42.2 C
Hyderabad
May 3, 2024 16: 19 PM
Slider ప్రత్యేకం

త్రిబుల్ ఆర్ కొత్త సీరీస్: రైతు బకాయిలు చెల్లించు జగనూ

#RRR

వరుస లేఖలతో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు నేటి నుంచి మరో కొత్త సీరీస్ ప్రారంభించారు. రైతు దినోత్సవం సందర్భంగా ఆయన కొత్త సీరీస్ లో తొలి లేఖను ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి సంధించారు. ధాన్యం సేకరణ బకాయిలు తక్షణమే చెల్లించాలని ఆయన ‘‘అత్యంత విధేయతతో’’ డిమాండ్ చేశారు. పార్టీ పేరులోనే కాదు మన గుండెల్లో కూడా రైతులు ఉండాలని ఆయన సూచించారు. రఘురామకృష్ణంరాజు రాసిన లేఖ పూర్తి పాఠం ఇది:

ముఖ్యమంత్రి గారూ,

పచ్చని పైరుకి నీరు లేక రైతు కన్నీరు పెడుతున్నాడు

చెమటోడ్చి పంటను పండించు రైతు చెమ్మగిల్లుతున్నాడు

భారత దేశ వెన్నుముక అన్న రైతు వెన్ను విరిగి మూలకి చేరుతున్నాడు

కోట్ల కడుపుల ఆకలి తీర్చు రైతు ఆకలికి ప్రాణం విడుస్తున్నాడు

రైతును కాపాడుకుందాం

భవిష్యత్తులో మనం ఆకలికి చచ్చే రోజు రాకుండా చూసుకుందాం

ప్రియమైన నాయకుడు డాక్టర్ వై ఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన గురించి ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. ఆరుగాలం శ్రమిస్తూ మనందరికి అన్నం పెడుతున్న రైతులకు డాక్టర్ వై ఎస్ రాజశేఖరరెడ్డి అంటే ఎంతో అభిమానం. ఆయనకు కూడా రైతులంటే ప్రాణం. అయితే ఆంధ్రప్రదేశ్ లోని రైతులు నేడు అత్యంత తీవ్రమైన సమస్యలలో కొట్టుమిట్టాడుతున్నారు. మన ప్రభుత్వం నుంచి ఏ మాత్రం వారికి సహాయం అందడం లేదు.

మనం 1.83 లక్షల మంది రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి రూ.1,619 కోట్ల మేరకు చెల్లింపులు జరపాల్సి ఉంది. ధాన్యం సేకరణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.3,299 ఇప్పటికే విడుదల చేసింది.

నేను నా నియోజకవర్గంలో తిరగకుండా చేసేందుకు మీ మనుషులు పోలీసు కేసులతో అందరిని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. అయితే నేను మాత్రం నా నియోజకవర్గ ప్రజలతో సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నాను. నా నియోజకవర్గానికి చెందిన రైతులు తాము పండించిన ధాన్యాన్ని పౌర సరఫరాల శాఖ కు అమ్మారు. అయితే ఆ శాఖ నుంచి ఇప్పటి వరకూ వారికి చెల్లించాల్సిన డబ్బులు అందలేదు.

ఇప్పుడు ఎవరైనా మంత్రి నా నియోజకవర్గంలో పర్యటిస్తే వారిని ధాన్యం సేకరణ బకాయిల కోసం నిలదీసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నట్లు నాకు సమాచారం అందింది. గత కొద్ది నెలలుగా వారు డబ్బు కోసం వేచి చూసీ చూసీ విసిగిపోయి ఉన్నారు. ఇటీవల వారు ధాన్యాన్ని నడి రోడ్డుపై పోసి తగుల బెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు కూడా.

ఈ నిరసన ఉద్యమంలా మారి పౌర సరఫరాల శాఖ అధికారులను అడ్డుకున్నారు. తమ నుంచి సేకరించిన ధాన్యానికి ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో అవి రైస్ మిల్లర్ల వద్దే పడి ఉన్నాయని కూడా రైతులు అంటున్నారు. ప్రయివేటు వ్యాపారుల నుంచి తీసుకువచ్చిన అప్పు కు వడ్డీలు పెరిగిపోవడం తదితర కారణాలతో ప్రభుత్వం సేకరించని ధాన్యాన్ని రైతులు విధిలేని పరిస్థితుల్లో, గత్యంతరం లేక అతి తక్కువ ధరలకు అమ్ముకోవాల్సిన దుస్థితిలోకి వచ్చారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులంతా మన ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమనే స్థిరమైన నిర్ణయానికి వచ్చేశారు. గత ఏడాది కరోనా మహమ్మారి తీవ్రంగా ఉన్నా కూడా మన రైతులు రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తిని సాధించారు. ఎలాంటి కఠినమైన నిబంధనలు లేకుండా రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామని మీరు ఎంతో ఆర్భాటంగా ప్రకటించారు.

