33.7 C
Hyderabad
April 29, 2024 02: 45 AM
Slider కవి ప్రపంచం

సింహావలోకనం

#Kondapally Niharini

ఏ ఏటికాఏడు క్షణాల వెతుకులాటల్లో

కొన్ని రోజుల్ని కొన్ని వారాలనీ కొన్ని నెలలనీ దాటివస్తుంటే

రాలిపడే ఆకులూ ఎదురుపడే నిచ్చెనలూ సమానమంటావు.

ఒకానొక వేకువను వదలివచ్చిన కాంతిలా

పన్నెండు మాసాల్ని ప్రాయికంగానే తెచ్చుకున్న సాలు,

మానవ వికృతత్వానికి అసామాన్యమైపోయి ,

ప్రకృతి ముగ్ధరహస్యాలను పెడచెవిన పెడతావు.

కలల కల్లోలతెరమీద కన్నీటిదృశ్యాలున్నా,

కడలీ నావల కనువిందు నుండి

కథనమంతా లోకోక్తుల్లో చేరి సందేశమై అందింది.

కష్టనష్టాల అమావాస్యలు దాటి,నెలవంకలమవుదామనే బ్రతుకు ప్రేమ

ఎక్కడో ఓ చోట చద్దన్నం మూటగా పెద్దల మాటను అందుకోదూ!

కార్తీక మాస సూర్యనమస్కారాలు

మంచివట,తులారాశి సంక్రమణం ప్రవేశమయిన సందర్భాన!

నదీస్నానమో, సముద్రమునకలో ఒంటి రుగ్మతలు వదిలిస్తాయి.

ప్రాతఃకాల ఆదిత్యహృదయం

నీ కంఠ రవమైనప్పుడు,

కృత్తిక నక్షత్రం వెళ్ళిపోని కార్తీకస్నాన సహిత ధ్యానం నీ హృదయ సౌందర్యమై మెరుస్తుంది.

కసిరి విసిరినా, కావాలని కోరినా

అరుచిని పోగొట్టే ఉసిరి సిరినే అడుగు.

అలసిన మనసులకు తులసి విశేషం ఓ స్నేహ హస్తం!

ఔషధ మూలికల జ్ఞాన సంపద సంస్కృతి చిహ్నం , చక్కని విజయమిది

నేలమ్మతో అనుబంధమిది.

శీతాంశుడు వదిలిపోని వేళ ,     

ద్వాదశ దీపంలా ఓ వెలుగునిచ్చే వేళ ,

శతసహస్రకోట్ల మానవాళిని పలకరించే వేళ,

వేకువనే పలకరించే అఖండ ఆకాశ దీపం ,ఆశాదీపమే!!

ఆపద్భాందవుడే!!

గగన సౌందర్యాలకు పుడమి పులకింత

శరత్కాల హిమబిందుస్నేహ పరిమళం .

నిలువు మిద్దెల ఇరుకు బతుకులు,

మురికికాలువలెనుక బతుకులు ,

పల్లె పట్నపు భేదమొద్దనె ధర్మాచరణ పథికులైతే

నవనవోన్మేష  సంతాసాల కార్తీక వనభోజనాల మధురభావనలు మరవరు,

ప్రగతికి  ప్రకృతికి  అవినాభావ కంకణబద్ధ సంబంధాన్ని మరవక ఉపవాస దీక్షాబద్ధులూ అయి  గుడెగదిలోకి పండుగలను ఆహ్వానించరూ!!

-డా।। కొండపల్లి నీహారిణి

Related posts

20న కొల్హాపూర్ కు ప్రియాంక

Bhavani

బీఆర్ఎస్ మేనిఫెస్టో చూస్తే పిల్లి కూత కూసినట్టు ఉంది

Satyam NEWS

చోరీ…. చోరీ: విద్య‌ల‌ న‌గ‌రమా ? దొంగ‌ల న‌గ‌ర‌మా ?

Satyam NEWS

Leave a Comment