27.7 C
Hyderabad
May 14, 2024 05: 00 AM
Slider ప్రత్యేకం

ఇలా చేస్తే కాండ్రించి ముఖాన  ఉమ్మేస్తారు

#raghurama

మీడియా సంస్థలపై దాడిని  ప్రజలు హర్షించరు. మీడియా సంస్థలపై పనిగట్టుకొని దాడి చేస్తే అందరూ ముఖాన కాండ్రించి ఉమ్మేస్తారు. పద్మ విభూషణ్  అవార్డు గ్రహీత అయిన రామోజీరావు  క్యారి కేచర్ ను సాక్షి దినపత్రికలో  నగ్నంగా వేయడం  దుర్మార్గం. ఇతర మీడియా సంస్థలు కూడా మన లాగే వల్గర్ గా క్యారి కేచర్ చిత్రించే  పరిస్థితి తీసుకురావద్దు. చెత్త పేపర్ల ద్వారా  ప్రతిపక్ష  పార్టీలలో పని చేస్తున్న మహిళలను అవమానించడం ద్వారా, మన పార్టీలో పని చేస్తున్న మహిళలకు  ఆ దుస్థితి తీసుకురావద్దని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు  రఘురామకృష్ణం రాజు  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి హితవు పలికారు.

గురువారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… మన పార్టీలో పని చేసే  మహిళలు మాత్రమే సంసారులవుతారా?, ప్రతిపక్ష    పార్టీలకు ఓట్లు వేసే మహిళలు,  ఆ పార్టీలలో పని చేసే మహిళా నాయకురాళ్లందరికీ   పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగానే కనిపించినట్లుగా రంకును అంటగట్టేస్తారా? అని  ప్రశ్నించారు. అదే మీ కుటుంబాలకు అంటగట్టి ఫేక్ న్యూస్ రాసిన వారిని  ఐదు నిమిషాల వ్యవధిలో పట్టుకుంటారు.

మరి ప్రతిపక్ష పార్టీల నాయకురాళ్లపై, వారికి ఓటేసిన మహిళలపై  తప్పుడు వార్తలను రాసి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన  వారిని  సీతారామాంజనేయులు పట్టించుకోరా?  అని ఆయన నిలదీశారు. ప్రతిపక్ష పార్టీ నాయకురాళ్ల గురించి  అసభ్యంగా వార్తలు రాసిన వారిని పట్టుకొని ప్రజల ముందు నిలబెట్టాలని, లేకపోతే సామూహికంగా  మహిళలు మన పార్టీకి దూరమయ్యే పరిస్థితి నెలకొంటుందని  రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు. ఇటువంటి పనికిమాలిన  చర్యలు మానకపోతే, మన పార్టీ తీవ్రంగా నష్టపోతుందన్నారు.

బరితెగించిన బ్యాచ్ ఇటువంటి దాడులు చేస్తూనే ఉంటుందన్న ఆయన, ఈ తరహా దాడులను ప్రజలంతా ముక్తకంఠంతో  ఖండించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు అనిత తో పాటు  పలువురు మహిళా నాయకురాళ్ల ఫోటోలను వేసి ఫేక్ ఆంధ్ర పేరుతో సోషల్ మీడియాలో వదిలారు.  సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వారిపై  చట్టపరంగా చర్యలు తీసుకోకపోగా, పోలీసులు కేసులు కూడా నమోదు చేయలేదంటే…  ఇది ఎవరి పనో ఇట్టే అర్థమవుతూనే ఉందని  అన్నారు.

నిజాలను నిర్భయంగా చెప్పడానికి, ఈ ప్రభుత్వ అవినీతి అక్రమాలను ఎండగట్టడానికి తన వ్యాపారాలను కూడా రామోజీరావు పణంగా పెట్టి పోరాడుతున్నారని  రఘురామకృష్ణం రాజు తెలిపారు. రామోజీరావు వ్యాపార సంస్థలపై  ప్రభుత్వం చేస్తున్న దాడులను  ప్రజలంతా ఖండించాలని ఆయన కోరారు. ప్రజల పక్షాన ప్రభుత్వంపై ఈనాడు దినపత్రిక ద్వారా  పోరాడుతున్న రామోజీరావుకు సంపూర్ణ సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు.

మార్గదర్శి  సంస్థపై ఒక్క ఫిర్యాదు కూడా లేకపోయినప్పటికీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పదేపదే దాడులు చేస్తోంది. ప్రభుత్వం నమోదు చేసిన కేసులపై తెలంగాణ,  ఆంధ్రప్రదేశ్ హై కోర్టు లు స్టే విధించాయి. అయినా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం  తన దాడులను ఆపడం మానలేదు. మార్గదర్శి రోజు వారి కార్యకలాపాలను అడ్డుకునేందుకు ప్రయత్నించగా, ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించింది.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చి అబద్ధాలు ఆడారు. తాము మార్గదర్శి రోజు వారి కార్యకలాపాలను అడ్డుకోలేదని  పేర్కొన్నారు. మార్గదర్శి రోజు వారి కార్యకలాపాలకు ఎటువంటి అడ్డంకులు కలిగించరాదని ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు  తన ఉత్తర్వులలో ప్రభుత్వం తరఫున ప్రాతినిధ్యం వహించిన హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ తో పాటు ఇతరులను ఆదేశించింది.. అయినా, గుంటూరు పట్టణంలోని అరండల్ పేట మార్గదర్శి బ్రాంచ్ లో  షెట్టర్ల ను మూసివేసి, సీసీ కెమెరాలను తొలగించిన దృశ్యాలు వెలుగు చూశాయి.

