23.7 C
Hyderabad
July 14, 2024 07: 21 AM
Slider తెలంగాణ ప్రత్యేకం

అపహాస్యం అవుతున్న నిపుణుల నివేదిక

BL02_STATES_SECRETARIAT

నిక్షేపంగా ఉన్న సచివాలయాన్ని కూలగొట్టాలనుకోవడం ప్రభుత్వ నిర్ణయం. దాన్ని ఎవరూ కాదనేందుకు ఏం లేదు. ఒక్క సారి ఓటు వేసిన తర్వాత ఐదేళ్ల పాటు మాట్లాడే హక్కు ప్రజలకు ఉండదు. మాట్లాడినా వారిని తమ పార్టీ వ్యతిరేకులుగా ముద్రవేసి వారి మాటలను తీసిపక్కన పడేస్తారు. అయితే నిపుణులు నివేదిక ఇచ్చినట్లు, దాన్ని మంత్రి వర్గ ఉప సంఘం ఆమోదించినట్లు దాన్ని ముఖ్యమంత్రి అమలు చేయనున్నట్లు కలర్ ఇవ్వడం పైనే పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వాస్తుకు అనుకూలంగా లేదనే ఒక మూఢ నమ్మకంతో పటిష్టంగా ఉన్న సచివాలయాన్ని కూలదోస్తున్నారనేది అందరికి తెలిసిన విషయమే. అయితే ఆ విషయం చెప్పకుండా కమిటీలు, అభిప్రాయాలు అంటున్నారు. నిపుణులు, క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం బయటకు చెప్పేసింది. అందులోని వివరాలు, సచివాలయ ఉద్యోగులు, ప్రతిపక్షాల నాయకులు సత్యం న్యూస్ కు చెప్పిన వివరణలను ఈ కింద పొందుపరుస్తున్నాం.

నిపుణుల కమిటీ :ప్రస్తుతమున్న సెక్రటేరియట్ భవనం మార్పులు చేర్పులు చేసి కొనసాగించడానికి అనువుగా లేదు.

పరిశీలకుల అభిప్రాయం: డి, హెచ్ బ్లాక్ లు కొత్తగా నిర్మించినవి. అవి ఎంతో సౌకర్యవంతంగానే ఉన్నాయి. అవి సౌకర్యవంతంగా లేవని ఇప్పటి వరకూ ఎవరూ అధికారికంగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయలేదు.

నిపుణుల కమిటీ: ప్రస్తుత భవన సముదాయంలోని ఎ,బి,సి,డి,జి, హెచ్ నార్త్, జె, కె బ్లాకుల్లో ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే, దాన్ని ఆర్పడానికి అగ్రిమాపక వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు. మార్పులు చేసినప్పటికీ ఫైర్ ఇంజన్ పోవడం కుదరదు.

పరిశీలకుల అభిప్రాయం: ఇప్పటి వరకూ ఎక్కడా అగ్ని ప్రమాదం జరగలేదు. డి బ్లాక్ లో అప్పుడప్పుడు షార్ సర్క్యూట్ కారణంగా చిన్న చిన్న అగ్ని ప్రమాదాలు జరిగాయి కానీ ఫైర్ టెండర్ రావడానికి అన్ని అనుకూలతలు ఉన్నాయి.

నిపుణుల కమిటీ: చాలా భవనాలు 50-60 సంవత్సరాలు మాత్రమే వినియోగించడానికి వీలుగా డిజైన్ చేయబడ్డాయి. డి మరియు హెచ్ బ్లాకులు తప్ప, మిగతావన్నీ కాల పరిమితి ముగిసినవే.

పరిశీలకుల అభిప్రాయం: ఇది శుద్ధ అసత్యం. ఏనాడో పాడుపడిపోయిన జి బ్లాక్ తప్ప మిగిలిన వన్నీ నివాసయోగ్యమే. ఎంతో పటిష్టంగానే ఉన్నాయి. ఇంకో 50 ఏళ్లు అయినా అవి చెక్కు చెదరవు.

నిపుణుల కమిటీ: ఆర్.సి.సి. నిర్మాణాలు 50-60 సంవత్సరాలు మాత్రమే వినియోగించడానికి అవకాశం ఉంది. మంచినీటి పైపులు, విద్యుత్ వైర్ల జీవితకాలం 25 సంవత్సరాలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణకు అప్పగించిన భవనాల్లో మంచినీటి పైపులు, విద్యుత్ పైర్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వీటిని పునరుద్దరించడం కూడా సాధ్యం కాదు.

