38.2 C
Hyderabad
April 29, 2024 21: 24 PM
Slider చిత్తూరు

నారా, పెద్దిరెడ్డి ఆధిపత్య పోరులో విజేత ఎవరు ?

#chandrababu

మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయిన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాజకీయ దిగ్గజాల మధ్య రాజకీయ పోరు రసవత్తరంగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు, వైసీపీ అగ్రనేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి విద్యార్థి దశ నుండి ఉన్న రాజకీయ వైరం తార స్థాయికి చేరింది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా రాజకీయ కక్షలు ఉగ్ర రూపం దాల్చాయి.

పుంగనూరులో పెద్దిరెడ్డిని ఓడించాలని చంద్రబాబు పావులు కదుపుతున్నారు. కుప్పంలో చంద్రబాబును ఓడించాలని పెద్దిరెడ్డి వ్యూహం రచించి ఆ ప్రకారం రాజకీయాలను నడుపుతున్నారు. కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంగా చంద్రబాబు ముందుకు వెళ్తున్నారు. జిల్లా రాజకీయాల్లో ఇరు అగ్ర నాయకుల మధ్య ఆధిపత్య పోరు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. జిల్లాలో ఉన్న ఆధిపత్యంను నిలుపుకోవడమే లక్ష్యంగా మంత్రి డాక్టర్  పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పనిచేస్తున్నారు. చేజారిన ఆధిపత్యంను తిరిగి దక్కించుకోవడానికి చంద్రబాబు పథక రచనలు చేస్తున్నారు.

ఇలా సవాళ్లు, ప్రతి సవాళ్లతో చిత్తూరు జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. విద్యార్థి దశ నుంచి పగ, ప్రతీకారంతో రగిలి పోతున్న ఇద్దరిలో పైచేయి సాధించేది ఎవరు అని రాజకీయ పరిశీలకులు లెక్కలు కడుతున్నారు.  ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాలపై  రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాలలో రసవత్తర చర్చ జరుగుతోంది.

రాష్ట్రం విడిపోయిన తరువాత  చిత్తూరు జిల్లాలో వస్తున్న మార్పులను రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నారు. ఇద్దరి నియోజక వర్గాలలో జరుగుతున్న పరిణామాల అధ్యాయనం చేస్తున్నారు.  తాజా పరిస్థితులు పరిశీలిస్తే చంద్రబాబు కంటే పెద్దిరెడ్డి ముందు పరుగు తీస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడిస్తానని పెద్దిరెడ్డి సవాలు విసిరారు. దీనికి ప్రతిగా లక్ష ఓట్లు మెజారిటీ సాధిస్తానని చంద్రబాబు చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. దీంతో అందరి దృష్టి చిత్తూరు జిల్లా కుప్పం వైపు మళ్ళింది. రాజకీయ  పరిశీలకులు కుప్పం రాజకీయాలను నిశితంగా పరిశీలించడం మొదలు పెట్టారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఉన్న 14 స్థానాలలో పెద్దిరెడ్డి  నేతృత్వంలో వైసిపి అభ్యర్ధులు 13 స్థానాల్లో విజయం ఘన సాధించారు. అప్పటికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కేవలం తన గెలుపుతో సరి పెట్టు కోవలసిన వచ్చింది. కుప్పంలో 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు 47,121 ఓట్ల మెజారిటీ రాగా, 2019 లో 30,722 ఓట్లకు పడిపోయింది. తరువాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజక వర్గంలోని అన్ని ఎంపిపి, జెడ్పీటీసీ స్థానాలు వైసిపి పరమయ్యాయి. కుప్పం మునిసిపల్ ఎన్నికల్లో టిడిపి ఘోరంగా ఓడిపోయింది.