అయితే మీ మంత్రి, సంబంధిత అధికారులు మాత్రం ధాన్యంలో తడి ఉందని, తేమ శాతం పెరిగిందని రకరకాల కుంటి సాకులు చెప్పారు. అలా అనేక నిబంధనల మధ్య సేకరించిన ధాన్యానికైనా చెల్లింపులు చేశారా అంటే అదీ లేదు. గత సంవత్సరం తొలి పంటలో సేకరించిన ధాన్యానికే మీరు చెల్లింపులు జరపలేదు. మీ ఈ ప్రవర్తన, రైతు సంక్షేమంపై ప్రభుత్వ ప్రకటనలకు వాస్తవ పరిస్థితికి మధ్య వ్యత్యాసాన్ని వెల్లడిస్తున్నది.

మన ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు పెట్టిందీ అంటే మట్టి, బెడ్డలు, ఇసుక లాంటి వ్యర్ధాల శాతం ఏ గ్రేడులో అయితే ఒక శాతం కూడా దాటకూడదట. అదే విధంగా తాలు శాతం కూడా ఒకటికి మించకూడదని నిబంధన పెట్టారు. రంగుమారిన, మొలకెత్తిన, తడిసిన ధాన్యం ఐదు శాతం కన్నా మించకూడదని నిబంధన కూడా పెట్టారు.

నూకల శాతం పైకూడా నిషేధం పెట్టి అది మూడు శాతం దాటకూడదన్నారు. తేమ శాతం 17 కన్నా ఎక్కువ ఉంటే అలాంటి ధాన్యాన్ని సేకరించేది లేదని కూడా ధాన్యం సేకరణ కేంద్రాల్లో రైతులకు చెప్పారు. రైతులు ఎంతో శ్రమపడి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చిన తర్వాత ధాన్యం సేకరణ అధికారులు ఇంతటి కఠినమైన నిబంధనలు చెబుతూ అక్కడిదాకా తీసుకువచ్చిన ధాన్యం సేకరణను తిరస్కరించారు. అలా అధికారులు తిరస్కరించగానే అక్కడకు మిల్లర్లు వచ్చి అదే ధాన్యాన్ని కొనుగోలు చేసేవారు. అంటే అధికారులు మధ్యదళారులు కలిసి మిల్లర్లకు అనుకూలంగా ఇలా చేశారని రైతులు అర్ధం చేసుకున్నారు.

జిల్లాల్లో ఎంతో మంది పెద్ద మిల్లర్లు ఉన్నా కూడా ధాన్యం సేకరణ చేసి వాటిని మరపట్టి పౌర సరఫరాల శాఖకు సరఫరా చేసేందుకు ఎంపిక చేసిన కొందరు మిల్లర్ల కే ప్రాధాన్యతనిచ్చారు. 25 శాతం నూకల వరకూ ప్రభుత్వం మిల్లర్లకు అనుమతినిచ్చింది. క్వింటాలు ధాన్యానికి రూ.15 మరపట్టేందుకు మిల్లర్లకు ప్రభుత్వం చెల్లించింది. అయితే ఎక్కువ పంట కొనుగోలు కేంద్రాల వద్దకు రాగానే నూకల శాతాన్ని అమాంతంగా 15 శాతానికి తగ్గించారు. ప్రభుత్వం ఆకస్మికంగా తీసుకున్న ఈ నిర్ణయం మిల్లర్లు రైతుల నుంచి ధాన్యం తీసుకోవడంపై తీవ్ర ప్రభావం చూపింది.

సుమారు 600 కిలోలు ఉండే పుట్టిని మిల్లర్లు, మధ్య దళారీలకు రూ.9,000 చొప్పున ఇస్తున్నారు. క్వింటాలుకు అదనంగా ఐదు కిలోల ధాన్యాన్ని వారు తీసుకుంటున్నారు. రంగు మారిన ధాన్యాన్ని కూడా మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తున్నా కూడా అధికారులు తీసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.

అధికారులు పూర్తిగా మిల్లర్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కూడా రైతులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. రైతు నుంచి మిల్లర్లు తక్కువ ధరకు కొనుగోలు చేసి ఒక్కో పుట్టిపై రూ.3000 అదనంగా లాభం పొందుతున్నారు. అందువల్ల నేను మిమ్మల్ని కోరేది ఏమంటే మధ్య దళారీల ప్రమేయం లేకుండా చేయండి. ధాన్యం కొనుగోలును మరింత పారదర్శకంగా చేపట్టండి.

