29.7 C
Hyderabad
May 3, 2024 06: 42 AM
Slider ప్రత్యేకం

ఈ బాలుడు పలుభాషల పలుకుతోడు

#SP Balasubrahmanyam

(శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం పుట్టినరోజు శుభసందర్బంగా సత్యంన్యూస్ ప్రత్యేకం)

ఈ బాలుడు జీనియస్. సహజ ప్రతిభా సంపన్నుడు.  పదహారు అణాల ఆంధ్రుడు. పదునారు కళల పరిపూర్ణుడు. ఈయన మొదటి ప్రతిభ: గ్రహణశక్తి ( grasping power).  ఏ అంశాన్నైనా విన్న  వెంటనే, తెలుసుకున్న వెనువెంటనే అద్భుతంగా గ్రహించే లక్షణం.

రెండవ ప్రతిభ అసాధారణమైన ధారణ, అంటే: జ్ఞాపకశక్తి. మూడవ ప్రతిభ: నటనా కౌశల్యం. నాల్గవ ప్రతిభ: అనుకరణ. ఒక దృశ్యాన్ని, ఒక భావాన్ని, ఒక వ్యక్తిని అవలీలగా పునః ప్రతిష్ఠ చేయగలిగిన శక్తి. అది ధ్వని రూపంలో, వ్యక్తీకరణ రూపంలో, నటనా రూపంలో. ఐదవ ప్రతిభ: గానం.

రసజ్ఞ  ప్రజ్ఞామూర్తి ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

ఆరవ ప్రతిభ: స్వర రచన. ఏడవ ప్రతిభ: అనేక సంగీత వాయిద్యములను అలవోకగా వాయించే లయాత్మక ప్రజ్న. ఇలా…  సప్త ప్రతిభలు సహజంగా ధరించిన ‘శక్తి’ స్వరూపుడు. ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం = శక్తి. సహజ ప్రతిభతో,  అభ్యాసంతో వ్యుత్పత్తి (పాండిత్యం) సాధించిన రసజ్ఞ  ప్రజ్ఞామూర్తి…

.. ఇంత చెప్పినా ఏదో తరుగు కనిపిస్తుందీ అంటే ఆయనను అక్షరాలలో బంధించలేమని అర్ధం కావడం లేదూ…. అంతటి అసమాన్యుడు ఇంకెవరూ? ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం కాక. తండ్రి నుండి తల్లి నుండి అద్భుతమైన గాత్రాన్ని పంచుకొని పుట్టిన గాన గంధర్వుడు ఎస్ పి.

గాత్రం= శరీరం అని కూడా అర్ధం. ఆయన తండ్రిగారి సొంత ఊరు ప్రకాశం జిల్లా మాచవరం. అమ్మ గారిది కోనేటంపేట. ఇది తెలుగువాళ్ళు, తమిళులు కలిసిమెలిసి ఉండే గ్రామం. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఈ ఊరు ఉంది. ఇది ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు ప్రాంతం. ఇక్కడే ఈ బాలుడు పుట్టాడు.

పనిపట్ల ఏకాగ్ర ధ్యానచిత్తం

తండ్రి శైవ ఆరాధ్యులు, తల్లి 6000 నియోగులు. నేను ‘ అర నియోగిని’…అని చమత్కరిస్తూ ఉంటారు. ఈ వైయుక్తక అంశాలు అలా ఉంచితే… వీరు నూటికి నూరు శాతం ఆయన ఒక యోగి, ఒక ధ్యాని. ఒక యోగబలం వల్ల ఇలా జన్మించి, తాను చేసే పనిపట్ల ఏకాగ్ర ధ్యానచిత్తంతో ఉంటారు..

అదే యోగం.అదే ధ్యానం.అలా జీవించేవాడెవడైనా ‘యోగి’ అవుతాడు. ఇది ఒక తపస్సు.అదే!   యశస్సును ప్రసాదిస్తుంది! .మ్యాథమెటిక్స్ లో చాలా ప్రజ్ఞావంతుడు. సైన్స్ సబ్జక్ట్స్ లోనూ అదే ప్రతిభ కల్గినవాడు. అందుకే, Mathematical thinking, Scientific approach, Esthetic sense  సహజంగా ఉన్నాయి.

అలవోకగా అద్భుతంగా…

ఇవ్వన్నీ తాను ఎంచుకున్న రంగంలో శిఖరసమానుడుగా  ఎదగడానికి అద్భుతమైన మార్గాలు వేశాయి. ఈ వ్యక్తి/శక్తి  ప్రతిభను ప్రత్యక్షంగా దర్శించే సౌభాగ్యం నాకు 20ఏళ్ళ క్రితం కల్గింది. రావి కొండలరావుగారి  దర్శకత్వంలో, గొల్లపూడి మారుతిరావుగారు గిరీశం పాత్రగా ” కన్యాశుల్కం” సీరియల్ నిర్మించే సందర్బంగా మా ఇద్దరికీ మొట్టమొదటగా వ్యక్తిగత పరిచయం ఏర్పడింది.

