Slider ముఖ్యంశాలు

సంపూర్ణ ఆరోగ్యానికి తొలి వెయ్యి రోజుల స‌మ‌తుల ఆహార‌మే కీల‌కం

#protinosfood

మ‌నిషి సంపూర్ణ ఆరోగ్య‌వంత‌మైన జీవ‌నానికి, శారీర‌క‌, మాన‌సిక ఎదుగుద‌ల‌కు పుట్టిన తొలినాళ్ల‌లో మొద‌టి వెయ్యి రోజుల‌లో తీసుకునే స‌మ‌తుల పోష‌కాహార‌మే ఎంతో కీల‌క‌మ‌ని భార‌త వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి(ఐసీఎంఆర్‌) – జాతీయ పోష‌కాహార సంస్థ‌(ఎన్ ఐ ఎన్‌) శాస్త్ర‌వేత్త డాక్ట‌ర్ జి.ఎం.సుబ్బారావు పేర్కొన్నారు.

సెప్టెంబ‌రు నెల‌లో పోష‌ణ మాసోత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకొని కేంద్ర స‌మాచార‌, ప్ర‌సార మంత్రిత్వ శాఖ విభాగాలైన పత్రికా స‌మాచార కార్యాల‌యం, రీజ‌న‌ల్ అవుట్‌రీచ్ బ్యూరో బుధ‌వారం స‌మ‌తుల ఆహారం నుంచి స‌మ‌తుల పోష‌కాహారం అనే అంశంపై నిర్వ‌హించిన వెబినార్‌లో ఆయ‌న ముఖ్యవ‌క్త‌గా పాల్గొన్నారు. ప‌త్రికా స‌మాచార కార్యాల‌యం సంచాల‌కులు శృతిపాటిల్ ప్రారంభోప‌న్యాసం చేస్తూ ఆరోగ్య‌వంత‌మైన స‌మాజ నిర్మాణమే ల‌క్ష్యంగా సెప్టెంబ‌రు నెల‌లో పోష‌ణ మాసోత్స‌వాల‌ను  2018లో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ ప్రారంభించార‌ని తెలిపారు.

గ‌ర్భిణీ మ‌హిళ‌లు, బాలింత‌లు, బాల‌బాలిక‌ల‌కు పోష‌కాహారం వృద్ధి చేయ‌డానికి ఈ కార్య‌క్ర‌మం ఆరంభించిన‌ట్లు తెలిపారు. అనంత‌రం ఎన్ఐఎన్ శాస్త్ర‌వేత్త జి.ఎం.సుబ్బారావు మాట్లాడుతూ గ‌ర్భంలో పిండ ద‌శ మొద‌లై త‌ల్లిగ‌ర్భంలో 270 రోజులు ఎటువంటి లోపాలు త‌లెత్త‌కుండా శిశువు ఎదుగుద‌ల‌తోపాటు పుట్టిన త‌ర్వాత తొలి రెండేళ్లు(730 రోజులు) పిల్ల‌లలో రోగ నిరోధ‌క శ‌క్తికి, అనంత‌రం ఎదుగుద‌ల‌కు ఎంతో కీల‌క‌మ‌ని, అనంత‌రం ఆరోగ్యంగా జీవితకాలం పాటు గ‌డ‌ప‌డానికి కూడా ఈ 1000 రోజుల పోష‌ణనే తోడ్పాటు అందిస్తుంద‌ని వివ‌రించారు. ఇప్ప‌టికీ 30-40శాతం మ‌హిళ‌ల‌లో సూక్ష్మ పోష‌కాలు, బి12, ఐర‌న్‌, ఫోలిక్‌యాసిడ్ లోపాలు ఉంటున్న‌ట్లు గుర్తించామ‌న్నారు. ఈ లోపాల నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు విభిన్న ఆహార ప‌దార్థాల‌ను త‌గినంత మోతాదులో ప్ర‌తి రోజూ తీసుకోవాల‌ని సూచించారు. గ‌ర్భిణీ మహిళ ప్ర‌తి కిలో బరువు పెరుగుద‌ల‌కు గ‌ర్భంలోని శిశువు 52 గ్రాముల చొప్పున పెరుగుతుంద‌ని తెలిపారు.

బ‌ల‌మైన ఆరోగ్యం, తిరుగులేని రోగ నిరోధ‌క శ‌క్తిని అందించడానికి బిడ్డ పుట్టిన మొద‌టి గంట‌లోపు త‌ల్లి నుంచి శిశువుకు ముర్రుపాలు ప‌ట్టించాల‌ని కోరారు. బిడ్డ పుట్టిన నాటి నుంచి ఆరునెల‌ల‌పాటు త‌ల్లిపాలు త‌ప్ప‌కుండా ఇవ్వ‌డం ద్వారా పిల్ల‌ల‌లో మాన‌సిక, శారీర‌క‌ పెరుగుద‌ల‌తోపాటు  సాంక్ర‌మిక వ్యాధుల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంద‌ని వెల్ల‌డించారు. స‌రైన మోతాదులో స‌రైన స‌మ‌యంలో నాణ్య‌మైన పోష‌కాహారం తీసుకోవ‌డం ద్వారా మాత్ర‌మే ఆరోగ్య‌వంత‌మైన జీవితం సాధ్య‌మ‌ని చెప్పారు.

తాజా పండ్లు, కూర‌గాయ‌లు, ప‌ప్పు ధాన్యాలు, కొవ్వు ప‌దార్థాలు త‌గిన మోతాదులో ప్ర‌తి రోజూ తీసుకోవాల‌ని కోరారు. ప్ర‌తి రోజూ ఆహారంగా 350 గ్రాముల కూర‌గాయ‌లు, 150 గ్రాములు తాజా పండ్లుతోపాటు 5గ్రాముల‌కు త‌క్కువ‌గా ఉప్పు తీసుకోవాల‌ని సూచించారు. ఆహార ప‌దార్థాల‌ను నిల్వ‌చేసుకొని తిరిగి వాడుకోవాల‌నుకుంటే 5 డిగ్రీల కంటే త‌క్కువ ఉష్ణోగ్ర‌త‌లో నిల్వ‌చేసుకోని మాత్ర‌మే వాడుకోవాల‌ని పేర్కొన్నారు. బియ్యం మ‌రీ ఎక్కువ‌గా క‌డిగితే అందులో ఉన్న సూక్ష్మ పోష‌కాలు కోల్పోతాయ‌ని చెప్పారు. వంట‌ల కోసం రెండు లేదా మూడు ర‌కాల వంట నూనెలు మార్చుతూ వాడుకోవాల‌ని సూచించారు.

ఈ వెబినార్‌లో కేంద్ర స‌మాచార‌, ప్ర‌సార‌మంత్రిత్వ‌శాఖ అధికారులు, సిబ్బందితోపాటు తెలంగాణ మ‌హిళాభివృద్ధి, శిశు సంక్షేమ‌శాఖ అధికారులు, సిబ్బంది, అంగ‌న్ వాడీ కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

Related posts

భారీ వర్షాల నేపధ్యంలో మంత్రి సత్యవతి సమీక్ష

Satyam NEWS

ఉంగలం తిరుమల్ ఆధ్వర్యంలో 33వ వార్డు ప్రజల సందర్శన

Satyam NEWS

పవన్ కల్యాణ్ ఒరిజినల్ క్యారెక్టర్ ఇది

Satyam NEWS

Leave a Comment