పరిశీలకుల అభిప్రాయం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పగించిన భవనాల్లో దాదాపుగా అన్నీ పటిష్టంగానే ఉన్నాయి. జె బ్లాక్, ఎల్ బ్లాక్ లు అధునాతనమైనవి, విశాలమైనవి. పటిష్టమైనవి. వాడకపోవడం వల్ల ఏ నిర్మాణమైనా డ్యామేజి జరిగి ఉంటే దాన్ని సులువుగా సరిదిద్దుకోవచ్చు. బాత్ రూంలు ఇతర సదుపాయాలు శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

నిపుణుల కమిటీ: గడిచిన నాలుగు సంవత్సరాల్లో షార్ట్ సర్క్యూట్ వల్ల సెక్రటేరియట్ ప్రస్తుత భవనాల్లో మూడు అగ్ని ప్రమాదాలు జరిగాయ. డి బ్లాకులో తప్ప మరే బ్లాకులో కూడా మంటలను ఆర్పే ఏర్పాట్లు లేవు.

పరిశీలకుల అభిప్రాయం: ఏ, బి, సి, జె, ఎల్ బ్లాక్ లలో మంటలను ఆర్పే యంత్రాలు ఉన్నాయి. వాటిని వాడుకోకపోవడం, అవి పని చేస్తున్నాయో లేదో చూడడం పెద్ద కష్టమైన పనేం కాదు. పాడైపోతే కొత్తవి పెట్టుకోవడం అస్సలు సమస్య కాదు.

నిపుణుల కమిటీ: ప్రస్తుతమున్న భవనాలను ఎంత ఖర్చు పెట్టి తీర్చిదిద్దినప్పటికీ గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలను అందుకోవడం సాధ్యం కాదు.

పరిశీలకుల అభిప్రాయం: విశాలమైన సచివాలయం భవనాలే గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలను చేరుకోలేకపోతే హైదరాబాద్ లోని దాదాపు అన్ని మల్టీ స్టోరీడ్ భవనాలను తక్షణమే కూలగొట్టాల్సిందే. ఎందుకంటే దాదాపు 90 శాతం భవనాలు నిబంధనలకు అనుగుణంగా కట్టినవికాదు.

నిపుణుల కమిటీ: ప్రస్తుతమున్న భవనాలను కొనసాగిస్తే, నిత్యం వాటిని మరమ్మతులు చేస్తూ ఉండాలి. మౌలిక వసతులు కూడా చాలా కాలం క్రితం ఏర్పాటు చేసినవి. పాత విద్యుత్ వైర్ల వల్ల ఎక్కువ విద్యుచ్ఛక్తి వినియోగం జరిగి,సంవత్సరానికి ఐదు కోట్లు చెల్లించాల్సి వస్తున్నది.

పరిశీలకుల అభిప్రాయం: మరమ్మత్తులు అనేవి పబ్లిక్ ప్లేస్ లలో సర్వ సాధారణం. అలా చేయకుండా ఒకే సారి కట్టి వదిలేస్తామంటే వైట్ హౌస్ కూడా పాడుపడిపోతుంది. విద్యుత్ వినియోగం వల్ల సంవత్సరానికి ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నదనడం హాస్యాస్పదం. ఆఫీసర్లు లేని సమయంలో ఏసిలు, ఫ్యాన్లు, లైట్లు ఆపేసే సిబ్బందిని ఎక్కుమందిని (మెయింటెనెన్సు సిబ్బంది) పెట్టుకుంటే ఇది సమస్యే కాదు.

నిపుణుల కమిటీ: ప్రస్తుతం సెక్రటేరియట్ ప్రాంగణంలో పార్కింగ్ స్థలం లేదు. మంత్రులు, ఐఎఎస్ అధికారులు, సందర్శకుల వాహనాల భవనాల చుట్టూ ఎట్ల పడితే అట్ల పార్క్ చేస్తున్నారు.

పరిశీలకుల అభిప్రాయం: ఇది చాలా సత్యదూరం. ఎవరికి వారి వాహనాలు పార్కింగ్ చేసుకోవడానికి మార్కింగ్ ఉంది. అక్కడ వేరెవరూ వాహనాలు పార్కింగ్ చేయరు. సందర్శకులు ఇతరుల వాహనాలను బయటే ఆపుతారు. వాహన పాస్ ఉన్నవారి వాహనాలను హెలిపాడ్ లో పార్కింగ్ చేయిస్తున్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. (దారుణమైన విషయం ఏమిటంటే కోట్లాది రూపాయలతో హెలిపాడ్ నిర్మించి దాన్ని ఒక్క రోజు కూడా వాడిని పాపాన పోలేదు. అందులో వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు. ఆంధ్రా తరలి వెళ్లిన తర్వాత సెక్రటేరియేట్ లో వాహనాల పార్కింగ్ కు ఇబ్బందే లేకుండా పోయింది)

నిపుణుల కమిటీ: ఒకే భవనం నిర్మిస్తే, ఎక్కువ ఖాళీ స్థలం ఉండడం వల్ల పార్కింగ్ పద్దతి ప్రకారం చేయడం సాధ్యమవుతుంది.

