39.2 C
Hyderabad
April 30, 2024 19: 41 PM
Slider విజయనగరం

స‌మ‌గ్ర వ్య‌వ‌సాయ ప్ర‌ణాళిక త‌యారుచేయాలి

#vijayanagaram

ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు క‌లిసి ఒక కుటుంబంలా జిల్లా అభివృద్దికి క‌లిసి ప‌నిచేద్దామ‌ని, ఏపీ రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి, విజయనగరం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బూడి ముత్యాల‌నాయుడు పిలుపునిచ్చారు. జిల్లాను అభివృద్దిప‌థంలో న‌డిపేందుకు అంద‌రూ త‌మ‌వంతు కృషి చేయాల‌ని కోరారు. ఇన్‌ఛార్జి మంత్రి అధ్య‌క్ష‌త‌న జిల్లా స‌మీక్షా స‌మావేశం క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో జ‌రిగింది.

డిప్యూటీ సీఎం రాష్ట్ర గిరిజ‌న సంక్షేమ శాఖామంత్రి పీడిక రాజ‌న్న‌దొర‌, రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ, జిల్లాకు చెందిన ఇత‌ర‌ ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్న ఈ స‌మావేశంలో, జిల్లాకు సంబంధించిన‌ వివిధ అంశాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించి, ప‌లు  నిర్ణ‌యాలు తీసుకున్నారు.డిప్యూటీ సీఎం, ఇంచార్జి మంత్రి బూడి ముత్యాల‌నాయుడు ముందుగా మాట్లాడుతూ, జిల్లాలు వేరైనా ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల్లో తామంతా ఒకేకుటుంబం అన్న భావ‌న ఉంద‌న్నారు.

త‌న‌కు విజ‌య‌న‌గ‌రం జిల్లా అంటే ఎంతో ఇష్ట‌మ‌ని, అందుకే ఈ జిల్లాకు ఇన్‌ఛార్జి మంత్రిగా వ‌చ్చాన‌ని చెప్పారు. అంద‌ర‌మూ ఒక కుటుంబంలా ప‌నిచేసి జిల్లాను అభివృద్ది ప‌థాన న‌డిపించాల‌ని కోరారు. ప్ర‌తీ పేద‌వాడి క‌ళ్ల‌లో ఆనందం చూడాల‌న్న‌ది సీఎం జగన్ ల‌క్ష్య‌మ‌ని, ఆయ‌న‌ ఆశ‌యాల‌ను నెర‌వేర్చాల‌ని పిలుపునిచ్చారు. అధికారులు పార‌ద‌ర్శ‌కంగా ప‌నిచేసి, ప్ర‌భుత్వ‌ ప‌థ‌కాల‌ను అమ‌లు చేయాల‌ని కోరారు.

అజెండాలోని వ్య‌వ‌సాయం, నీటి పారుద‌ల‌, వైద్యారోగ్యం, త్రాగునీటి స‌ర‌ఫ‌రా, గృహ‌నిర్మాణం త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించారు. గ్రామాల్లో వాస్త‌వ సాగుభూమి ఆధారంగా, స‌మ‌గ్ర వ్య‌వ‌సాయ ప్ర‌ణాళిక‌ను త‌యారు చేయాల‌ని ఇన్‌ఛార్జి మంత్రి సూచించారు. దీనికోసం అధికారులు క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించి, స‌మ‌గ్రంగా స‌మాచారాన్ని సేక‌రించాల‌ని, రైతుల‌కు ఈ క్రాప్ న‌మోదుపై అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని ఆదేశించారు.

వ్య‌వ‌సాయ శాస్త్ర‌వేత్త‌ల సూచ‌న‌ల‌కు అనుగుణంగానే, ఎక‌రాకు 20 కిలోల వ‌రి విత్త‌నాల‌ను ఇవ్వ‌డం జ‌రుగుతోంద‌న్నారు. ప్రాజెక్టుల్లో జ‌రుగుతున్నఅభివృద్ది ప‌నులను ప‌రిశీలించి, ఇబ్బంది లేనిచోట మాత్ర‌మే ముందుగా నీటిని విడుద‌ల చేయాల‌ని సూచించారు. త్రాగునీటి వృధాను అరిక‌ట్టాల‌ని, అవ‌స‌ర‌మైన చోట ట్యాంకుల‌ను నిర్మించాల‌ని చెప్పారు. 

