29.7 C
Hyderabad
May 3, 2024 06: 12 AM
Slider కవి ప్రపంచం

మేమిట్లాగే ఉంటాము గాంధీ ‘జీ’

#Kondapally Niharini

ఖండఖండాలుగా మనసులు తెగ్గొట్ట బడుతున్న

కాలవిధ్వంసాల కూడళ్ళలో కర్రపట్టుకొని

మౌనంగా నిలుచున్నావు బాపూ!

ఖండాంతరాల్లోని జాతివివక్ష కోసం కొట్లాడినవో,

కన్నభూమి అభాగ్యుల ప్రక్కన నిల్చి ఆలోచనాగ్నిరాజేసావో!

ఇప్పుడెవరికికావాలి?అప్పటవసరమది!

నువ్వేమో అన్నదమ్ములవలె ఉండాలన్నావ్

ఇదేమో స్వార్థ సంకుచితబొంత!

సోదరభావ రక్తపాశాలు క్రౌర్యాన్ని రాలుస్తున్నవి.

స్వంతలో అంతలేదని కాపట్యాన్ని పూస్తున్నవి.

మనిషుల్నినమ్మలేని అపనమ్మక కుప్పల్లోబూడిదవుతున్నరు.

నువ్వేమో విబూదిరేఖలా మెరవండన్నావు.

మద్యం మానరా,మానిసుఖింపరా అనీ అన్నావు.

నీతులు చెప్పడమేకాదు నీవూ ఆచరించావు అనంటే,

అది ఆయన అవసరమని అంటున్నదీలోకం !

మితాహారం తీసుకో,గీతాపారాయణం చేసుకో

మతాలెన్నైనా సమానత్వ మానవత్వాలే

మంచివంటూ ,

ఏవేవో చెప్తూనే జీవతకాలమంతా ఎట్లా నటించగలిగావ్?

పిడికెడు ఉప్పు పట్టుకొని సత్యాగ్రహం అక్కడెక్కడోచేస్తే

ఇక్కడివరకెట్లాప్రాకి విద్వత్ విద్యుత్తై విలక్షణ

పోరునెట్లా చేసిరో, చీమూనెత్తురున్న ఆల్ ఇండియన్స్

ఒక్కత్రాటిపైకి ఎట్లవచ్చిరో!

అంతా బిట్టర్ కన్ఫ్యూజన్ !!

ఏమో బాపూ, వడ్డించిన విస్తరిగా

స్వేచ్ఛ వచ్చి ముందుకూర్చున్నాక,

నాటి బ్రిటిష్ పాలకులు చులకనచేసిన భావాలెవరికి కావాలిపుడు?

ఇంగ్లీషు మా జీవనంతో అల్లుకుపోయి,

అతుక్కుపోయి….

తెలియని హాయినిస్తుంటే

యాదిమరుపుల కత్తుల బోనులలో నిదురించే మేముండేదెన్నాళ్ళో,

ఏ కరోనా మింగేస్తుందో ?

నీవేమో  గుండెల్లో నడయాడే సత్యశీలిగా

యంగ్ ఇండియాను ఎల్లవేళల ఆలోచించావు.

గోడకేళాడే జ్వలితచిత్రంగా చూస్తున్నా, ఎప్పుడూ కొల్లాయిగట్టలేము

పొట్టచేతబట్టే రోదనలప్రక్కనా నిలబడలేము!

కారణజన్ములంగాక మేమిట్లాగే ఉంటాము గాంధీ ‘జీ’.

కొండపల్లి నీహారిణి

Related posts

పార్లమెంట్‌లో ‘అదానీ’ రభస

Murali Krishna

పల్లె ప్రజల సృజనాత్మక శక్తిని గుర్తించమే మా లక్ష్యం

Satyam NEWS

ఢిల్లీ హింసపై 22 కేసులు నమోదు చేసిన పోలీసులు

Satyam NEWS

Leave a Comment