29.7 C
Hyderabad
May 2, 2024 04: 53 AM
Slider ఆధ్యాత్మికం

అయోధ్య రామ మందిర నిర్మాణ ముహూర్తంలో దోషం

#SrinivasaGargeya

(సత్యం న్యూస్ ప్రత్యేకం)

అయోధ్య లో రామ మందిర నిర్మాణంపై ముహూర్తం దగ్గరపడుతున్న కొద్దీ అవాంతరాలు ఎక్కువ అవుతున్నాయి. రామమందిర ప్రధాన పూజారికి కరోనా సోకడం నుంచి అక్కడి భద్రతా సిబ్బందికి కరోనా సోకడం, ఉత్తర ప్రదేశ్ మంత్రి కరోనాతో చనిపోవడం ఇప్పటికే జరిగింది. ఉత్తరప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కరోనాతో బాధపడుతున్నారు.

అందుకే ప్రపంచ వ్యాప్తంగా హిందువుల కలల సాకారం అయిన రామ మందిర నిర్మాణ భూమి పూజ ముహూర్తం పై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. భూమిపూజ కార్యక్రమాలు  పవిత్ర శ్రావణ పూర్ణిమ సోమవారం అంటే నేటి నుండి ప్రారంభమయ్యాయి.

ముహూర్తం ఆదిలోనే వ్యతిరేకించిన ద్వారకా శారదాపీఠాధీశ్వరులు

పునాది రాయి వేయడానికి మాత్రం ఆగస్టు 5 మధ్యాహ్నం 12.15 గంటల నుంచి 12.47 గంటల మధ్య ముహూర్తంగా నిర్ణయించారు. ఆ సమయంలో వెండితో చేసిన ఐదు ఇటుకలను 32 సెకండ్ల వ్యవధిలో ఆలయ పునాదిలో ఉంచాల్సి ఉంటుంది. ఈ ముహూర్తంపై ద్వారకా శారదాపీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్యస్వామి స్వరూపానంద సరస్వతి తొలుత వ్యతిరేకించారు.

ఇప్పుడు నిర్ణయించిన ముహూర్తం దుర్ముహూర్తమని స్వామీ స్వరూపానంద అన్నారు. ద్వారకా పీఠాధిపతి తో పాటు ఉత్తర భారతం లోని ఉద్దండులైన పండితులు భూమి పూజ ముహూర్తం వ్యతిరేకిస్తున్నారు.

అమరావతి ముహూర్తం లాంటిదే అయోధ్య ముహూర్తం

అయోధ్య రామమందిరం భూమి పూజకు సంబంధించిన ముహూర్తం శ్రేయోదాయకం కాదని, ఏపీ రాజధాని అమరావతి తరహాలో అనేక అవాంతరాలు, ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉందని భారత ప్రభుత్వ ఆమోద గణిత పంచాంగ కర్త, ప్రముఖ జ్యోతిష్య నిపుణులు శ్రీనివాస గార్గేయ ఇప్పుడు వెల్లడించారు. 

అమరావతి లో ప్రధాని నరేంద్రమోడీ చేసిన శంకుస్థాపన ముహూర్తంపై తాను అప్పటిలోనే వ్యతిరేకించానని ఆయన గుర్తు చేశారు. ఆనాడు తాను చెప్పిందే ప్రస్తుతం అమరావతిలో జరుగుతున్నదని ఆయన అన్నారు. అదే రీతిలో అయోధ్యలో చారిత్రక రామ మందిరం నిర్మాణం భూమి పూజ సుమూహూర్తం  కాదని గార్గేయ అన్నారు.

ఈ ముహూర్తం దుష్ప్ర భావం భూమి పూజ జరిగిన 40 రోజుల నుంచే ప్రారంభమవుతుందన్నారు. అమృత్ సర్ గోల్డెన్ టెంపుల్, స్వామి నారాయణ్ టెంపుల్  తరహాలో భవిష్యత్తు లో తీవ్రవాదుల దాడులు జరిగే అవకాశం ఉందన్నారు.

శని వీక్షణతో ఆటంకాలు అనివార్యం

ముహూర్తం గ్రహ స్థితులను పరిశీలిస్తే బుధవారం అభిజిత్ లగ్నం ఉండదని ఆయన అన్నారు. అసలు ముహూర్తమే దుర్ముహుర్తంలో ఉందని గార్గేయ వెల్లడించారు. శ్రీ రామ చంద్రుడు జన్మ నక్షత్రం పునర్వసు, కర్కాటక రాశి కాగా ఈ రాశికి అష్టమరాశి అయిన కుంభం లో చంద్రుడు వుండడం పెద్ద దోషమన్నారు.