గత ఏడాది చంద్రబాబు కోసం మాజీ ఎమ్మెల్సీ గౌనివాని శ్రీనివాసులు సహా జైలుకు వెళ్లిన 14 మంది ఇప్పుడు పార్టీ కార్యక్రమాల పట్ల ఉత్సాహం చూపడం లేదు. దీనితో చంద్రబాబు తూర్పు రాయలసీమ పట్టభద్రులు ఎమ్మెల్సీ శ్రీకాంత్ చౌదరికి కుప్పం నియోజక బాధ్యతలు అప్పగించారు. ఒక ఊరి రెడ్డి మరొక ఊరిలో వెట్టి అన్నట్టు ప్రకాశం జిల్లా వ్యక్తి ఇక్కడ చేసేది ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నం అవుతున్నది. చంద్రబాబు మాటలు అంజెరమ్మ కనంలో కుంటి వానిలా ఉంటాయని ఉప ముఖ్య మంత్రి నారాయణ స్వామి ఒక సందర్భంలో చెప్పారు. నేను లేస్తే మనిషిని కాదంటూ ఆయన బెదిరిస్తున్నారని అన్నారు.

కుప్పంలో అధిక శాతం ఓట్లు ఉన్న వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన భరత్ కు ఎమ్మెల్సీ అవకాశం కల్పించి కుప్పం వైసిపి ఇంచార్జిగా నియమించారు. అలాగే జిల్లాలో డాక్టరుగా మంచి పేరున్న అదే సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం కూడా  పెద్దిరెడ్డి ఆశీస్సులతో ఎమ్మెల్సీ అయ్యారు.

పుంగనూరులో 2014 ఎన్నికల్లో 31,731 ఓట్ల మెజారిటీ సాధించిన పెద్దిరెడ్డికి 2019 లో 42,710 ఓట్ల మెజారిటీ వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం ఎంపిపి, జెడ్పీటీసీ స్థానాలను వైసిపి కైవసం చేసుకున్నది. చంద్రబాబు పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా సరైన ఇంచార్జిని కూడా పెట్టలేక పోయారు. మాజీ మంత్రి  అమరనాద రెడ్డి మరదలు అనిషా రెడ్డిని కాదని చల్లా రామచంద్రా రెడ్డికి ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు.

ఆయన కనీసం పుంగనూరులో  పార్టీ కార్యాలయం కూడా ఏర్పాటు చేయలేక పోతున్నారు. మండల కమిటీలు కూడా వేయలేక పోతున్నారు. భవిష్యత్తుకు గ్యారెంటీ బస్సు యాత్రలో సీనియర్ నాయకులు ఎవరూ పాల్గొన లేదు. పరిశీలకులుగా వచ్చిన వారు పారిపోతున్నారు. ఇటీవల పరిశీలకునిగా వచ్చిన రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి నెల్లూరు పెద్దా రెడ్డి రేంజిలో బిల్డప్ ఇచ్చారు. ఏమైందో తెలియదు కానీ మూడు నెలలకే తన పదవికి రాజీనామా చేశారు. అంతకు ముందు వచ్చిన పరిశీలకులు కూడా ఎక్కువ రోజులు పనిచేయ లేక పోయారు. కొత్తగా పరిశీలకునిగా వచ్చిన రాష్ట్ర కార్యదర్శి డంపూరి భాస్కర్ ఎక్కడ ఉన్నారో తెలియదు.

చల్లా రామచంద్రా రెడ్డిని పోటీ పెట్టి పెద్దిరెడ్డి ఓడిస్తానన్న చంద్రబాబు సంస్థా గత నిర్మాణమే చేయలేక పోతున్నారు. పక్క నియోజక వర్గంలో ఉన్న జాతీయ ప్రధాన  కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. మరొక పక్కన ఉన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ అమరనాద రెడ్డి ఉసే లేదు. కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభించిన లోకేష్ భయపడి  పుంగనూరు రాకుండా పులిచెర్ల మీదుగా పీలేరు వెళ్లి పోయారాన్న విమర్శలు ఉన్నాయి. చంద్రబాబు ఒకసారి కూడా పుంగనూరు రాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు చంద్రబాబుపై పెద్దిరెడ్డి పైచేయి  సాధించారని పరిశీలకులు భావిస్తున్నారు. పుంగనూరులో పెద్దిరెడ్డికి ఢోకా ఉండదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