ప్రతికూల వాతావరణ పరిస్థితులు లేకుండా, దిగుబడి బాగా ఉంటే వరి ధాన్యం ఎక్కువగా పండించే నెల్లూరు, కర్నూలు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలో ఎకరానికి 23 క్వింటాళ్ల ధాన్యం ఉత్పత్తి అవుతుంది.

ధాన్యం ఉత్పత్తి ఖర్చు చూసుకుంటే ఈ ఏడాది కనీస మద్దతు ధరలో స్వల్ప పెరుగుదల ఉన్నా కూడా రైతుకు మిగిలేది చాలా తక్కువే. కరోనా మహమ్మారి కారణంగా కూలీలు దొరక్కపోవడం, ఇంధనం ఖర్చు పెరిగిపోవడం, యంత్రపరికరాలు అందుబాటులో లేకపోవడం తదితర కారణాలతో పెరిగిపోతున్న పంట పెట్టుబడిని మీరు ప్రతి ఏటా బడ్జెట్ లో కేటాయిస్తున్న ధరల స్థిరీకరణ నిధుల నుంచి రైతులకు పరిహారం రూపంలో చెల్లించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ధరల స్థిరీకరణ నిధి కింద మీరు ప్రతి ఏటా రూ.3000 కోట్లు బడ్జెట్ లో కేటాయిస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మీరు రైతును ఆదుకోవాలని కోరుతున్నాను. ఇందుకోసం నేను ప్రతిపాదించేది ఏమిటంటే మీరు తక్షణమే వ్యవసాయ సలహా సంఘాన్ని క్రియాశీలం చేయండి.

వరి ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా పంట కళ్లాల నుంచే కొనుగోలు చేయండి. వ్యవసాయ శాఖ ను, పౌరసరఫరాల శాఖను సమన్వయంతో పని చేయమని చెప్పండి. పంటలు వేసే రోజు నుంచే వ్యవసాయ సలహా సంఘాలు రైతుకు బాసటగా నిలవాలని నిర్దేశించండి. వివిధ రకాల కారణాలతో వరి పంట లాభసాటిగా లేకపోతే రైతులకు ప్రత్యామ్నాయ పంటలను సూచించేలా వ్యవసాయ సలహా సంఘాలను సిద్ధం చేయండి. ఇలా చేయడం వల్ల రైతు తన ఆదాయాన్ని కోల్పోకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిర్దేశించండి.

ఈ సలహా సంఘాలు రైతు భరోసా కేంద్రాలతో సమన్వయంతో పని చేసే విధంగా విధి విధానాలు రూపొందించండి. చాలినన్ని గోనె సంచులను కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలివ్వండి. ధాన్యం సేకరణ సమయంలో తేమ శాతాన్ని కొలిచే పరికరాలను రైతు భరోసా కేంద్రాలలో అందుబాటులో ఉంచండి.

ఈ మొత్తం వ్యవహారాన్ని నిర్దేశిత సమయంలోనే చేయాలి. అంతే కాదు. నేరుగా ప్రభుత్వమే చేసి మధ్యదళారులను పూర్తిగా నిర్మూలించాలి. నేడు రైతు దినోత్సవం సందర్భంగా నేను మిమ్మలను కోరేది ఒక్కటే. దయచేసి రైతుల బాధలు అర్ధం చేసుకోండి. ధాన్యం సేకరణ బకాయిలను తక్షణమే చెల్లించండి.

అందుకోసం కేంద్రం విడుదల చేసిన నిధులను అందుకే వినియోగించండి. కేంద్ర ధాన్యం సేకరణ కోసం కేంద్రం ఇచ్చిన నిధులను ఇతర పథకాల కోసం మళ్లించకండి. మన పార్టీ పేరులో రైతును పెట్టుకోవడం కాదు…. రైతును మన గుండెల్లో కూడా పెట్టుకోవాలి.

భవదీయుడు

కె.రఘురామకృష్ణంరాజు

Related posts

చేసిన అప్పులో 48 వేల కోట్లు ఎవరి జేబుల్లోకి పోయాయి?

Satyam NEWS

హైదరాబాద్‌ – గుంటూరు బస్సులో మంటలు

Bhavani

బెగ్గర్ బట్:జస్ట్ చేంజ్ ఇదో బిచ్చగాడి సినిమా కథే

Satyam NEWS

Leave a Comment