23.2 C
Hyderabad
May 8, 2024 00: 58 AM
Slider ప్రత్యేకం

జగనన్న భవిష్యత్తు కాదు… సామాన్య ప్రజలకు విపత్తు

#raghurama

జగనన్నే మా భవిష్యత్తని ఏడు లక్షల మంది ఆయన సైన్యం రాష్ట్ర ప్రజలతో ఒక్కొక్క అక్షరం పలికిస్తారట. అయితే, జగనన్నే  మా విపత్తని రాష్ట్ర ప్రజలందరం  ముక్తకంఠంతో నినదిద్దామని నరసాపురం ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘు రామకృష్ణంరాజు పిలుపునిచ్చారు. నాలుగు కోట్ల ఒక్క లక్ష మంది రాష్ట్ర ప్రజానీకంలో  ఏడు లక్షల మందిని మినహాయించి, మూడు కోట్ల 94 లక్షల మంది ముక్తకంఠంతో  జగనన్న నువ్వే మా విపత్తు అని చెప్పేద్దామని  ఆయన పేర్కొన్నారు.

జగనన్నే మా భవిష్యత్తు అని  చెప్పుకునే ఏడు లక్షల మందికి, ట్విట్ చేసిన విజయసాయి రెడ్డికి మాత్రం జగన్మోహన్ రెడ్డే భవిష్యత్తు అంటూ ఎద్దేవా చేశారు. శుక్రవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… దీదీకి బోలో అనేది  బెంగాల్ లో ప్రజల నుండి వచ్చిన నినాదం. దాన్ని కాపీ కొడుతూ, జగనన్నకు చెప్పుకుందాం అనే పేరుతో కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. మమతా బెనర్జీ, జగన్మోహన్ రెడ్డిలకు  రాజకీయ వ్యూహకర్త  ప్రశాంత్ కిషోరే కావడం వల్లే ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని భావించి ఉంటారు .

జగనన్న టెలిఫోన్ లో దొరికితే  ఆయనకు చెప్పేద్దాం… నువ్వు మాకు అక్కర్లేదని . ఎన్నికలకు ముందు చెప్పింది ఏది ఆయన చేయలేదని  చెబుదాం. మహిళలు మధ్య నిషేధం గురించి, ఉద్యోగస్తుల భార్యలు  తమ భర్తల జీతాలు, పెండింగ్  టి ఏ,  డి ఏ ల గురించి, ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులు తమ కుటుంబ పెద్దల జీతాలు ఇస్తావా? లేదా??అంటూ ప్రశ్నిద్దాం. ఓటు వేసి మీ కూలీగా పనిచేసే  అవకాశం ఇవ్వమని  ప్రజలను మనమే ఎన్నికలకు ముందు అడుక్కున్నాం. జగన్మోహన్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తో సహా తాను కూడా అలా ఓట్లను అడుక్కున్నవారమే.

విజయ సాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి లు ప్రజలను ఓట్లు అడుక్కోలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి  ఏదో మహానుభావుడైనట్లు ప్రజలను చెప్పుకోమనడం ఏమిటి?… నాన్సెన్స్. అందుకే మనమే చెప్పేద్దాం. నువ్వు ఎంతో ఆరగెంటుగా ఉన్నావని, మరొకరిని చూసుకుంటామని   అన్నారు. బానిస స్వభావం ఉన్నవారు కాకుండా, ఆత్మగౌరవంతో బ్రతికే  సాధారణ ప్రజలంతా జగన్మోహన్ రెడ్డికి నువ్వు మాకు అక్కర్లేదని  చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

టాప్ ముగ్గురిలో కాకపోతే  30 మంది జాబితాలో జగన్ ఉంటారు

దేశంలో అత్యంత సంపన్నులలో  అంబానీ, అదాని తరువాత స్థానం లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉంటారని రఘురామకృష్ణంరాజు  అన్నారు. తనకు ఆర్థిక బలం లేదని ఆయన పేర్కొనడం హాస్యాస్పదం. 2012 లో ఎన్నికల అఫిడవిట్ లో 370 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు జగన్ పేర్కొన్నారు. దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దేశంలోనే సంపన్నులలో మొదటి ముగ్గురి జాబితా లో కాకపోతే, 30 మంది జాబితాలో జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా  ఉంటారు.

ఈ నాలుగేళ్లలో ఇసుక, మట్టి, మద్యంలలో గడించిన  ఆదాయం ఎంతో ఆయనే చెప్పాలి. 370 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించిన జగన్ మోహన్ రెడ్డి తాను ధనికుడి కేటగిరిలో రానని భావిస్తుండగా, అంబానీ,  అదాని తరువాత  జగన్మోహన్ రెడ్డి అత్యంత సంపన్నుడని  దేశ ప్రజలు అనుకుంటున్నారు.  తనకు తానే శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్న  జగన్మోహన్ రెడ్డి పార్టీ ఫండ్ అధికారికంగానే  600 నుంచి 700 కోట్ల  రూపాయలు ఉంటుంది. అయినా, తాను బీద వాడినని బీద ఏడుపులు ఏడిస్తే, ప్రజలు విశ్వసించరు.

తనకు అంగ బలం లేదని జగన్ మోహన్ రెడ్డి పేర్కొనడం విడ్డూరంగా ఉంది. నోరు విప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని  ప్రశ్నించిన పాపానికి డాక్టర్ సుధాకర్ ని పోలీసులు  చంపేశారు. చూసి రమ్మంటే కాల్చి వచ్చే  సునీల్ కుమార్ లాంటి అధికారులు జగన్మోహన్ రెడ్డి వద్ద  ఉండగా, శిశుపాలుని మించిన  విజయ పాల్ తో పాటు , కడప బ్యాచ్ తో ఆయన అంగ బలం బీభత్సం గా ఉంది. తనకు అంగ బలం లేదంటూనే తనపై కండబలం చూపించి జగన్ , వేధించి హింసించారు.

అయినా, తనకు అంగ బలం లేదని మీరంటే పిచ్చి వెధవలు ఎవరైనా నమ్మితే నమ్మవచ్చేమో కానీ తాను మాత్రం నమ్మనని రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. తాను ఒంటరి అని జగన్మోహన్ రెడ్డి పేర్కొంటుంటే , రాచిరంపాన పెట్టే వారితో ఎవరు జత కడతారని ప్రజలు అంటున్నారు . బటన్ నొక్కుతున్నానని చెప్పి, ఏమి నొక్కుతున్నారో తెలియదు కానీ, సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఉన్నారని, వారు ఓట్లు వేస్తారనే ధీమాతో ఎవర్ని ఆయన కలుపుకొని వెళ్లడం లేదు.

ఎవరు కూడా మీతో కలిసేందుకు సిద్ధంగా లేరు. అడిగినప్పుడు అప్పు ఇచ్చే వ్యవస్థ మాత్రం మీతోనే ఉన్నది.  ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్పు ఇచ్చి ఆదుకుంటున్నారు. కరువు ఉన్నా కూడా  మీ అప్పుకు మాత్రం  కరువన్నదే లేకుండా పోతోందన్నారు.

Related posts

స్వలాభం కోసమే కందాల పార్టీ మారారు

Bhavani

రైతును రాజును చేసేందుకే రైతు వేదికల ఏర్పాటు

Satyam NEWS

‘షూట్-అవుట్ ఎట్ ఆలేరు’ ట్రైలర్ విడుదల

Satyam NEWS

Leave a Comment