మార్గదర్శి సంస్థలపై దాడి కోసం రెండు మానిటరింగ్ గ్రూపులతో పాటు, 37 సబ్ గ్రూపులను  ఏర్పాటుచేసి,  తాడేపల్లి ప్యాలెస్ సమీపంలోని సిఎస్ఆర్ కళ్యాణ మండపంలో వారికి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి, దిశా నిర్దేశం చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని రంగంలోకి దింపి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మార్గదర్శి బ్రాంచ్ లలో అగ్నిమాపక శాఖ  అనుమతులు పరిశీలించడం, విద్యుత్ బకాయిలు, జీఎస్టీ చెల్లింపులు, ఇంటి పన్నులు, భవన నిర్మాణ అనుమతులలో ఉల్లంఘనలను గుర్తించాలని దిశా నిర్దేశాన్ని  చేశారు.

కోర్టు స్పష్టమైన  ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా మార్గదర్శి సంస్థను   జమోరె ప్రభుత్వం వేధిస్తోంది. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను  రంగంలోకి దించి ఏజెంట్లను ఏదో రకంగా భయపెట్టి  కేసులు నమోదు చేయాలని చూస్తోంది. మార్గదర్శి సంస్థ ఏ చిన్న పొరపాటు చేసినా  దాన్ని సాకుగా తీసుకొని సిఐడి పోలీసులు, సమీప పోలీస్ స్టేషన్లో  కేసు నమోదుకు రంగం సిద్ధం చేశారు. సి ఎస్ ఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశానికి హాజరైన సిబ్బందిని మొబైల్ ఫోన్లు వెంట తీసుకురావద్దని ఆదేశించారట.

అయినా, ప్రభుత్వ కుట్ర బయటకు వచ్చింది. ఈ ప్రభుత్వం మరో ఎనిమిది నెలల్లో కూలిపోతుందని  భావించిన వారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ  కుట్రలను బయటపెట్టారు. ప్రభుత్వ దాడులపై  మార్గదర్శి సంస్థ తక్షణమే కోర్టు ధిక్కరణ కింద  న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని రఘురామకృష్ణం రాజు సూచించారు. ఇది మార్గదర్శి సంస్థ పై జరుగుతున్న దాడి కాదు. ఈనాడు దినపత్రిక లక్ష్యంగా జరుగుతున్న దాడి. నిజాలను నిర్భయంగా రాస్తూ, ప్రభుత్వ అవినీతి అక్రమాలను ఎండగడుతున్న  ఈనాడు పత్రిక అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గిట్టడం లేదు . 

ప్రజా ప్రయోజనాలను కాపాడడానికి ఈనాడు దినపత్రిక నిజాలను రాస్తూ, ప్రభుత్వ అవినీతి అక్రమాలను వైఫల్యాలను ప్రజల ముందు చర్చకు పెడుతోంది. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రుచించడం లేదు. నిజాలను రాసే జర్నలిస్టులను బెదిరించడం, మీడియా సంస్థలపై దాడి చేయడం, హింస ద్వారా  ఏదైనా సాధించవచ్చునని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. పద్మ విభూషణ్  అవార్డు గ్రహీత అయిన రామోజీరావు క్యారికేచర్ ను నగ్నంగా వేయడం సిగ్గుచేటు. ఇదేనా సాక్షి దినపత్రిక పాటించే  జర్నలిజం విలువలని రఘురామకృష్ణం రాజు  ప్రశ్నించారు. ఈనాడు దినపత్రికలో కూడా జగన్మోహన్ రెడ్డి నగ్న క్యారి కేచర్ ను ప్రచురిస్తే, ఆయన భరించగలరా?, జగన్మోహన్ రెడ్డే కాదు… మేము కూడా భరించలేము. చెత్త రాతలు, పిచ్చి బొమ్మలు వేయడం అవసరమా? అని రఘురామకృష్ణంరాజు నిలదీశారు.

Related posts

ఈ సారి కేంద్రం జోక్యం ఉండకపోవచ్చు…..?

Bhavani

వైభవంగా గృహాలలో వరలక్ష్మీ నోములు

Satyam NEWS

మహారాష్ట్రలో జనతా కర్ఫ్యూ: కఠిన నిబంధనలతో లాక్‌డౌన్‌

Satyam NEWS

Leave a Comment