అయితే చంద్రబాబు రానున్న ఎన్నికలలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఒడిస్తానని అంటున్నారు. ఆ దిశగా ఇప్పటివరకు ప్రయత్నాలు జరగలేదు. అడుగులు పడలేదు. పార్టీ సంస్థాగత నిర్మాణం జరగలేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎదుర్కొనే ధీటైన అభ్యర్థిని ఎంపిక చేయలేదు. నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లు మూడు నెలలు కూడా కొనసాగడం లేదు. రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు తరచుగా పర్యటించడం లేదు.

పార్టీ క్యాడర్ ను రామచంద్రా రెడ్డిని ఎదుర్కొనడానికి సమాయత్తం చేయడం లేదు. అంతెందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడటానికి జిల్లా నాయకులు ఎవ్వరూ ధైర్యం చేయడం లేదు. పత్రికా ప్రకటనలు సైతం లేవు. చంద్రబాబు అన్నట్లు జిల్లాలో కొందరు నేతలు పగలు టీడీపీతో ఉంటూ, రాత్రి వైసీపీ నేతలతో పార్టీలు చేసుకుంటున్నారు. రానున్న ఎన్నికల అపార చాణిక్యుడు అయిన చంద్రబాబు ఎలాంటి  వ్యూహాలు అమలు చేసి పుంగనూరులో పెద్దిరెడ్డిని ఒడిస్తారో అని రాజకీయ పరిశీలకులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.

చంద్రబాబు కుప్పంలో చంద్రబాబును ఓడించడానికి పెద్దిరెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మండల పరిషత్, జిల్లా పరిషత్, మునిసిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. దొంగ ఓట్లను భారీగా నమోదు చేసుకున్నారు. తమకు అనుకూలంగా పోలీస్, రెవెన్యూ అధికారులను నియమించుకున్నారు. పార్టీలో క్రియాశీలకంగా ఉన్న నాయకుల ఆర్థిక మూలాలను దెబ్బతిస్తున్నారు. అగ్ర నాయకుల మీద అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతున్నారు. వారి ఆత్మస్థైర్యంను దెబ్బతిస్తున్నారు.

బీసీ కులానికి చెందిన ప్రస్తుత MLC భారత్ ను అభ్యర్థిగా రంగంలోకి దింపుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కొరత రాకుండా చూసుకుంటున్నారు. చివరకు చంద్రబాబు సొంత ఇంటిని కూడా నిర్మించుకోకుండా జాగర్తలు తీసుకున్నారు. మునిసిపల్ సమావేశాలకు కూడా పెద్దిరెడ్డి హాజరవుతున్నారంటే, ఎంత పకడ్బందీగా, వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీ ఎలా సాధిస్తారో, పుంగనూరులో పెద్దిరెడ్డిని ఎలా ఒడిస్తారో అని రాజకీయ పరిశీలకులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. జిల్లా రాజకీయాలలో ఎవరు పట్టు నిలుపుకుంటారో అని జిల్లా రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్నారు.

సాటి గంగాధర్, సీనియర్ జర్నలిస్టు, చిత్తూరు

Related posts

వైయ‌స్ ష‌ర్మిల 95వ రోజు ప్ర‌జాప్ర‌స్థానం పాదయాత్రలో పాల్గొన్న ఆదెర్ల

Satyam NEWS

శ్రీపురం రంగనాయక స్వామి ఆలయాన్ని సందర్శించిన కలెక్టర్

Satyam NEWS

ఉత్త‌మ క్రీడాకారులుగా ఎద‌గాలి : జేసీ వెంక‌ట‌రావు

Satyam NEWS

Leave a Comment