33.7 C
Hyderabad
April 30, 2024 00: 00 AM
Slider ప్రత్యేకం

గులకరాయి డ్రామాతో అడ్డంగా దొరికేసిన జగన్ రెడ్డి

#raghu

కడపలో మొదలైన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి  హత్య ప్రభంజన పవనాలు రాష్ట్రాన్ని తాకుతున్నాయని, ఆ పవనాలను నిలువరించడానికి ముల్లు ను ముల్లుతోనే తీయాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి సరదాగా, చిలిపిగా  తనపై తానే హత్య ప్రయత్నాన్ని చేయించుకున్నారనే అనుమానాలు వస్తున్నాయని నరసాపురం ఎంపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు రఘురామ కృష్ణంరాజు అన్నారు.

అతడు సినిమాలో షియాజీ షిండేను హత్య చేస్తారని, కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని ఎద్దేవా చేశారు. హత్యా ప్రయత్నం జరిగిందని  అనాలంటే కూడా  కనీస  ఇంగిత జ్ఞానం ఉండాలి కదా అని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. ఎవరైనా పంగళి కర్ర తో హత్య చేయాలని అనుకుంటారా?, పంగళి కర్రతో హత్యచేయాలనుకున్న వాడికి తుపాకీ దొరకదా? అని నిలదీశారు. అయినా జగన్ మోహన్ రెడ్డిని  ఎవరైనా ఎందుకు హత్య చేస్తారని  ప్రశ్నించారు.

ఓడిపోయే జగన్ రెడ్డిపై ఎవరికి మాత్రం కక్ష ఉంటుంది?

ఆయన్ని హత్య చేయవలసిన అవసరం ఎవరికి ఉందని నిలదీశారు. రేపో, మాపో ఎన్నికల్లో  ఓడిపోయే జగన్మోహన్ రెడ్డిని, ఎవరైనా ఎందుకు హత్య  చేస్తారని సూటిగా ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు బుద్ధి ఉన్నవాడు ఎవరైనా ఇటువంటి చిలిపి ప్రయత్నాన్ని కూడా చేయరని, వాళ్లకు వాళ్లే చేసుకుంటే  తప్ప అని ఆయన అన్నారు.

ఆదివారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి ఏదైనా జరిగితే ఆయన పార్టీ పెద్ద మెజారిటీతో నెగ్గుతుందని, ఆ విషయం చిన్న పిల్లాడికైనా తెలుస్తుందని… అటువంటప్పుడు ఆయనపై  హత్య ప్రయత్నాన్ని ఎవరు చేస్తారంటూ నిలదీశారు.

పనికి మాలిన సలహాలు ఇస్తున్న సలహాదారులు

ప్రజల్లో సానుభూతి పొందడానికి పొలిటికల్ అడ్వైజర్లు ఇటువంటి పనికిమాలిన సలహాలను ఇస్తుంటారన్నారు. 2019లో కూడా అలాగే జరిగిందని గుర్తు చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి పై  జరిగిన కోడి కత్తి దాడి, బాబాయి హత్య ఈ కోవకు చెందినవేనని పేర్కొన్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి తరఫున ప్రచారం చేసిన చెల్లి షర్మిళా రెడ్డి, ఇప్పుడు వేరేగా ఉంది. తల్లి అమెరికాకు వెళ్లిపోయింది. ఎన్నికల సర్వేల అంచనాలు దారుణంగా ఉన్నాయి. సిద్ధం సభలకు జనాలు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో  ప్రజల దృష్టిని మరల్చడానికి  జగన్మోహన్ రెడ్డి ఈ సరికొత్త డ్రామాను ఆడారని  రఘురామ కృష్ణంరాజు అన్నారు.

దొరికేసిన హత్యాయత్నం డ్రామా

జగన్మోహన్ రెడ్డి ఆడిన హత్యాయత్నం డ్రామా మరీ దొరికేసే విధంగా ఉందని  రఘురామకృష్ణం రాజు అపహాస్యం చేశారు. కొద్దిసేపు కన్నుమూసి, కొద్దిసేపు కన్ను  తెరిచి ఉంచి, కన్ను కమిలిపోయినట్లుగా ఒకచోట, కన్ను కమిలిపోనట్లుగా  మరొకచోట సాక్షి దినపత్రికలోనే ఫోటోలను ముద్రించారని ఆయన పేర్కొన్నారు.  జగన్మోహన్ రెడ్డి పై జరిగిన హత్యాయత్నానికి తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలని మంత్రి అంబటి రాంబాబు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

