంరాజు చతురత కనిపిస్తున్నది.

అదే సమయంలో పార్టీ రాజకీయ వ్యూహ వైఫల్యం కనిపిస్తున్నది. రానున్న రోజుల్లో రఘురామకృష్ణంరాజు వ్యవహారం మరిన్ని మలుపులు తిరిగే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నది.

Related posts

హై కోర్టు తీర్పును పెడచెవిన పెడుతున్న జగన్ సర్కార్

Satyam NEWS

కర్రి బాలాజీ కోసం బ్యాక్ డోర్ ఎంట్రీ ఇస్తున్న పూర్ణ

Satyam NEWS

దుబ్బాకలో అధికార దుర్వినియోగం చేశారు

Satyam NEWS

Leave a Comment