మారక గ్రహమైన కుజుడు తులా లగ్నానికి 6వ స్థానంలో ఉండి శనిచే వీక్షించడం వల్ల అనేక ఆటంకాలు ఎదురవుతాయన్నారు. చంద్రుడు ఉన్న కుంభ రాశికి పైన మీన రాశి లో కుజుడు, కింద రాశి మకర రాశిలో శని వుండి పాప కర్తరి యోగంలో ఉండడం దేవాలయ నిర్మాణ భూమి పూజలకు ప్రాశస్త్యం కాదని ఆయన అన్నారు. 

ఆర్ధిక వనరులు ఉన్నా ఆటంకాలు తప్పవు

శుభగ్రహాలయిన  గురు,శుక్రులు ఛాయా గృహాలయిన రాహు కేతువులతో కలిసి ఉండడం వలన నిర్మాణానికి ఆటంకాలు ఎదురవుతాయని గార్గేయ అంచనా వేశారు. ఆర్థిక వనరులు సమృద్ధిగా ఉన్నప్పటికీ నిర్ణీత సమయంలో మందిర నిర్మాణం పూర్తయ్యే అవకాశం లేదన్నారు.

వసంత పంచమి, అక్షయ తృతీయ, విజయ దశమి వంటి పర్వదినాలలో ఇలాటి చారిత్రక  భూమి పూజ చేస్తే మహోన్నతంగా ఉంటుందని గార్గేయ అభిప్రాయం వ్యక్తం చేశారు. ముహూర్తం నిర్ణయం చేసిన ఆచార్య రాజేశ్వర శాస్త్రి ఖగోళ శాస్త్రం లో దిట్ట అయితే అయి ఉండవచ్చ కానీ ఇది మాత్రం తప్పు అవుతందని గార్గేయ అన్నారు.

జ్యోతిష్య శాస్త్ర ప్రామాణిక నిర్ణయాలు పాటించకుండా ముహూర్తం కేవలం 12.15 అనేది సంఖ్య శాస్త్రం ప్రకారం 9 అంకె వచ్చే విధంగా ఉందన్నారు. అంతే గాకుండా 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దయిన తేదీని దృష్టిలో ఉంచుకుని ఈ ఆగస్టు 5 కూడా చారిత్రాత్మక రోజుగా మిగిలిపోవాలనే ఉద్దేశ్యం తో ముహూర్తం నిర్ణయం తీసుకుని ఉంటారన్నారు.

సిఎం పర్యటన వాయిదా పడటమే తార్కాణం

ఇది ముహూర్త శాస్త్రాన్ని పరిహసించే విధంగా ఉందని గార్గేయ పేర్కొన్నారు. ఆటంకాలు ఎదురవుతాయనడానికి నిదర్శనమే ఆదివారం నాడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అయోధ్య పర్యటన ఆకస్మికంగా వాయిదా పడటం అని గార్గేయ తెలిపారు.

యూపీ మంత్రి కమలా రాణీ కరోనా తో అకాల మరణం చెందడంతో సీఎం ప్రయాణం వాయిదా పడింది. అయోధ్యలో సర్వాంగ సుందరంగా మహోన్నతంగా జరిగే శుభకర భూమి పూజకు ఆదివారం వెళ్లాల్సిన సీఎం యోగి ఆడిత్యనాధ్ ప్రయాణం వాయిదా పడటం ఆదిలోనే హంసపాదు కావడం కొసమెరుపు అని గార్గేయ వ్యాఖ్యానించారు. రామ మందిర నిర్మాణానికి ముహూర్తం ఖరారు చేసిన ఆచార్య ద్రవిడ్‌ ఖగోళ శాస్త్రంలో దేశంలోనే సుప్రసిద్ధులు. జ్యోతిష్య శాస్త్ర గణనలు చేయడంలో ఆయనను మించినవారు లేరు.  

వాస్తవానికి హిందూ మత సంప్రదాయాల ప్రకారం చతుర్మాస కాలంలో ఎలాంటి నిర్మాణపు పనులు చేయకూడదని చెబుతున్నారు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో చతుర్మాస కాలంలో వీలైనంత తొందరగా ముహూర్తం నిర్ణయించాలని శ్రీరామ జన్మభూమి న్యాస్‌ ట్రస్ట్ ఆయనను అభ్యర్ధించింది. ముహూర్త దోషాలను ప్రత్యేక క్రతువుల ద్వారా ఆ దోషాన్ని తొలగించుకోవచ్చని  కాశీ యోగా గురువు చక్రవర్తి విజయ్‌ నవాద్‌ పేర్కొనడం గమనార్హం.

Related posts

కేంద్రం దిగి వ‌చ్చే దాకా పోరాటం ఆపొద్దు

Sub Editor

లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారానికి సహకరించండి

Satyam NEWS

విజయోత్సవ ర్యాలీ కి తరలి వెళ్ళిన బీజేపీ కార్పొరేటర్లు

Satyam NEWS

Leave a Comment