ఈ సంఘటనకు నారా చంద్రబాబు నాయుడుకు ఏమిటి సంబంధమని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. ఆయన కాబోయే ముఖ్యమంత్రి అని, అయినా ఎటువంటి తింగరి పనులు ఎవరైనా మటుకు చేస్తారా? అంటూ నిలదీశారు. దానికి ఆయన్ని బాధ్యత వహించాలని పేర్కొనడం సిగ్గుచేటన్నారు. గతంలో ఇదే తరహా డ్రామాలు ఆడినప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరని రఘు రామ కృష్ణంరాజు ప్రశ్నించారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి  అపధర్మ ముఖ్యమంత్రి గా కొనసాగుతుంటే, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి బాధ్యత వహించాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి ఇద్దరు కూడా ఉమ్మడి కడప జిల్లాకు చెందిన రెడ్డి అధికారులేనని గుర్తు చేశారు. ఈ సంఘటనకు వారినే బాధ్యులను చేయాలని రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు. అయినా ఎవరైనా హత్యా ప్రయత్నాన్ని పంగళి కర్రతో చేస్తారా? అంటూ ప్రశ్నించి…పంగళి కర్ర దెబ్బకు  చిన్న పిట్టలు తప్ప, పెద్ద పిట్టలు చావడం లేదన్నారు. పోనీ జగన్మోహన్ రెడ్డి పై  హత్యా ప్రయత్నం జరిగిందని అనుకున్న, ఈ సంఘటన జరిగిన తర్వాత గంటన్నర సేపు తన బస్సు యాత్రను కొనసాగించారని గుర్తు చేశారు.

ఇప్పుడేమో తనపై హత్యా ప్రయత్నం జరిగిందని, విశ్రాంతి తీసుకోవాలని పేర్కొంటూ, బస్సు యాత్ర షెడ్యూల్ ను తర్వాత ప్రకటిస్తానడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇవన్నీ సినిమా కథలని, తనకు తానే ఈ హత్యా ప్రయత్నాన్ని చేసుకున్నారు. రాయి కూడా వచ్చి తగిలిందో లేదో అన్నది డౌటే. ఓ పెద్ద గజమాల  తీసుకొచ్చిన సమయంలో సెక్యూరిటీ కిందకు వంగారు. కరెంటు తీసినప్పుడు, ప్లాస్టిక్ బుల్లెట్ ప్రూఫ్  షీల్డ్ తో  సాధారణంగా జెడ్ కేటగిరి సెక్యూరిటీ  కలిగిన వ్యక్తి ని కవర్ చేస్తుంటారని, ఈ సంఘటన జరిగిన సమయంలో ఎందుకు కవర్ చేయలేదన్నది  అర్థం కావడం లేదన్నారు.

అదే సమయంలో కరెంటు తీస్తారని, గజమాల వస్తుందని, సెక్యూరిటీ సిబ్బంది కిందకు వంగుతారని,  అదే సమయంలో ముందుగా ఎంచుకున్న ప్రాంతానికి వాహనం వస్తుందని ఊహించి, పంగళి కర్రతో ఎంత బాగా కొట్టారంటే… అది ఎక్కడ తగలకుండా, నిర్దేశించిన ప్రాంతంలో  తగలడం అన్నది మానవ మాత్రులకు సాధ్యమయ్యే పనేనా అని రఘురామ కృష్ణంరాజు తనదైన శైలిలో సెటైర్ వేశారు.. జగన్మోహన్ రెడ్డి  సానుభూతి కోసం ఆడిన ఈ డ్రామా మాట దేవుడెరుగు… అసలు ఆయన రాష్ట్ర ప్రజలను ఏమైనా తింగరి వాళ్ళని  అనుకుంటున్నాడా ?? అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు.

ఆపరేషన్ దుర్యోధన సినిమాలో  హీరో శ్రీకాంత్ మాదిరిగా కత్తితో పొడిపించుకుని ఉంటే ఈ డ్రామా కొంచెం పండి ఉండేదేమో కానీ…  అప్పుడు దాన్ని ఆపరేషన్ దుర్యోధన సినిమా కాపీ డ్రామా అని అనేవాళ్లమన్నారు. మరి ఇంత సిల్లీగా ఒంటికి దెబ్బలు తగలకుండానే , జగన్మోహన్ రెడ్డికి టన్నులకొద్దీ సానుభూతి రావాలి… హత్యా ప్రయత్నమన్నది జరిగిపోవాలి, వైయస్ షర్మిళా రెడ్డి, డాక్టర్ సునీతారెడ్డి లు పేర్కొంటున్నట్లుగా,  అవినాష్ రెడ్డిపైనున్న  హత్యా నేరాభియోగమన్నది ప్రజలు మర్చిపోవాలి, చంద్రబాబు నాయుడు దుర్మార్గం చేశాడని అనుకోవాలి అంటే… ఎలా అంటూ రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు.