పరిశీలకుల అభిప్రాయం: ఇది మరో దారుణమైన విధానం. సువిశాలమైన స్థలం వదిలేసి ఇలా చేయడం అశాస్త్రీయం కాదా?

నిపుణుల కమిటీ: ప్రస్తుతమున్న సెక్రటేరియట్ లో భవనాలు ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్నాయి. మంత్రులు, అధికారులు ఒక భవనం నుంచి మరొక భవనానికి వెళ్లడానికి, ఫైళ్లు తీసుకెళ్లడానికి ఎండలు, వర్షాలు తదితర కారణాల వల్ల ఇబ్బంది కలుగుతున్నది.

పరిశీలకుల అభిప్రాయం: చిన్న పిల్లలు స్కూలు ఎగ్గొట్టేందుకు చెప్పే కారణం లా ఉంది. ఈ నివేదిక ఇచ్చిన వారికి అసలు బేసిక్ విషయమే అర్ధం కాలేదు. మంత్రులు, ఉన్నతాధికారులు ఫైళ్లను ఇళ్లకు తీసుకువెళతారు. దానికి ఒక ప్రత్యేకమైన మెసెంజర్ వ్యవస్థ ఉంది. ఇప్పటి వరకూ ఇలాంటి వ్యవస్థలో ఫైలు మిస్సింగ్ అయినట్లు ఎక్కడా ఫిర్యాదులు లేవు. అంతెందుకు ఇప్పుడు ముఖ్యమంత్రి సంతకం కోసం ఫైళ్లు బయటకు వెళ్లడం లేదా? ఎండకు వానకు తడిసే విధంగా ఫైళ్లు చేతిలో ఆకాశానికి చూపిస్తూ తీసుకువెళ్లరు. దానికి లెదర్ బ్యాగ్ లు ప్రత్యేకంగా ఉంటాయి. వాటని ప్రభుత్వ వాహనాలలోనే తరలిస్తారు తప్ప ఒక్కో ఫైల్ తీసుకుని తిరగరు. ఇంకో విచిత్రమైన విషయం ఏమిటంటే సచివాలయంలో ప్రతి ఏటా దాదాపు 10 లక్షల రూపాయలతో గొడుగులు కొంటారు. ఇది నిపుణుల కమిటీకి తెలియదేమో.

నిపుణుల కమిటీ: ప్రస్తుతం సిఎంవో, మంత్రులు, అధికారులు వేర్వేరు బ్లాకుల్లో ఉంటున్నారు. అత్యంత రహస్య డాక్యుమెంట్లు, ఫైళ్లు వివిధ బ్లాకులకు తిప్పాల్సి వస్తున్నది. దీనివల్ల అధికార రహస్యాలు బహిర్గతమవుతున్నాయి.

పరిశీలకుల అభిప్రాయం: సచివాలయంలో అధికారిక రహస్యాలు ఏమి ఉంటాయి? అంత రహస్యంగా ప్రజలకు తెలియకూడని విషయాలు సచివాలయంలో జరుగుతాయా? ఇలా ఎంత దాచిపెట్టుకున్నా సమాచార హక్కు చట్టం కింద కావాల్సిన సమాచారం అడిగితే ఇవ్వరా?

నిపుణుల కమిటీ: ఒకే బ్లాకులో సెక్రటేరియట్ నిర్మిస్తే, సిఎంవో, మంత్రులు, అధికారులు ఒకే భవనంలో ఉండి, ఒకరికొకరు ఇంటర్ కనెక్టివిటీ కలిగి ఉంటారు.

పరిశీలకుల అభిప్రాయం: దశాబ్దాలుగా మంత్రులు, ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు కనెక్టివిటీ తోనే ఉన్నారు కదా? ఎక్కడైనా లోపం జరిగిందా? ఎవరైనా ఫిర్యాదు చేశారా?

నిపుణుల కమిటీ: ఎండ, వాన, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అందరూ ఒకే చోట ఉండి విధులు నిర్వర్తించడం సాధ్యమవుతుంది.

పరిశీలకుల అభిప్రాయం: ఇది కూడా చిన్న పిల్లలు స్కూలు ఎగ్గొట్టేందుకు చెప్పే కారణంలానే ఉంది. ట్రాఫిక్ సెక్రటేరియేట్ లోపల ఉంటుందా బయల ఉంటుందా

నిపుణుల కమిటీ: ప్రస్తుత సెక్రటేరియట్ లో కనీసం 150 మందితో సమావేశం పెట్టుకోవడానికి కూడా అవకాశం లేదు.