అది అప్పటి నుంచి వికసించి, క్షణ క్షణ ప్రవర్థమానమైంది. ఆ సీరియల్ కు నేను పర్యవేక్షకుడ్ని. అనుసంధానకర్తను. దీనికోసం ఒక శీర్షికా గీతం రాయించాలనుకున్నాం. మిత్రుడు రాంభట్ల నృసింహశర్మతో రాయించాం. మాధవపెద్ది సురేష్ సంగీత దర్శకుడు. ఇది చాలా పెద్ద పాట.  ” తెలుగు కథకు శ్రీకారం- మెరిసే ముత్యాలసరం- అక్షరాల అడుగుజాడ -అతనే మన గుఱజాడ”….. ఇలా సుదీర్ఘంగా ఈ పాట సాగుతుంది. పాడటానికి  ఆ బాలుడు వచ్చాడు.

ట్రాక్ సింగర్ ఆ పాట రెండు సార్లు వినిపించాడు. అంతే!! అలవోకగా, అవలీలగా, పరమాద్భుతంగా ఆ పాట పాడేశాడు. ఆయన పాడుతూ ఉంటే నాకు   ఒళ్ళు గగుర్పొడిచింది. వెంట్రుకలు నిక్కబొడుచు కున్నాయి.

రసప్లావితంగా పాడే గానప్రజ్ఞ ఆయన సొంతం

కళ్ల నుండి ధారాపాతంగా ఆనంద భాష్పాలు రాలాయి. అదీ ప్రతిభ. ఆయన పద్యసాహిత్య రంగంలోకి వచ్చి ఉంటే?  అనంత సహస్రావధాని అయ్యిఉండేవాడు. అంతటి ధారణాబలం. అంతే స్థాయి భావప్రకటనా శక్తి. రసప్లావితంగా పాడే గానప్రజ్ఞ ఆయన సొంతం. ఆయనకే సొంతం. ఇది నా ప్రత్యక్ష అనుభవం.

నటుడుగా వచ్చి ఉంటే?  మనకొక మరో మహానటుడు సొంతమై ఉండేవాడు. ఆ చేతికి కవితామయ శక్తి కూడా ఉంది. అది అప్పుడప్పుడు  మనకు దర్శనమవుతూ ఉంటుంది. ప్రయోక్త ప్రతిభ. జ్ఞానపీఠాధిపతులు డాక్టర్ సి.నారాయణరెడ్డి  స్వయంగా  ప్రయోక్త కతృత్వం ఇక నుండి.. నువ్వు చెయ్యి… అంటూ ఈ బాలుడిని స్వాగతించారు.

ఆ బాలుడు ప్రయోక్తగా మారినప్పుడు అది కని విని అనుభవించాల్సిందే. ‘ప్రతిభ’ నవ నవోన్మేషశాలిని, అంటారు కదా?  ఆ వాక్కులు  ప్రవహిస్తున్నప్పుడు, ప్రసరిస్తున్నప్పుడూ ఒక పదానికి మించిన పదం ఇంకొకటి వచ్చి చేరుతూ ఉంటుంది. ఇది వాగ్వవైఖరీ ప్రతిభ. ఇది దైవదత్తం. ఆ గానంలో హాస్య, శృంగార, వీర రసాలు  పరమోన్నతంగా ఆవిష్కారం అవుతాయి.

స్నేహశీలత, ప్రేమతత్వం నిండిన పరిపూర్ణుడు

స్నేహశీలం, ప్రేమతత్వం, కృతజ్ఞత  పితృదేవతల నుండి పొందిన వరాలు. ప్రేమతత్త్వం, దాతృత్వం  తల్లినుండి పేగుబంధంగా తెచ్చుకున్న సుగుణాలు. తోబుట్టినవారితో పాటు  స్నేహితులకు తన ప్రేమను, చేయూతను విరివిగా పంచాడు. సహనం సాధన చేశాడు.

కోపం జయించాడు. కోట్లాది  హృదయాలు కొల్లగొట్టాడు. ఈ ప్రతిభా ‘మణి’కి, రసధునికి, ఎప్పటికీ బాలునికి, ఆబాలగోపాల’ బాలు’ నికి, గానానంద, జ్ఞానానంద స్వరూపునికి, పామర,పండితారాధ్యునికి  అభినందన వందన చందనములు

– మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

తెలంగాణ అభివృద్ది చేసింది టి‌డి‌పినే

Murali Krishna

గురుస్వాములను సత్కరించిన  టి టీ డి పి రాష్ట్ర కార్యదర్శి

Satyam NEWS

సామాజిక సంఘసంస్కర్త ఫాతిమా షేక్ జయంతి

Bhavani

Leave a Comment