ఎన్నికల ముందు  అవతలి పార్టీ అభ్యర్థిపై బుద్ధి ఉన్నవారు ఎవరైనా సరే పంగళి కర్రతో హత్యాయత్నం చేస్తారా?, అది జెడ్ ప్లస్ కేటగిరి భద్రత కలిగిన వారిపై, ఏదైనా ఊరికి వస్తుంటే చెట్లను కొట్టేసే వ్యక్తి పై పంగళి కర్రతో హత్యయత్నం సాధ్యమేనా అంటూ నిలదీశారు.

మెజారిటీ ప్రజలు ఇది డ్రామేనని అంటున్నారు

రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలు ఇది డ్రామేనని అంటున్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు . రాష్ట్రంలో ఇద్దరు  జగన్మోహన్ రెడ్డి, భారతి రెడ్డిలకు  కూడా ఇది డ్రామేనని తెలిసినా, ప్రజలు ఈ డ్రామాని విశ్వసించారని అనుకుంటున్నారని, నేను అనుకుంటున్నానని తెలిపారు. జెడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ కలిగిన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బస్సులో నుంచే చేతులు ఊపుతుంటారని, సంఘటన జరిగిన ప్రదేశంలో 100 మంది కూడా లేకపోయినప్పటికీ, బస్సు దిగి ఎందుకు బయటకు వచ్చారని ప్రశ్నించారు.

బయటకు వచ్చి ఎందుకు చేతులు ఊపారని నిలదీసిన ఆయన, ముందే అక్కడ స్పాటని డిసైడ్ అయి ఉంటారన్నారు. అందుకే ఆయన బస్సు దిగి కిందకు రాగానే  పక్కనే ఉన్న ఇంట్లో నుంచి పంగళి కర్రతో గురి చూసి కొట్టినట్లుగా, స్క్రిప్టు రచించారని పేర్కొన్నారు. రాళ్లదాడిలో ఎవరికీ దెబ్బలు తగలలేదని, కేవలం జగన్మోహన్ రెడ్డికి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైకాపా అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ కు మాత్రమే  రాళ్ల దెబ్బలు తగిలినట్టు చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. వెల్లంపల్లి కి కన్ను కింద దెబ్బ తగలగా, స్థానికంగా ఆయనకు ఎంతో కొంత సింపతి, రాష్ట్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డికి సింపతి కోసమే ఈ డ్రామా ఆడినట్లు స్పష్టమవుతోందన్నారు.

చెప్పులు వేసి నిరసన తెలిపే హక్కు ఉందని చెప్పారు కదా

గుడివాడ వైకాపా అభ్యర్థి కొడాలి నాని ఈ డ్రామాలను  అంగీకరించి ఉండరని, అందుకే అక్కడ ఎటువంటి సంఘటన జరగలేదన్నారు.  చెప్పులు వేసి నిరసన తెలియజేయడం ప్రజల హక్కు అని గతంలో పనిచేసిన డీజీపీ  పేర్కొన్నారని, ఇప్పుడు రాళ్లు విసిరి నిరసన తెలియజేయడం  ప్రజల హక్కుని  ప్రస్తుత డిజిపి  అనరని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. ఎందుకంటే ప్రస్తుత డిజిపిని నియమించింది జగన్మోహన్ రెడ్డే నని గుర్తు చేశారు. అయినా రానున్న రెండు, మూడు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీ ని ఎన్నికల సంఘం బదిలీ చేయనుందని  రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

Related posts

ఎన్ఎస్ఎస్‌ వాలంటీర్ అవార్డుకు వీఎస్యూ విద్యార్థి ఎంపిక‌

Sub Editor

కేసీఆర్, కేటీఆర్ దిష్టిబొమ్మల దగ్ధం

Bhavani

వార్ కంటిన్యూస్: ఇరాక్ అమెరికా స్థావరాలపై ఇరాన్‌ దాడి

Satyam NEWS

Leave a Comment