30.7 C
Hyderabad
April 29, 2024 03: 29 AM
Slider విజయనగరం

ఆధిపత్యం కోసమే రాజాంలో హత్య: 24 గంటల్లో నిందితుల అరెస్టు

#murdercase

విజయనగరం జిల్లా పోలీసులు… ఒక్క రోజు లో హత్య కేసు మిస్టరీ ని చేధించి..శభాష్ పోలీసు అని అనిపించుకున్నారు. ఈ నెల 15 వ తేదీన రాజాం లో జరిగిన హత్య కేసులో…24 గంటలలో కేసు ను చేధించామని జిల్లా ఎస్పీ దీపికా తెలిపారు. ఈ మేరకు డీపీఓలో జరిగిన మీడియా సమావేశంలో హత్య కారణాలను చెప్పారు. గ్రామంలో ఆధిపత్యం కోసం మరియు ఆర్థికంగా నష్టపరిచాడన్న కారణంగా ఎగిరెడ్డి కృష్ణను నిందితులు హత్య చేసినట్లుగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక తెలిపారు. 

ఈ నెల 15న రాజాంలో జరిగిన ఏగిరెడ్డి కృష్ణ (58) హత్య కేసులో ప్రధాన నిందితుడితో పాటు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, రిమాండుకు తరలించామన్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న  మరడాన గణపతిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు. హత్యకు గురైన ఎగిరెడ్డి కృష్ణ తెర్లాం మండలం ఉద్దవోలు గ్రామానికి చెంది, గ్రామంలో క్రియాశీలకంగా వ్యవహరించేవారు.

గత కొన్ని సంవత్సరాలుగా అదే గ్రామానికి చెందిన మరడాన వెంకట నాయుడు కుటుంబంతో గ్రామంలో ఆధిపత్యం కోసం గొడవలున్నాయి. గ్రామంలో కొన్ని భవనాలను నిర్మించేందుకు నిందితుడు మరడాన వెంకట నాయుడు కాంట్రాక్టు పనులు చెయ్యగా, బిల్లులు మంజూరు కాకుండా హత్యకు గురైన ఎగిరెడ్డి కృష్ణ అడ్డువడడంతో, మరడాన వెంకట నాయుడు సుమారు 2 కోట్లును నష్టపోయి, అప్పులు పాలై, ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

తనకు ఆర్థికంగా నష్టపర్చిన వ్యక్తిని చంపితేనే, అతనిపై తమ కక్ష తీరడంతోపాటు, ఉద్దవోలు గ్రామంలో ఆధిపత్యం సాధించవచ్చునని భావించారు. ఇందుకుగాను, తమ కుటుంబ సభ్యులతో కలిసి, కుట్ర పన్ని, ఒక పథకం ప్రకారం ఎగిరెడ్డి కృష్ణను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారు. ప్రతీ రోజూ రాజాం నుండి ఏగిరెడ్డి కృష్ణ తాను పని చేస్తున్న కాలం రాజుపేట గ్రామంలోని ఎం.పీ.యూ.పీ. స్కూలుకు ఉదయం మోటారు సైకిలుపై వెళ్ళుతుంటారని గుర్తించారు.

ఎగిరెడ్డి కృష్ణను హత్య చేయుటలో ఈ నెల 15వ తేదీన ఎగిరెడ్డి కృష్ణ ఇంటి వద్ద మరడాన వెంకట నాయుడు మాటువేసి, రాజాంలో ఏగిరెడ్డి కృష్ణ మోటారు సైకిలు ఏపీ 30ఎఎఫ్ 8234 పై ఇంటి నుండి బయలుదేరిన సమాచారాన్ని అతని సోదరుడు మరడాన మోహనరావుకు అందించారు. ఎ-1, ఎ-2 కలిసి బొలోరో వాహనం ఏపీ 39యుబి 0923తో ఎగిరెడ్డి కృష్ణ మోటారు సైకిలును వెంబడించారు.

ఏగిరెడ్డి కృష్ణ రాజాం మండలం కొత్తపేట వద్దకు చేరేసరికి మరడాన మోహనరావు బొలోరో వాహనంను అతి వేగంగా నడుపుతూ, ఉద్దేశ్యపూర్వకంగా ఏగిరెడ్డి కృష్ణ మోటారు సైకిలును వెనుక నుండి ఢీ కొట్టారు. నిందితులు తరువాత వాహనాన్ని ఆపి, ఎగిరెడ్డి కృష్ణ చనిపోయింది? లేనిది? చూసి, చనిపోలేదని నిర్ధారించు కొని, అతని ముఖంపై ఇనుప రాడ్డుతో విచక్షణారహితంగా కొట్టి, చంపేసారు.

నిందితులు బొలోరో వాహనంను సంఘటనా స్థలంలోనే విడిచిపెట్టి, పరారీ అయ్యారు. ఈ కేసులో దర్యాప్తును ప్రారంభించిన రాజాం పోలీసులు ఎగిరెడ్డి కృష్ణ హత్యలో ప్రధాన పాత్ర పోషించిన మరడాన మోహనరావు , రెడ్డి రాము , మరడాన వెంకట నాయుడు , మరడాన రామస్వామి  లను 24గంటల వ్యవధిలోనే అరెస్టు చేసి, రిమాండుకు తరలించారు. ఉద్దవోలు లో శాంతియుత వాతావరణం నెలకొనేందుకు డీఎస్పీ, సీఐల ఆధ్వర్యంలో పోలీసు పికెట్ ను ఏర్పాటు చేసామన్నారు.

ఎగిరెడ్డి కృష్ణ హత్యలో భాగస్వామ్యం ఉన్న వారందరిని నిందితులుగా చేర్చామని, పరారీలో ఉన్న ఉన్న నిందితుడు మరడాన గణపతిని కూడా త్వరలో అరెస్టు చేసి, సాక్ష్యాలను, సాంకేతిక ఆధారాలను సేకరించి, త్వరితగతిన కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేసి, నిందితులు శిక్షపడే విధంగా చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ ఎం.దీపిక స్పష్టం చేసారు.

బాధితులకు న్యాయం చేస్తామని, ఆగ్రహంతో ప్రజలెవ్వరూ చట్టంను చేతుల్లోకి తీసుకోవద్దని, గ్రామంలో శాంతి నెలకొనే విధంగా పోలీసులు చేపట్టే చర్యలకు గ్రామస్థులందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ ఎం. దీపిక కోరారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చీపురుపల్లి డీఎస్పీ ఎ. శ్రీనివాస చక్రవర్తి, రాజాం సీఐ కె.రవికుమార్, చీపురుపల్లి సీఐ జి.సంజీవరావు, సీసీఎస్ సీఐ బుచ్చిరాజు, ఎస్బీ సీఐలు జి.రాంబాబు, ఈ. నర్సింహమూర్తి మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

డ్రయివింగ్ లైసెన్సు లేకపోతే జైలు గ్యారెంటీ

Satyam NEWS

డబుల్ డెక్కర్ బస్సులు వచ్చేశాయ్

Murali Krishna

బిగ్‌బాస్‌3 నుండి శిల్పచక్రవర్తి ఔట్‌ ?!

Satyam NEWS

Leave a Comment