23.7 C
Hyderabad
August 10, 2020 04: 25 AM
Slider సంపాదకీయం

ఛీ ఛీ ఈ దరిద్రపు రాజకీయం ఆగం చేస్తోంది

#Madanapalle farmer

సినీ నటుడు సోనూ సూద్ సహాయం చేసిన వ్యక్తిపై సోషల్ మీడియాలో దారుణంగా పోస్టులు పెడుతున్నారు. సోనూ సూద్ అపాత్రదానం చేసినట్లు, సోనూ సూద్ సాయం చేసిన వ్యక్తికి అర్హత లేనట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇది అత్యంత దారుణమైన, హేయమైన చర్య గా సత్యం న్యూస్ భావిస్తున్నది.

ఈ పోస్టులపైనా వస్తున్న వార్తల పైనా సత్యం న్యూస్ నిజానిజాలు తెలుసుకుంది. సోనూ సూద్ సహాయం చేసిన వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తవ్వి తలెకెత్తతున్నట్లు కూడా పోస్టులు వస్తున్నాయి. నాగేశ్వరరావు అనే రైతు ఏపీ రాష్ట్రం చిత్తూరు జిల్లా మదనపల్లెలో టీ హోటల్ నిర్వహించేవాడు.

లాక్‌డౌన్ కారణంగా ఆయన కుటుంబానికి ఉపాధి పోయింది. దీంతో నాగేశ్వరరావు కుటుంబంతో సహా తన స్వంత గ్రామానికి వెళ్లాడు. అయితే ఇటీవల కురుస్తున్న వర్షాలకు వ్యవసాయం చేయాలని అనుకున్నాడు. దున్నేందుకు ఎద్దులు లేక సతమతమవుతుంటే.. ఆయన కన్నబిడ్డలే కాడి పట్టుకు నడిచారు.

సోనూ సూద్ సహృదయం

వాళ్లిద్దరూ కాడి లాగుతుంటే… వెనక నుంచి రైతు, ఆయన భార్య విత్తనాలు వేసుకుంటూ వస్తున్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియో సోనూసూద్ కంటపడింది. ఆయన చలించిపోయారు. వారి కష్టాన్ని చూడలేక పోయారు.  ‘‘రేపు మీకు రెండు ఎద్దులు ఉంటాయి. కాదు ఈ కుటుంబానికి ఓ ట్రాక్టర్ ఉండాలి. సాయంత్రానికల్లా మీకు ఓ ట్రాక్టర్ పంపిస్తాను. ఇకపై ఆ ఆడపిల్లలు ఇద్దరు చక్కగా చదువుకోవచ్చు’’ అని ట్వీట్ చేశాడు.

 ఇచ్చిన మాట ప్రకారం రైతు నాగేశ్వరరావుకు ట్రాక్టర్‌ను అందించారు. దీంతో నాగేశ్వరరావు కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. సోనూసూద్‌కు రుణపడి ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా సోనూకు రైతు కృతజ్ఞతలు తెలిపారు.

స్పందించిన చంద్రబాబు

ఆ తర్వాత సోనూ సూద్ కు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు ఫోన్ చేశారు. తన జిల్లాలోని ఒక రైతుకు సాయం చేసినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆడపిల్లల చదువు తమ పార్టీ బాధ్యత తీసుకుంటుందని ప్రకటించారు.

చంద్రబాబునాయుడు ఈ ప్రకటన చేసిన తక్షణమే నాగేశ్వరరావు పై వ్యతిరేక పోస్టులు ప్రారంభం అయ్యాయి. చిత్తూరు జిల్లా మహల్రాజుపల్లి రైతు నాగేశ్వర్రావుకు ఏపీ ప్రభుత్వంనుంచి అందిన సహాయం అంటూ ఒక పెద్ద లిస్టును సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

ఆ కుటుంబానికి ట్రాక్టర్‌ ఇవ్వడం నటుడు సోనూసూద్‌ చేసిన తప్పు అంటూ చిలవలు పలవలుగా మీడియా దాడి ప్రారంభం అయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనుకూల వర్గాలు చేస్తున్న ప్రచారం ఇది: 1. గత ఏడాది రైతు భరోసా కింద రూ. 13,500 నేరుగా నాగేశ్వర్రావు ఖాతాలో వేసిన ప్రభుత్వం

2. ఈ ఏడాది రైతు భరోసాలో భాగంగా ఇప్పటివరకూ రూ.7500 బదిలీ. మిగతా మొత్తం అక్టోబరులో, జనవరిలో బదిలీ. 3. నాగేశ్వర్రావు చిన్నకూతురుకు జగనన్న అమ్మ  ఒడి కింద గత జనవరిలో రూ.15,000 అందించిన ప్రభుత్వం 4. పెద్ద కూతురు జగనన్న తోడు కింద లబ్ధికోసం దరఖాస్తు చేశారు.

