32.2 C
Hyderabad
May 9, 2024 22: 59 PM
Slider కవి ప్రపంచం

అక్షరనీరాజనం

#PolamarasettiKrishnaraoSP

వెళ్ళిపోయావా బాలూ!

మమ్మల్ని విషాదం వాకిట వదలి

పాటను ఒంటరిని చేసి

అలా…ఎలా వెళ్ళిపోయావు?

నీ పాటతో మేల్కొనే బతుకుల్ని

నిర్దాక్షిణ్యంగా వదిలేసి

ఎలా నిష్క్రమించావు బాలూ?

బాలూ!…బాలూ!…బాలూ!

నిన్ను అలానే ముద్దుగా పిలుచుకుంటాం

ఆప్యాయంగా గుండెల్లో

నింపుకున్నాం మరి !

ఎందుకంటే…

నీవు మావాడివి..

మా అందరిలో ఒకడివి..

పాటల పొత్తిళ్ళలో మమ్మల్ని

హత్తుకున్న ఆత్మీయుడివి

ఆ మృదుమధురకంఠంతో..

ఎన్నెన్ని గానామృత కలశాలు

ఒలికించావు..

ఎన్నెన్ని సుస్వరసరాగ రాగ విపంచికలు పలికించావు…

ఏమని పొగడాలి నిన్ను?

ఒకటా….రెండా….

నలభైవేల గీతమాలికలతో

కళామతల్లి గళసీమను

శోభగా అలంకరించావు

అనన్యసామాన్య బహుముఖ

ప్రజ్ఞాశీలివి నీవు

స్నేహధర్మానికి భాష్యంకర

అజాతశత్రువు నీవు

అసంఖ్యాక అభిమానుల

గుండెగుడులలో కొలువైన

నిండైన దైవస్వరూపం నీవు

రాగాలసిగలో నిండు జాబిల్లివి

సంగీత గగనాన ఉత్తుంగ శిఖరానివి నీవు

స్వరసురఝరీ తరంగానివి

పుంభావసరస్వతీ వరప్రదాయ ధన్యజీవివి నీవు

నీవు ఆకస్మాత్తుగా వెళ్ళిపోతే…

‘ స్వరాభిషేకం’ నిర్వీర్యం కాదా?

‘ పాడుతా తీయగా’ పరవశించగలదా ?

అయినా…..

ఎందుకింత తొందర నీకు?

గంధర్వలోకాన్నీ ఉధ్ధరించాలని

వడివడిగా వెళ్ళి పోయావా?

అద్వైతసిద్ధికి, అమరత్వలబ్ధికి

ఇప్పుడేమంత తొందర నీకు?

నీ గానామృతవృష్టిలో ఇంకా

తడవాలనే తనివి తీరనేలేదు

ఇకపై….దొరకునా మాకు

పాటలఒడిలో సేదతీర్చు హాయి

తేటతెలుగుమాటల తీపిగుళికల మృదుకేళి…

ఓ బాలూ!

మా బాలూ!

భౌతికంగా మాకు దూరమైనా

పాట ఉన్నంతకాలం

నీ స్వరం…నీ గాత్రం

అమరం…అజరామరం బాలూ!

పొలమరశెట్టి కృష్ణారావు, ఉప్పల్, హైదరాబాద్

Related posts

విశాఖలో నాదెండ్ల మనోహర్ కు ఘన స్వాగతం

Satyam NEWS

కొల్లాపూర్ లో తెలంగాణ సిఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

Satyam NEWS

కుక్కలు బెడద నుండి ప్రజలను కాపాడండి

Bhavani

Leave a Comment