32.2 C
Hyderabad
May 8, 2024 12: 32 PM
Slider ముఖ్యంశాలు

కోమటిరెడ్డితో పొంగులేటి చర్చలు

#Komati Reddy

బీజేపీలో కొనసాగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో కాంగ్రెస్ నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు చర్చలు జరిపారు. పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. మొయినాబాద్ సమీపంలోని ఫామ్‌హౌజ్‌లో మీటింగ్ జరిగినట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నా ఒక ఫంక్షన్‌లో యాధృచ్ఛికంగా కలిశామని రాజగోపాల్‌రెడ్డి చెప్తున్నారు.

కలిసింది ఎక్కడైనా బీజేపీని వీడి కాంగ్రెస్‌లోకి రావాల్సిందిగా ఆహ్వానించింది నిజమేనని రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఆయనను కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఓపెన్‌గానే ఆహ్వానం పలికారు. ఇక నిర్ణయం తీసుకోవాల్సిందిగా రాజగోపాల్‌రెడ్డి వంతయింది.

హైకమాండ్‌తో భేటీ కావడానికి గత నెల చివరి వారంలో ఢిల్లీ వెళ్ళిన రాజగోపాల్‌రెడ్డి అమిత్ షా, జేపీ నడ్డా తదితరులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని పార్టీ పరిస్థితిని వివరించారు. పార్టీ స్టేట్ చీఫ్‌ను మార్చాల్సిన ఆవశ్యకత ఉంటే తనకు ఆ అవకాశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

పార్టీలో కొద్దిమంది మధ్య విభేదాలు, మనస్పర్ధలు, అసంతృప్తి ఉన్నమాట నిజమేనని, వాటిని సకాలంలో పరిష్కరించాలని కూడా కేంద్ర పెద్దలకు విజ్ఞప్తి చేశారు. ఆయన రిక్వెస్టుకు భిన్నంగా బండి సంజయ్‌ను మార్చిన హైకమాండ్ ఆ స్థానంలో కిషన్‌రెడ్డిని నియమిస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చింది. అదే సమయంలో కాంగ్రెస్ నేతలతో చర్చలు జరగడం గమనార్హం.

ప్రస్తుతం బీజేపీ కేంద్ర నాయకత్వం మీద సంపూర్ణ విశ్వాసం ఉన్నదని, పార్టీ మారే ఆలోచన లేదంటూ పొంగులేటి, జూపల్లికి రాజగోపాల్‌రెడ్డి రిప్లై ఇచ్చినట్లు తెలిసింది. వీరి మధ్య జరిగిన చర్చలను ఈ ముగ్గురూ వెల్లడించడానికి నిరాకరించారు. మరోవైపు రాజగోపాల్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి తీసుకురావడానికి సోదరుడిగా తన వంతు ప్రయత్నం చేస్తానంటూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత వారమే మీడియాతో ఢిల్లీలో వ్యాఖ్యానించారు.

సోనియాగాంధీ, ప్రియాంకాగాంధీ, రాహుల్‌గాంధీతో భేటీ అయిన తర్వాత పై వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు ఈ మాటల ద్వారా సంకేతాలు రావడంతో పీసీసీ చీఫ్ ఓపెన్‌గానే రిక్వెస్టు చేయాల్సి వచ్చింది.మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ గూటికి చేరిన రాజగోపాల్‌రెడ్డి ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం మారిన పరిస్థితుల్లో కొనసాగుతారా లేక కాంగ్రెస్‌లో చేరుతారా అనే చర్చ మొదలైంది.

ఇప్పటికే బీజేపీలోకి వస్తారని భావించిన పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్‌లో చేరడంతో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, బీజేపీలోని నాయకత్వం మార్పు పరిణామాలతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

Related posts

రిజిస్ట్రార్ కార్యాలయంలో స్టాంపు పేపర్ల కొరత

Bhavani

పారదర్శకంగా ఓటర్ జాబితా రూపొందించాలి

Bhavani

చంద్రబాబును కలిసిన ఆమంచి కృష్ణ మోహన్ ?

Satyam NEWS

Leave a Comment