39.2 C
Hyderabad
April 28, 2024 12: 55 PM
Slider నెల్లూరు

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై నెల్లూరు రెడ్ల తిరుగుబాటు

#Anam Ramanaraya Reddy

తనను భౌతికంగా అంతమొందించేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని సీనియర్ నాయకుడు, వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి తీవ్రమైన ఆరోపణ చేయగా, తన టెలిఫోన్ ను ట్యాప్ చేస్తున్నారని నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు. దీంతో అధికార వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. అధిష్ఠానం తీరుపై కినుక వహించిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఇవాళ వేర్వేరుగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. ఎమ్మెల్యే ఆనం నెల్లూరులోని ఆయన నివాసంలో సైదాపురం మండల నాయకులతో సమావేశమై అభిప్రాయాలు సేకరిస్తున్నారు.

వెంకటగిరి నియోజకవర్గానికి సమన్వయ కర్తగా నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డిని నియమించారు. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ సమన్వయకర్తగా వైకాపా రాష్ట్ర సేవా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కోటంరెడ్డి తమ్ముడు గిరిధర్‌రెడ్డిని నియమించాలని పార్టీలో చర్చ జరిగింది. పార్టీ పరిశీలనలో ఆనం విజయ్‌కుమార్‌ రెడ్డి పేరు కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించే విషయంలో అధిష్ఠానం ఇప్పటికే సిద్ధమైనట్టు సమాచారం. మరో వైపు నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి.. మాగుంట లే అవుట్‌లోని తన కార్యాలయంలో ప్రధాన అనుచరులతో సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణపై మంతనాలు జరుపుతున్నారు.

తన ఫోన్‌ ట్యాపింగ్‌ చేయడంపై కార్యకర్తల వద్ద తీవ్ర మనస్థాపానికి గురైనట్టు తెలుస్తోంది. అనుమానం ఉన్నచోట కొనసాగడం కష్టం అని కోటంరెడ్డి అనుచరులతో చెప్పినట్టు సమాచారం. తమ్ముడికి సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగిస్తే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేదానిపై కోటంరెడ్డి ఆలోచనలో పడ్డారు. ఎమ్మెల్యే కోటంరెడ్డికి మద్దతుగా నియోజకవర్గంలో పలుచోట్ల ప్లెక్సీలు వెలిశాయి. పార్టీ, జెండా ఏదైనా తమ ప్రయాణం కోటంరెడ్డితోనే అంటూ అభిమానులు ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. వైకాపా అధిష్టానం కొత్త డ్రామాకు తెరలేపడంతో ఇద్దరు ఎమ్మెల్యేలు కచ్చితంగా పార్టీ మారాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వైకాపా అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే కోటం రెడ్డిని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చర్చలకు ఆహ్వానించారు. చర్చల కోసం ఇప్పటికే బాలినేని నెల్లూరులోని ఓ హోటల్‌కు చేరుకున్నారు. కోటంరెడ్డి చర్చలకు వెళ్తారా? లేదా?అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. తనను భౌతికంగా అంతమొందించేందుకు కుట్ర పన్నుతున్నారని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నక్సలైట్ల ప్రభావం ఉందని కేంద్రం నిర్ధారించిన ఐదు పోలీస్టేషన్ల పరిధిలో ప్రజాప్రతినిధులకు భద్రత ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు.

‘‘1983 నుంచి రాజకీయాల్లో ఉన్నా. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురు కాలేదు. భద్రత విషయంలో కనీసం సమాచారం కూడా లేకుండా ఇద్దరు గన్‌మెన్‌లను ఏకపక్షంగా తొలగించారు. గతంలో నక్సలైట్లు, ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లర్ల ప్రభావం కలిగిన ప్రాంతం వెంకటగిరి. నెల్లూరు జిల్లా చరిత్రలో ఇలా గన్‌మెన్‌లను తొలగించిన పరిస్థితి ఎప్పుడూలేదు. నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక భౌతికంగా అంతమొందించేందుకు కుట్రలు జరుగుతున్నాయి.

ఆరు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా.. తొమ్మిది సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన రాజకీయ చరిత్ర నాది. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురు కాలేదు. నా ఫోన్లు రెండున్నరేళ్లుగా ట్యాపింగ్‌ అవుతూనే ఉన్నాయి. నెల్లూరులో మాఫియా చెలరేగిపోతోంది. రెండేళ్ల క్రితం బెటాలియన్‌ ఫంక్షన్‌లో మాట్లాడిన నాటి నుంచి ఫోన్లు ట్యాపింగ్‌ అవుతున్నాయి. ఆఫ్‌ ది రికార్డు కాదు.. ఆన్‌ రికార్డు చెబుతున్నా’’ అని ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.

Related posts

విలీనం విమోచన మధ్య నలిగిపోవాల్సిందేనా

Satyam NEWS

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

Satyam NEWS

టిప్పు విగ్రహ వివాదం: ప్రొద్దుటూరులో బీజేపీ నేతల అరెస్టు

Satyam NEWS

Leave a Comment