పారిశుధ్యంపై ప్ర‌త్యేక‌ దృష్టి పెట్టాల‌ని మంత్రి ముత్యాల‌నాయుడు సూచించారు.  సీజ‌న‌ల్ వ్యాధులు ప్ర‌భ‌ల‌కుండా, ముందే అప్ర‌మ‌త్త‌మై, త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వైద్యారోగ్య‌శాఖ‌ను మంత్రి ఆదేశించారు. ఆసుప‌త్రుల్లో అవ‌స‌ర‌మైన మందులు, ప‌రిక‌రాలు సిద్దంగా ఉంచాల‌న్నారు. క్షేత్ర‌స్థాయిలో స‌న్న‌ద్ద‌త‌పై, జిల్లా అధికారులు, మండ‌ల అధికారులు త‌ర‌చూ గ్రామాల్లో ప‌ర్య‌టించాల‌ని సూచించారు. సిహెచ్‌సిల్లో రోగుల‌కు ఇస్తున్న ఆహార ప‌దార్ధాల నాణ్య‌త‌ను ప‌రిశీలించాల‌ని, మెనూ స‌క్ర‌మంగా అమ‌ల‌య్యేలా చూడాల‌ని సూచించారు.

ఆసుప‌త్రుల‌ను ప‌రిశుభ్రంగా ఉంచాల‌న్నారు. ఇది సీజ‌ను కావ‌డంతో, పాముకాటు మందు అన్ని ఆసుప‌త్రుల్లో ఉంచాల‌ని సూచించారు. జ‌ల‌జీవ‌న్ మిష‌న్ క్రింద గ‌తంలో ర‌ద్దు చేసిన సుమారు100 కోట్ల ప‌నుల‌కు మ‌ళ్లీ ప్ర‌తిపాద‌న‌ల‌ను సిద్దం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.  జ‌గ‌న‌న్న కాల‌నీల్లో విద్యుత్‌, త్రాగునీటి స‌దుపాయం క‌ల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెప్పారు.  ప్ర‌తీ అధికారి త‌న జాబ్‌ఛార్ట్ ప్ర‌కారం విధుల‌ను నిర్వ‌హిస్తే, చాలా వ‌ర‌కు స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయ‌ని స్ప‌ష్టం చేశారు.

మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ, పంట న‌ష్ట‌పోయిన ప్ర‌తీరైతుకూ  న‌ష్ట‌ప‌రిహారం అందేలా చూడాల‌న్నారు. పంట‌ల బీమా లో రైతుల భాగ‌స్వామ్యం కోసం, ఈ ఏడాది నుంచి ప్ర‌తీ రైతు10 చెల్లించాల‌ని చెప్పారు. జిల్లాలోని ప్ర‌తీ రైతు భ‌రోసా కేంద్రానికి కేటాయించిన విత్త‌నాలు, ఎరువుల వివ‌రాల‌ను ఆయా నియోజ‌క‌వ‌ర్గ ఎంఎల్ఏల‌కు అంద‌జేయాల‌ని ఆదేశించారు.

ప‌లువురు ఎంఎల్ఏల కోరిక మేర‌కు, మున్సిపాల్టీల్లో వ్య‌వ‌సాయం ఉన్న‌చోట రైతు భ‌రోసా కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌డానికి తీర్మాణం చేసి, ప్ర‌భుత్వానికి పంపిస్తున్న‌ట్లు తెలిపారు. ఖ‌రీఫ్‌ సీజ‌నుకు స‌రిప‌డే  విత్త‌నాల‌ను, ఎరువుల‌ను కొర‌త రాకుండా సిద్దం చేయాల‌న్నారు. ఓటిఎస్ ప‌థ‌కం అమ‌లు, ఎదుర‌వుత‌న్న స‌మ‌స్య‌ల‌పై త్వ‌ర‌లో ఒక‌ ప్ర‌త్యేక స‌మావేశం నిర్వ‌హించి, చ‌ర్చిస్తామ‌ని హామీ ఇచ్చారు. ఎంఎల్ఏ బొత్స అప్ప‌ల‌న‌ర‌స‌య్య‌ కోరిక మేర‌కు, గ‌జ‌ప‌తిన‌గ‌రం బ్రాంచ్ కెనాల్ ప‌నులు నుంచి కుమ‌రాం, లింగాల‌వ‌ల‌స గ్రామాల‌కు మిన‌హాయింపు నివ్వ‌డానికి అంగీక‌రించారు.

జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ, ఈ ఏడాది ముందుగానే వ‌ర్షాలు మొద‌లు కావ‌డం వ‌ల్ల‌, ప్రాజెక్టుల‌నుంచి షెడ్యూలుకంటే ముందుగా సాగు నీటిని విడుద‌ల చేయాల‌ని సూచించారు. క్లాసిఫికేష‌న్ లేని భూముల‌కు ఇ-క్రాప్ న‌మోదు చేయ‌డం లేద‌ని, ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరారు. చిన్న‌, స‌న్న‌కార రైతుల‌కు పూర్తిగా స‌బ్సిడీ విత్త‌నాల‌ను ఇవ్వాల‌ని, ఇటీవ‌ల జ‌రిగిన వ్య‌వ‌సాయ స‌ల‌హా మండ‌లి స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెళ్ల‌డించారు.

క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి మాట్లాడుతూ, ప్ర‌స్తుతం స‌బ్సిడీపై ఒక్కో బ‌స్తా విత్త‌నాల‌ను మాత్ర‌మే ఇవ్వ‌డం జ‌రుగుతోంద‌ని చెప్పారు. జిల్లాకు అద‌నంగా విత్త‌నాలు కావాల‌ని ప్ర‌భుత్వాన్ని కోర‌డం జ‌రిగింద‌న్నారు. ఈ క్రాప్ న‌మోదులో స‌మ‌స్య‌ను తొల‌గించేందుకు భూముల క్లాసిఫికేష‌న్‌కు సంబంధించి, ప్ర‌భుత్వానికి ప్ర‌త్యేక అనుమ‌తి కోరామ‌న్నారు.ఎంపి బెల్లాన చంద్ర‌శేఖ‌ర్ మాట్లాడుతూ,  జిల్లాకు పంట న‌ష్ట‌ప‌రిహారం చాలా త‌క్కువ‌గా వ‌చ్చింద‌ని, దీనిపై దృష్టి పెట్టి, రైతులు న‌ష్ట‌పోకుండా చూడాల‌ని కోరారు. 

ఈ ఏడాది ముందుగానే వ‌రినాట్లు ప‌డే అవ‌కాశం ఉంద‌ని,  స‌కాలంలో ఎరువులు, విత్త‌నాల‌ను అందించాల‌ని సూచించారు. ఆప‌రేట‌ర్లు లేక‌పోవ‌డం వ‌ల్ల‌, గ్రామాల్లో ఇంటింటికీ నీటి స‌ర‌ఫ‌రాలో ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని చెప్పారు.ఎమ్మెల్యేలు శంబంగి వెంక‌ట చిన‌ప్ప‌ల‌నాయుడు, కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి, బొత్స అప్ప‌ల‌న‌ర‌స‌య్య‌, బ‌డ్డుకొండ అప్ప‌ల‌నాయుడు, కంబాల జోగులు, క‌డుబండి శ్రీ‌నివాస‌రావు, ఎమ్మెల్సీలు ఇందుకూరి ర‌ఘురాజు, పెనుమ‌త్స సురేష్‌బాబు మాట్లాడుతూ, త‌మ నియోజ‌క‌వర్గాల‌కు చెందిన‌ ప‌లు స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించారు. 

ఈ స‌మావేశంలో డిసిసిబి ఛైర్మ‌న్ వేచ‌ల‌పు వెంక‌ట చిన‌రామునాయుడు, డిసిఎంఎస్ ఛైర్మ‌న్ అవ‌నాపు భావ‌న‌, జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్‌, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, వివిధ శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

Related posts

రెగ్యులరైజ్ చేయాలని కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగుల మానవహారం

Satyam NEWS

మాణిక్యాలరావుపై అసత్య ప్రచారం

Satyam NEWS

అమ్మ వృద్ధాశ్రయం సందర్శించిన ట్రిబ్యునల్ బెంచ్ మెంబర్ అనితా రెడ్డి

Satyam NEWS

Leave a Comment