పరిశీలకుల అభిప్రాయం: ప్రస్తుతం సెక్రటేరియేట్ లో దాదాపు ఆరు వరకూ కాన్ఫరెన్సు హాల్స్ ఉన్నాయి. వాటిలో నిక్షేపంగా సమావేశాలు పెట్టుకోవచ్చు. జరుగుతున్నాయి కూడా. కలెక్టర్ల కాన్ఫరెన్సు సెక్రటేరియేట్ లో పెట్టరు. గతంలో జూబ్లీ హాల్ లో నిర్వహించే వారు. కేసీఆర్ వచ్చిన తర్వాత నుంచి ప్రగతిభవన్ లోనే ఏర్పాటుచేసుకుంటున్నారు. ప్రగతి భవన్ కట్టే సమయంలో కూడా ఇదే కారణం చెప్పారు.

నిపుణుల కమిటీ: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 23 జిల్లాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మంత్రులు, సలహాదారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలు, కార్యదర్శులు, హెచ్ఓడీలు, కార్పొరేషన్ల చైర్మన్లు అందరితో కలిసి సమావేశం పెట్టుకోవడానికి కనీసం 500 మందికి సరిపోయే విధంగా కొత్తగా నిర్మించే సెక్రటేరియట్ గ్రౌండ్ ఫ్లోరో లో నిర్మించడం సాధ్యమవుతుంది.

పరిశీలకుల అభిప్రాయం: పైన చెప్పిందే వర్తిస్తుంది.

నిపుణుల కమిటీ: ప్రస్తుత సెక్రటేరియట్ లో రిసెప్షన్ ప్లేస్ లేదు. విదేశీ ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు సెక్రటేరియట్ సందర్శించినప్పుడు వారికి స్వాగత ఏర్పాట్లు చేయడానికి అనువైన స్థలం లేదు.

పరిశీలకుల అభిప్రాయం: ఇవన్నీ ఉన్నాయి. ఎలాంటి సమస్య ఇన్నేళ్లలో ఎదురుకాలేదు.

నిపుణుల కమిటీ: ప్రస్తుతమున్న సెక్రటేరియట్ లో ఉద్యోగుల పిల్లల కోసం క్రష్ లేదు. సిబ్బందికి భోజనహాలు లేదు. సందర్శకుల గది లేదు. కొత్త భవనం కడితే ఇవన్నీ సమకూర్చడం సాధ్యమవుతుంది.

పరిశీలకులు అభిప్రాయం: నిపుణుల కమిటీకి తెలియని విషయం ఏమిటంటే పిల్లల కోసం క్రష్ ఉండేది. అందులో ఎవరూ పిల్లల్ని చేర్చకపోతే మూసేశారు. మళ్లీ కావాలంటే పెట్టుకోవచ్చు.

నిపుణుల కమిటీ: ప్రస్తుతమున్న సెక్రటేరియట్లో వివిఐపి, విఐపిలకు భద్రత సరిగా లేదు. వివిఐపి, విఐపి, అధికారులకు, సందర్శులకు అందరికీ ఒకే ఎంట్రన్స్, ఒకే ఎగ్జిట్ ఉంది. ఆయా బ్లాకుల్లో కూడా ఒకే ఎంట్రన్స్, ఒకే ఎగ్జిట్ ఉంది. ఇది భద్రతకు ఏమాత్రం క్షేమకరం కాదు.

పరిశీలకుల అభిప్రాయం: ఇది శుద్ధ అబద్ధం. సచివాలయానికి దాదాపుగా నాలుగు దిక్కులా నాలుగు సువిశాలమైన గేట్లు ఉన్నాయి. వాటిలో రెండింటిని కావాలనే మూసేశారు. ఒకే ఎంట్రన్స్, ఒకే ఎగ్జిట్ అనేద భద్రత కోసం పోలీసులు పెట్టుకున్నదే తప్ప లేక కాదు.

చివరగా సెక్రటేరియేట్ ను పడగొట్టాలంటే మీకు అడ్డేం లేదు. వాస్తుకోసం పడగొడుతున్నాం అని చెప్పి పడగొట్టండి అంతే కానీ ఇది పనికి రాదు అని పడగొట్టవద్దు.

Related posts

సీఎం జగన్ ఓ కలుపు మొక్క

Satyam NEWS

బాదితులకు సత్వర న్యాయం చేయాలి

Bhavani

సొంతూరికి పోతున్నా . . .

Satyam NEWS

Leave a Comment