చిరు వ్యాపారులకోసం ప్రభుత్వం వడ్డీలేని ఆర్థిక సహాయం ఈ పథకం కింద అందిస్తోంది.5. నాగేశ్వర్రావు తల్లి అభయహస్తం కింద పెన్షన్‌ అందుకుంటోంది.  6. నాగేశ్వర్రావు తండ్రి వృద్ధాప్య పెన్షన్‌ కింద ప్రతి నెలా రూ.2250లు అందుకుంటున్నారు.

7. కరోనా సమయంలో పేద కుటుంబాలను ఆదుకునేందుకు ప్రతి కుటుంబానికి అందించిన రూ.1000 సహాయాన్ని నాగేశ్వర్రావు కుటుంబం అందుకుంది. ఉచిత రేషన్‌కూడా తీసుకుంది. 8. తనకున్న 2 ఎకరాల పొలంలో వేరు శెనగ వేయడానికి రైతు భరోసా కేంద్రం నుంచి డీఏపీ ఎరువు, విత్తనాలు తీసుకున్నారు.

సొంత ఇల్లు కూడా లేదు

వాస్తవం ఏమిటంటే నాగేశ్వరరావు ఎస్ సి కులానికి చెందిన వారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్నపుడు 1.87 సెంట్లు భూమి ని నాగేశ్వరరావు తండ్రి రామయ్య కి ప్రభుత్వం పట్టాగా ఇచ్చింది. నాగేశ్వరరావుకు సొంత ఇల్లు లేదు. ఇద్దరు కుమార్తెలు. లాక్ డౌన్ కారణంగా ఉపాధి దూరం కావడంతో సొంతూరికి చేరారు.

తల్లిదండ్రులతో కలిసి ఒక గదిలో ఆరుగురుగు నివసిస్తున్నారు. కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం తనపై తన కుటుంబం పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని నాగేశ్వరరావు సత్యం న్యూస్ తో చెప్పారు. నిరుపేదలైన తన తల్లి తండ్రికి వృద్ధాప్యపు పెన్షన్ తీసుకోవడం తప్పా? అని ఆయన ప్రశ్నించారు.

అర్హత ఉంది కాబట్టే అమ్మవొడి ఇచ్చారు

తాము నవ్వుతూ అరక దున్నుతుంటే దాన్ని తప్పుపడుతున్నారని నాగేశ్వరరావు అన్నారు. ఆడపిల్లలు కష్టపడుతుంటే చూడలేక సరదాగా వారు పని చేయాలని తాను నవ్వుతూ మాట్లాడానని అంత మాత్రానికే తాము ఏదో జోక్ కు నవ్వుతున్నట్లు అనుకుంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు.

తన చిన్న కుమార్తెకు అర్హత ఉంది కాబట్టి అమ్మ వొడి పథకం కింద డబ్బులు వచ్చాయని ఇది ప్రభుత్వాన్ని మోసం చేసి తీసుకున్నట్లు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. తాను పార్థా డెంటల్ లో కూలిపని చేసే సమయంలో పార్థా డెంటల్ పార్ధ సారధి గారు పోటీ చేసేందుకు సిద్ధమయ్యారని, తనతో డమ్మీ కాండిడేట్ గా నామినేషన్ వేయించారని నాగేశ్వరరావు తెలిపారు.

ఎన్నికల్లో పోటీ వెనుకు అసలు నిజం ఇది

తర్వాత పార్ధసారధి విత్ డ్రా కావడంతో తాను పోటీలో కొనసాగానని అందుకే తనకు వెయ్యి ఓట్లు వచ్చాయని తెలిపారు. తానేదో బాగా డబ్బులు ఉండి ఎన్నికల్లో పోటీ చేసినట్లు విష ప్రచారం చేస్తున్నారని ఆయన వాపోయారు. రైతు భరోసా డబ్బులు తన తండ్రి ఎకౌంట్ లో పడ్డాయని ఆయన అన్నారు.

అధికారులు కూడా తన ఇంటికి వచ్చి తాను పేదవాడినా కాదా అని పరిశీలించి వెళ్లారని నాగేశ్వరరావు తెలిపారు. తుచ్ఛమైన రాజకీయాల కోసం తన జీవితంతో ఆడుకోవద్దని ఆయన కోరారు. ఎస్ సి కులానికి చెందిన తన కుమార్తెలు చదువుకోవాలని ఆశించడం తప్పా అని ఆయన ప్రశ్నించారు.

చక్కగా చదువుకునే నాగేశ్వరరావు కుమార్తెలు ఉన్నత చదువులు చదవాలని సత్యం న్యూస్ కూడా ఆశిస్తున్నది. నాగేశ్వరరావు పెద్ద కుమార్తెకు ఎంబిబిఎస్ చదవాలని ఆకాంక్ష. ఆమె కోరిక పూర్తి కావాలిఅని కూడా కోరుకుంటున్నాం.

Related posts

స్విమ్మింగ్: 4 బంగారు పతకాలు సాధించిన షేక్ ఖాజా

Satyam NEWS

పోలీసులకు ఇంకా దొరకని తబ్లిగీ జమాత్ నాయకుడు

Satyam NEWS

నెగ్లిజెన్స్: బిడ్డనుఆపరేషన్ థియేటర్ లో కుక్కచంపింది

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!